ఇందిరమ్మ టవర్స్‌కు నేడే శంకుస్థాపన
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:31 AM
పట్టణ గృహనిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో చేపట్టదలచిన ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
16 నియోజకవర్గాల్లో 8వేల ఇళ్లు
టవర్ల నిర్మాణానికి 90 ఎకరాలు
రూ.807.40 కోట్లకు అనుమతి
ఏడాదిలో గృహ ప్రవేశాలు!
కొత్త అధ్యాయానికి నాంది:పొంగులేటి
ఇళ్ల కోసం 50 వేలు దాటిన దరఖాస్తులు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ: పట్టణ గృహనిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో చేపట్టదలచిన ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. క్యూర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలు ఉండగా, మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు.
మొత్తం 90 ఎకరాల్లో ఈ టవర్లు ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన రూ.807.40 కోట్ల నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల్లో 8 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు, ఏడాదిలో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో నిర్మించే ఇళ్లలో ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.
బుధవారం ఇందిరమ్మ టవర్స్‌పై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో గుర్తించిన 5 ఎకరాల స్థలంలో 4 టవర్లు నిర్మించనున్నామని, ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు ఉంటాయని, ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్స్ చొప్పున మొత్తం 480 ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. వీటికి రూ.43.20 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ ఇళ్ల కోసం జూలై 20 నుంచి దరఖాస్తులు స్వీకరించామని,
బుధవారం వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, అనంతరం అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఎలాంటి రాజకీయ జోక్యం, అవకతవకలకు తావులేకుండా అర్హులైన పేదలకు లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇల్లు మంజూరుకాని దరఖాస్తుదారులకు.. వారు చెల్లించిన రూ.10 ఈఎండీని వెంటనే తిరిగి చెల్లిస్తామన్నారు.
వచ్చే ఏడాది బోనాల నాటికి గృహప్రవేశం
ఇందిరమ్మ టవర్లను శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతిదశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నా.. నగరంలోనే సొంత ఇల్లు కావాలనే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. హైదరాబాద్ గృహనిర్మాణ రంగంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం.. పేదలు నగరానికి దూరంగా కాకుండా, నగరంలోనే గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించిందని మంత్రి తెలిపారు. అత్యంత కీలక ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి పది అంతస్తుల వరకు టవర్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. వేలాది మంది పేదలకు సొంతింటిని అందించే ఈ పథకం ఒక్కసారి చేపట్టి ముగించేది కాదని, హైదరాబాద్‌లో పేదల గృహ అవసరాల మేరకు దశలవారీగా ఉండే నిరంతర కార్యక్రమమని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు ఇలా..
క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు బుధవారం సాయంత్రానికి 50 వేల దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం నాటికి 6,821 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో 5800, ఖైరతాబాద్‌లో 6 వేలు, శేరిలింగంపల్లిలో 3800, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 2వేలు, రాజేంద్రనగర్‌లో 2200, అంబర్‌పేటలో 3200, సనత్‌నగర్‌లో 1500కు పైగా దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు గడువు ఉండటంతో ఇంకా వందల మంది మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. గడువు ముగిసిన తర్వాత మొత్తం దరఖాస్తులపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.
లబ్ధిదారు వాటా చెల్లింపు ఇలా..
ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇల్లు మంజూరైన లబ్ధిదారు తన వాటా రూ.6 లక్షలను నాలుగు దశల్లో చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ ప్రొవిజినల్ అలాట్‌మెంట్ సమయంలో రూ.లక్ష, రెండో దశ.. ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక రూ.2 లక్షలు, మూడోదశ ఇల్లు పూర్తయ్యే దశలో రూ.2 లక్షలు, నాలుగో దశలో ఫ్లాట్ అప్పగించే సమయంలో రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇళ్ల కేటాయింపులో ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, క్లాస్-4 ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50 శాతం ఫ్లాట్‌లను జనరల్ క్యాటగిరీకి కేటాయించనున్నారు. అన్ని క్యాటగిరీల్లోనూ 30 శాతం ఫ్లాట్‌లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోదావరి నీళ్లు గట్టిగా ఎత్తిపోయండి
విదేశీ విరాళాల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
Read Latest AP News And Telangana News And International News And Telugu News