Share News

నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు తానే..

ABN , Publish Date - Aug 24 , 2026 | 07:34 AM

ప్రియుడి మోజులో పడి ఓ యువతి తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్‌తో చంపింది. ఇప్పుడు అదే మత్తు ఇంజెక్షన్‌తో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది.

నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు తానే..

సంగారెడ్డి, ఆగస్టు 24: ఈ ఏడాది జనవరిలో ప్రేమించిన ప్రియుడి కోసం తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చిన సురేఖ అనే యువతి నిన్న(ఆదివారం) ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను పొట్టనపెట్టుకున్న మత్తు ఇంజెక్షన్‌తోనే తన ప్రాణం కూడా తీసుకుంది. వివరాల్లోకెళితే...


వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలంలోని యాచారం గ్రామానికి చెందిన సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఓ యువకుడిని ప్రేమించింది. తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు నిరాకరించారు. ప్రేమ పెళ్లి కుదరదని వారించారు. దీంతో తల్లిదండ్రులపైనే ఆగ్రహం పెంచుకున్న సురేఖ ఇంజెక్షన్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి వారిని కడతేర్చింది. తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

అయితే.. పోలీసులకు సురేఖపై అనుమానం రావడంతో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో అరెస్టైన సురేఖ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి బయటకి వచ్చింది. తిరిగి సంగారెడ్డికి వెళ్లిన ఆమె.. శాంతినగర్‌లో ఓ ప్రేవేట్ హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవీ చదవండి:

నిబద్ధత, పట్టుదలతోనే విజయం

టెక్‌ వ్యూ 24,600 వద్ద గట్టి పరీక్ష!

Updated Date - Aug 24 , 2026 | 08:01 AM