విదేశీ విరాళాల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:44 AM
వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ...
జేపీసీ పరిశీలనకు వివాదాస్పద బిల్లు.. తీవ్ర అభ్యంతరాలతో నిర్ణయం
విపక్ష సభ్యుల నినాదాల మధ్య లోక్‌సభలో తీర్మానం పెట్టిన సర్కారు
లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందితో జేపీసీ
న్యూఢిల్లీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు నివేదిస్తున్నట్లు ప్రకటించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేందుకు ఒకరోజు ముందు బుధవారం మధ్యాహ్నం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాల నినాదాల హోరు మధ్యే ఈ బిల్లును జేపీసీకి నివేదిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఎజెండా ప్రకారం ఈ తీర్మానాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టాల్సి ఉంది. దాంతో ఆయన సభకు హాజరుకావాలన్న ప్రతిపక్ష సభ్యుల నినాదాలు హోరెత్తాయి. ఈ గందరగోళం మధ్యే తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. లోక్‌సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు జేపీసీలో ఉంటారని నిత్యానందరాయ్ తెలిపారు. బిల్లును జేపీసీ సమగ్రంగా పరిశీలించి శీతాకాల సమావేశాల తొలివారంలో పార్లమెంటుకు సమర్పిస్తుందని చెప్పారు. రాజ్యసభ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించింది. పౌర సమాజాన్ని, మైనారిటీ సంస్థలను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బిల్లులో ఎక్కడా మైనారిటీ సంస్థల ప్రస్తావన లేదని, ఏవైనా అభ్యంతరాలుంటే కమిటీ సమావేశంలో ప్రస్తావించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. విదేశాల నుంచి పొందిన నిధులు సక్రమ ప్రయోజనాలకు ఉపయోగించేలా చూడడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. జేపీసీకి నివేదించడం ద్వారా ఈ బిల్లుపై నెలకొన్న వివాదానికి కేంద్రం తాత్కాలిక విరామం ప్రకటించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం మార్చి 25న ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉండటం, ఆ రాష్ట్రాల్లోని పలు చర్చి సంఘాలు సవరణలపై అభ్యంతరాలు లేవనెత్తడంతో ఏప్రిల్‌లో బిల్లుపై చర్చను లోక్‌సభ వాయిదా వేసింది. ఎఫ్‌సీఆర్‌ఏకు ప్రతిపాదించిన సవరణల్లో ప్రధానంగా ‘డెజిగ్నేటెడ్ అథారిటీ’ అంశం వివాదానికి కారణమైంది. దీన్ని కేంద్రమే నియమిస్తుంది. ఎఫ్‌సీఆర్‌ఏ సర్టిఫికెట్ రద్దయినా, సరెండర్ చేసినా, గడువు ముగిసినా సదరు సంస్థ విదేశీ విరాళాలు తాత్కాలికంగా ఈ అథారిటీకి బదిలీ అవుతాయి. నిర్దిష్ట గడువులోగా కొత్త సర్టిఫికెట్ పొందడం లేదా పునరుద్ధరించుకోవడంలో విఫలమైతే విదేశీ విరాళాలు, ఆస్తులు శాశ్వతంగా ఈ అథారిటీకి దఖలుపడతాయి.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News