Share News

లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:40 AM

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఎంత వేగంగా పెరుగుతున్నా.. ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే హవా. యూపీఐ చెల్లింపులు.. ఈ-కామర్స్‌ కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు...

లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా

చిన్నచిన్న చెల్లింపులకే యూపీఐ

రికార్డు స్థాయికి నగదు చలామణి మే 15 నాటికి రూ.42.8 లక్షల కోట్లకు చేరిక

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఎంత వేగంగా పెరుగుతున్నా.. ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే హవా. యూపీఐ చెల్లింపులు.. ఈ-కామర్స్‌ కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, రోడ్‌ సైడ్‌ టీ స్టాల్స్‌, పెట్రోల్‌ బంకుల వద్ద జరిగే చిన్నచిన్న చెల్లింపులకే పరిమితమవుతున్నాయి. యూపీఐ ద్వారా రోజుకు రూ.లక్ష వరకు లావాదేవీలు చేపట్టే అవకాశం ఉన్నా పెద్దమొత్తంలో విలువ ఉండే చెల్లింపులన్నీ ఇప్పటికీ నగదు రూపంలోనే జరుగుతున్నట్టు ఆర్‌బీఐ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. దీంతో గత నెల 15 తేదీ నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ (సీఐసీ) రికార్డు స్థాయిలో రూ.42.8 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో చలామణిలో ఉన్న నగదు వాటా మాత్రం 11.5 శాతం నుంచి 11.1 శాతానికి తగ్గింది.

కుటుంబాలకు నగదే ముద్దు

చాలా కుటుంబాలు ఇప్పటికీ నగదుకే ఓటేస్తున్నాయి. అందరికీ డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన లేకపోవడం, తమ అక్రమ ఆర్థిక లావాదేవీల వివరాలు ఎక్కడ ఆదాయ పన్ను (ఐటీ) అధికారులకు తెలిసిపోతాయనే భయమూ ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ‘కొంతమంది పన్నులు చెల్లించేందుకు ఇష్టపడరు. అలాంటి వ్యక్తులు తమ ఆర్థిక లావాదేవీల వివరాలు నమోదయ్యేందుకు ఇష్టపడరు. అలాంటి వ్యక్తులు ఇప్పటికీ నగదు లావాదేవీలకే ఇష్టపడుతున్నారు’ అని ప్రముఖ ఆర్థికవేత్త అభిరూప్‌ సర్కార్‌ చెప్పారు. కుటుంబ సభ్యులు, స్థానిక రిటైల్‌ వ్యాపారులు జరిపే నగదు, యూపీఐ లావాదేవీలపై ఆర్‌బీఐ చేపట్టిన ఒక సర్వేలోనూ ఇదే విషయం తేలింది. వీటికి తోడు ఆర్థిక సౌలభ్యం, అత్యవసర పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉండడం, వైద్య అవసరాలు, యూపీఐ లావాదేవీల్లా నెట్‌వర్కింగ్‌ సమస్యలు లేకపోవడం కూడా ఇందుకు కారణమని ఆ సర్వే పేర్కొంది. డిజిటల్‌ లావాదేవీల్లో పండిపోయిన టెకీలు సైతం ఇంటి వద్ద, ప్రయాణాల్లో ఎందుకైనా మంచిదని ఎంతోకొంత నగదు చేతిలో ఉంచుకుంటున్నారు. చిన్న నగరాలు, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తోంది.


మరింత ముందుకే

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఎంతగా విస్తరిస్తున్నా నగదు చెల్లింపులు ఇప్పట్లో పెద్దగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. జీడీపీ వృద్ధితో పాటే ఈ చెల్లింపులూ పెరుగుతాయని ఆర్థిక నిపుణుల అంచనా. ఈ కారణంతోనే దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రోజురోజుకీ పెరిగిపోతోంది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసి, డిజిటల్‌ చెల్లింపులను ఎంతగా ప్రోత్సహించినా, ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ నగదు చెల్లింపులు కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని ఆర్థిక నిపుణులు గుర్తు చేశారు. మొత్తం కార్మికుల్లో అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉండడం, డిజిటల్‌ నిరక్షరాస్యత, డిజిటల్‌ చెల్లింపులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇంకా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలకు విస్తరించక పోవడం కూడా ఆర్థిక వ్యవస్థలో నగదు చెల్లింపుల హవాను కొనసాగించనున్నాయి.

ఇవి కూడా చదవండి

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

114 రఫేల్స్‌ కావాలి!

Updated Date - Jun 04 , 2026 | 01:40 AM