గోదావరి నీళ్లు గట్టిగా ఎత్తిపోయండి
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:14 AM
గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితోపాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి..
ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి వీలైనంత నీటిని ఎత్తిపోయాలి
ఎక్కడ చూసినా కాళేశ్వరం నీళ్లేనంటూ ఇన్నాళ్లూ విపక్షాల అవాస్తవ ప్రచారం
అసలు ఎత్తిన నీళ్లెన్ని, వదిలిన నీళ్లెన్ని..?
ఖర్చయిన కరెంటు ఎంత? లెక్కలు తీయండి
విపక్షం ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టండి
కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లి నిండుతోంది
దేవాదుల నుంచి ఎన్నడూ లేనంతగా తొమ్మిది పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నాం
మిల్లర్ల నుంచి బకాయులు రాబట్టాల్సిందే!
మహిళా సంఘాలకు ధాన్యం మిల్లింగ్ బాధ్యతలు
ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండే 5 జిల్లాల్లో ‘సైలో బ్యాగ్’ నిర్మాణాలు.. సమీక్షల్లో సీఎం రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితోపాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతోందని చెప్పారు. ఇన్నాళ్లూ ఎక్కడ నీళ్లు కనిపించినా కాళేశ్వరం నీళ్లేనని విపక్ష నేతలు ప్రచారం చేసుకున్నారని.. దీనిపై అసలు వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ బ్యారేజీల నుంచి ఎత్తిపోసిన నీళ్లెన్ని, కిందకు వదిలేసిన నీళ్లెన్ని, వాడుకున్న నీళ్లెన్ని అనే వివరాలపై సమగ్రమైన లెక్కలు తీయాలని చెప్పారు. బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘2019 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు కనిపించినా కాళేశ్వరం నీళ్లేనని ప్రచారం చేసుకున్నారు. 2019లో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపూర్తయింది. 2023 అక్టోబరులో మేడిగడ్డ కుంగింది, అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడ్డాయి. 2019 నుంచి 2023 దాకా కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఎన్ని నీళ్లను ఎత్తిపోశారు? మళ్లీ కిందికి వదిలేసిన నీళ్లెన్ని? ఎన్ని టీఎంసీలను వినియోగించారు? ఎత్తిన నీటి కోసం ఎంత విద్యుత్ ఖర్చయిందనే సమగ్రమైన లెక్కలు తీసి ప్రజల ముందుంచాలి’’ అని అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన అధికారులు.. ఐదేళ్లలో 161.36 టీఎంసీలను ఎత్తిపోశారని, కానీ వరద రావడంతో ఎత్తిపోసిన నీటిలో 60 టీఎంసీలకుపైగా మళ్లీ నదిలోకే వదిలేశారని వివరించారు. అయితే ఈ వివరాలపై సమగ్రమైన లెక్కలు తీయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మేడిగడ్డ నుంచి ఎత్తిపోయకుండా నీళ్లన్నీ వదిలేస్తున్నారని విపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని.. కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లికి 43 టీఎంసీల వరద వచ్చిందని గుర్తుచేశారు. అందులో మిడ్‌మానేరుకు 17 టీఎంసీలను ఎత్తిపోశామని.. మరో 20 టీఎంసీలకుపైగా నదిలోకి వదిలేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా తొమ్మిది పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని చెప్పారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా ఉన్న చిన్న చిన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
గట్టు సామర్థ్యం 3 టీఎంసీలకు పెంపు
గట్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.03 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచాలని, ఈ మేరకు ప్రతిపాదనలను 14న జరిగే కేబినెట్ భేటీలో పెట్టాలని సీఎం ఆదేశించారు. గుడెందొడ్డిలో పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అవకాశాలపై అధ్యయనం కోసం కన్సల్టెన్సీని నియమించాలన్నారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఆయకట్టు కోసం అవసరమైన ప్రతిపాదనలను మంత్రివర్గం ముందుంచాలన్నారు.
కాళేశ్వరం బ్యారేజీల్లో డయాఫ్రం వాల్: మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీల ఎగువ, దిగువ భాగంలో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని సమావేశంలో మంత్రి ఉత్తమ్ వివరించారు. సీకెంట్ పైల్స్‌లో లోపాలు, డి జైన్‌లో సమస్యలు, నిర్వహణలోపాలతో బ్యారేజీలు విఫలమయ్యాయని పరీక్షల్లో తేలిందని చెప్పారు. డయాఫ్రం వాల్ నిర్మాణంతో సీపేజీలను అడ్డుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అంశంలో ఎన్డీఎ్‌సఏతో సంప్రదించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
కాళేశ్వరంతో వరి రికార్డు ఉత్పత్తికి సంబంధం లేదు: సీఎం
తెలంగాణలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణంకాదని.. గత పదేళ్లలో మంచి వర్షాలు, సాగునీటి లభ్యత పెరగటం, రైతు రుణమాఫీ, రైతుభరోసా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు కేంద్రిత విధానాలతోనే ధాన్యం ఉత్పత్తి పెరిగిందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటోరియల్ పేజీలో చేసిన విశ్లేషణను సీఎం బుధవారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో రైతులు గత కొన్నేళ్లలో సుమారు 15 లక్షల కొత్త బోర్లు వేశారని, వాటిద్వారా అదనంగా 40 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి, వారి సంక్షేమం, ఆదాయంలో మార్పు కాంగ్రెస్ పాలనలోనే ప్రారంభమైందన్నారు.
ఏమిటీ ‘సైలో బ్యాగ్’ నిర్మాణాలు?
ఎనిమిది నుంచి పది అడుగుల వెడల్పుతో.. 60 నుంచి 90 మీటర్ల పొడవుతో.. భారీ సంచుల్లా ఉండే నిర్మాణాలనే ‘సైలో బ్యాగ్స్’ అంటారు. ఒక్కో సైలో బ్యాగ్‌లో 250 టన్నుల వరకు ధాన్యం నిల్వ చేయవచ్చు. నీళ్లు, కాంతి చొరబడకుండా ఉండే ప్రత్యేకమైన ప్లాస్టిక్ పాలిమర్లతో ఈ బ్యాగులను రూపొందిస్తారు. ధాన్యం తడిసిపోవడం, పురుగులు పట్టడం, చెడిపోవడం వంటివాటికి అవకాశం తక్కువ. గోదాములు, కాంక్రీట్ ప్లాట్‌ఫారాల వంటివాటితో పోలిస్తే ఖర్చు చాలా తక్కువ. ఎలాంటి ప్రత్యేకమైన నిర్మాణాలు అవసరం లేకుండా.. పొలాల్లోనే ఈ ‘సైలో బ్యాగ్’లను ఏర్పాటు చేయవచ్చు. ధాన్యాన్ని అటు కొనుగోలు కేంద్రానికి, ఇటు మిల్లులకు, గోదాములకు తిప్పాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అవసరమైనప్పుడు నేరుగా గోదాములకో, మిల్లులకో తరలించవచ్చు.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News