Share News

Land Scam: ధరణి, భూ భారతి స్కాం.. 15 మంది నిందితుల అరెస్ట్

ABN , Publish Date - Jan 16 , 2026 | 07:57 PM

ధరణి, భూ భారతి పోర్టల్‌లో సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు రూ.3.90 కోట్ల గండికొట్టిన ముఠా గుట్టురట్టు చేశారు. వరంగల్ పోలీసులు. 15 మందిని అరెస్ట్ చేసి, రూ. 63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.

Land Scam: ధరణి, భూ భారతి స్కాం.. 15 మంది నిందితుల అరెస్ట్
Land Scam

వరంగల్, జనవరి16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భూ లావాదేవీలను పారదర్శకంగా మార్చేందుకు తీసుకొచ్చిన ధరణి(Dharani), భూ భారతి( Bhu Bharati) రిజిస్ట్రేషన్ వ్యవస్థల్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జనగామ, యాదాద్రి జిల్లాల్లో జరిగిన ఈ స్కామ్‌పై వరంగల్ పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన ఈ కేసులో 15 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ కుంభకోణం ద్వారా మొత్తం రూ.3.90 కోట్ల ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.


భూ భారతి కుంభకోణం?

ధరణి, భూ భారతి పోర్టల్స్ ద్వారా భూ రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఈ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ లాంటి అంశాలను లెక్కి్స్తారు. అయితే ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ నిందితులు మొబైల్ అప్లికేషన్ ద్వారా తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, తర్వాత నకిలీ చలాన్లతో అసలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు పోలీసులు గుర్తించారు.


నిందితుల మోసపూరిత వ్యూహం

పోలీసుల విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. నిందితులు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు తక్కువగా చెల్లించారు. తర్వాత ఆ ఫీజు చెల్లించినట్లు చూపించే నకిలీ చలాన్లు తయారు చేశారు. ఆ నకిలీ చలాన్లను మధ్యవర్తుల ద్వారా తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించారు. దీంతో పూర్తి రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం గండిపడింది.


ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల పాత్ర

ఈ స్కామ్‌లో కీలకపాత్ర పోషించింది ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు. ప్రధాన నిందితులు పసునూరి బసవరాజు, జెల్ల పాండు వీరు భువనగిరి ప్రాంతంలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో రిజిస్ట్రేషన్ స్లాట్‌కు 10 శాతం నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను ఆన్‌లైన్ సెంటర్ల నిర్వాహకులకు చెల్లిస్తూ అక్రమంగా స్లాట్లు బుక్ చేసి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.


1080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్..

పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మొత్తం 1080 రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌లో వేల నుంచి లక్షల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ధరణి వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.


స్వాధీనం చేసుకున్న వస్తువులు..

నిందితుల నుంచి పోలీసులు భారీగా నగదు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రూ.63 లక్షల నగదు, బ్యాంకుల్లో ఉన్న రూ.లక్ష ఫ్రీజ్, రూ. కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, 2 ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు ఇతర కీలక డిజిటల్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


కేసుల వివరాలు

వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు.. మొత్తం 22 కేసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న 9 మంది నిందితుల్లో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేయగా మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు, టెక్నికల్ సర్వైలెన్స్, బ్యాంక్ లావాదేవీల ట్రాకింగ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ధరణి పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాలను వాడుకుని ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.


రాజకీయ, పరిపాలనా వర్గాల్లో కలకలం..

ధరణి, భూ భారతి వ్యవస్థను ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ స్కామ్ రాజకీయంగా పెను దుమారం సృష్టించింది. పరిపాలనా యంత్రాంగంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూ లావాదేవీలపై ప్రజల్లో భయం సృష్టిస్తోంది.


మరిన్ని జిల్లాల్లో దర్యాప్తు..

మరిన్ని జిల్లాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది పాత్రపైనా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ధరణి, భూ భారతి సాఫ్ట్‌వేర్ భద్రతపై నివేదిక సిద్ధం చేయనున్నారు.


ప్రభుత్వ ఆదాయానికి కోట్ల నష్టం..

ధరణి – భూ భారతి కుంభకోణం తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. ప్రభుత్వ ఆదాయానికి కోట్ల నష్టం కలిగించిన ఈ స్కామ్‌పై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు చెక్ పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముండటంతో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పుట్టించే సూచనలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల

కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 09:06 PM