Share News

వికారాబాద్ జిల్లాలో కత్తితో యువకుడి హల్చల్

ABN , Publish Date - May 07 , 2026 | 08:27 AM

వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణం బీసీ కాలనీలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వీధి పందుల విషయంలో తలెత్తిన చిన్న వివాదం కాస్తా, ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది.

వికారాబాద్ జిల్లాలో కత్తితో యువకుడి హల్చల్
Vikarabad District knife Attack

వికారాబాద్ జిల్లా, మే 7 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణం బీసీ కాలనీలో ఈరోజు (గురువారం) ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వీధి పందుల విషయంలో తలెత్తిన చిన్న వివాదం కాస్తా, ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది. ఒక యువకుడు కత్తితో వీరంగం సృష్టించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.


అసలేం జరిగిందంటే..?

పరిగి బీసీ కాలనీకి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి పందులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా తన పందులు చనిపోతున్నాయని దీనికి కాలనీవాసులే కారణమని వెంకటేశ్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయమై వెంకటేశ్‌కు, స్థానిక యువకులకు మధ్య వాగ్వాదం మొదలైంది. మాట మాట పెరిగి పరస్పర దూషణలకు దారితీసింది.


కత్తితో దాడికి యత్నం..

తమపై అకారణంగా నిందలు వేస్తున్నాడనే కోపంతో ఓ యువకుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. వెంటనే తన ఇంట్లోకి వెళ్లి పెద్ద కత్తిని తీసుకొచ్చి, వెంకటేశ్‌ను చంపేస్తానంటూ మీదకు వెళ్లాడు. ఆ యువకుడి ఆవేశం చూసి కాలనీ ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురై పరుగులు తీశారు. అయితే, అక్కడే ఉన్న మరికొందరు యువకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, కత్తి పట్టుకున్న యువకుడిని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


రాజకీయ జోక్యం..

ఈ ఘటనపై సమాచారం అందుకున్నప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేయకముందే స్థానిక రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య గొడవ పెద్దది కాకుండా, రాజకీయ ఒత్తిళ్లతో సర్దిచెప్పి రాజీ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టపగలు జనావాసాల మధ్య కత్తితో భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తమ భద్రత ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 07 , 2026 | 08:34 AM