Share News

కొడంగల్‌లో నన్ను దెబ్బతీయాలని కుట్ర.. వాటిని తిప్పికొట్టండి: సీఎం రేవంత్

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:27 AM

కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్‌కు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవడంలేదని సీఎం తెలిపారు.

కొడంగల్‌లో నన్ను దెబ్బతీయాలని కుట్ర.. వాటిని తిప్పికొట్టండి: సీఎం రేవంత్
CM Revanth Reddy

వికారాబాద్, జులై 22: కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్‌కు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(బుధవారం) కొడంగల్‌లో పర్యటించిన సీఎం.. స్థానిక నాయకులు, బీఎల్ఏలతో సర్‌పై(SIR) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘కొడంగల్‌లో నన్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో దెబ్బతీయాలంటే పునాదులు దెబ్బతీయాలని చూస్తున్నారు. పేర్లు వేరైనా బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే. కొడంగల్‌లో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని చూస్తున్నారు. ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటకు రాకుండా ఉంటారని కుట్రలు చేస్తున్నారు. ఎదురు నిలబడలేక దొంగదెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారు. కొడంగల్‌లో కుట్రలు చేసేవారిని బొంద పెట్టే బాధ్యత మీపై ఉంది’ అని అన్నారు.


119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవడంలేదని సీఎం తెలిపారు. ఆగస్టు 3 వరకు SIR గడువు ఉందన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో మొత్తం 2,51,255 ఓట్లున్నాయని.. కానీ 1,96,626 ఓట్లు మాత్రమే SIRలో నమోదు చేసుకున్నారని.. మిగిలిన 54,635 నమోదు చేసుకోలేదని సీఎం తెలిపారు. మొత్తం ఓట్లలో ఇంకా 22 శాతం నమోదు జరగలేదని చెప్పారు. ఆ ఓట్లను తొలగిస్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. వారందరినీ తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు.


ఓటు పోగొట్టుకుంటే గుర్తింపు ఉండదని సీఎం తెలిపారు. ఓటు లేకుంటే చనిపోయిన వారితో సమానమన్నారు. కార్యకర్తగా ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ ఫారం నమోదు చేయించాలని నేతలకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లు తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటై కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయాలని గూడుపుఠాణి చేస్తున్నాయని మండిపడ్డారు. ఓటర్ల వివరాలు ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపైనే ఉందన్నారు. ఈనెల 30లోగా నూటికి నూరు శాతం కొడంగల్ నియోజకవర్గంలో ప్రక్షాళన పూర్తి కావాలని తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు కోల్పోవడానికి వీల్లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఏపీకి బడ్జెట్‌ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదు: మంత్రి లోకేశ్

ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 11:50 AM