హైడ్రా కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:44 AM
హైకోర్టు స్టే ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపింది.
సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. నోటీసులు జారీ.. మేడ్చల్ కలెక్టర్ చెప్పకుండానే ఏకపక్షంగా హైడ్రా కూల్చివేతలు
40 చోట్ల కూల్చివేతలు చేపట్టారన్న కలెక్టర్
స్టే ఉత్తర్వుల గురించి హైడ్రాకు చెప్పండి
హైడ్రా పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: హైకోర్టు స్టే ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపింది. గతంలో ఆస్తులపై కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వుల గురించి తెలుసుకోకుండా.. రెవెన్యూ అధికారుల నుంచి కూల్చివేతల కోసం ఎలాంటి సూచనలు రాకుండానే హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలు చేపడుతోందని బుధవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టిన వ్యవహారంపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది.
అలాగే హైడ్రా ఏర్పడకముందు ఉన్న కోర్టుల స్టేల గురించి ఆయా జిల్లాల కలెక్టర్లు హైడ్రాకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మార్గదర్శకాలు జారీచేయాలని సూచించింది. కోర్టు గత ఉత్తర్వులకు విరుద్ధంగా మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి మండలం కేంద్రంలోని సర్వే నెంబరు194/1, 211లోని వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కూల్చివేతలు చేపట్టినందుకు మేడ్చల్ జిల్లా కలెక్టర్, మల్కాజ్‌గిరి, తిరుమలగిరి మండలాల తహసీల్దార్లను రికార్డులతో సహా హాజరుకావాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది.
వారు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఎదుట బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరణ ఇస్తూ.. వాణి కోఆపరేటివ్ సొసైటీలో కూల్చివేతలు చేపట్టాలని తాము హైడ్రాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. అలాగే తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే మేడ్చల్ జిల్లాలో హైడ్రా దాదాపు 40 వరకు కూల్చివేతలు చేపట్టిందని పేర్కొన్నారు. హైడ్రా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జనరల్ ల్యాండ్ రిజిస్టర్ (జీఎల్‌ఆర్)లోని 243, 255 నిబందనల పరిధిలో ఉన్న స్థలాలను రక్షించాలని రెవెన్యూశాఖ నుంచి సూచనలు ఉన్నందునే మ్యాపింగ్ చేసి కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం.. రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి సూచనలు, ఉత్తర్వులు లేకుండా.. జీఎల్‌ఆర్ 243, 255 నిబంధనల పరిధిలోని భూమి పిటిషనర్ల సర్వే నెంబరులోనే ఉందని ఎలా మ్యాపింగ్ చేశారని ప్రశ్నించింది. రికార్డు లేకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం చెల్లదని స్పష్టంచేసింది. అనుమతి లేకండా మేడ్చల్ కలెక్టరేట్ పరధిలో హైడ్రా ఎక్కడెక్కడ కూల్చివేతలు చేపట్టిందో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అలాగే హైడ్రా ఏర్పడకముందు కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఆ సంస్థ పట్టించుకోకపోవడంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కోర్టు కేసుల గురించి హైడ్రాకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ర్టీ స్వయంగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
గోదావరి నీళ్లు గట్టిగా ఎత్తిపోయండి
విదేశీ విరాళాల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
Read Latest AP News And Telangana News And International News And Telugu News