Share News

జీతం మూరెడు.. ఖర్చు బారెడు

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:02 AM

పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. నెలనెలా వచ్చే కొద్దిపాటి జీతంతో కాలక్షేపం చేసేవారంతా.. ఇప్పుడు పక్షం రోజులకే ఖాళీ అవుతున్న పర్సులతో కలవరపడుతున్నారు.

జీతం మూరెడు.. ఖర్చు బారెడు
Price Hike

  • పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి జనం విలవిల

  • ఇరాన్‌ యుద్ధం మొదలైనప్పట్నుంచీ జీవితాలు

  • తలకిందులు.. చమురు ధరల ప్రభావం సరుకులపై!

  • మూణ్నెల్ల క్రితంతో పోల్చితే వస్తువుల ధరలు పైపైకి

  • సోనామసూరి క్వింటా రూ.5400 నుంచి 6800కి

  • ఇథనాల్‌ తయారీకి చక్కెర.. పెరిగిపోతున్న పంచదార ధరలు.. నిత్యావసరాలు కూడా ప్రియం

  • మొబైల్‌ రీచార్జ్‌లు, అపార్ట్‌మెంట్లలో మెయింటెనెన్స్‌ చార్జీలు భారం

  • రోజురోజుకూ పెరిగిపోతున్న ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల ధరలు

(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. నెలనెలా వచ్చే కొద్దిపాటి జీతంతో కాలక్షేపం చేసేవారంతా.. ఇప్పుడు పక్షం రోజులకే ఖాళీ అవుతున్న పర్సులతో కలవరపడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే అవసరమయ్యే పాలప్యాకెట్‌ దగ్గర్నుంచీ.. పప్పు, ఉప్పు, నూనె, పెట్రోల్‌ ధరలు, మొబైల్‌ రీచార్జ్‌లు, బాత్‌రూమ్‌లో వాడే మగ్గు, బకెట్‌ దాకా అదీ ఇదీ అని లేదు.. అన్నింటి ధరలూ పెరిగిపోతుండడంతో ధరాభారం తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో ఉంటున్న చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. వచ్చే కాస్తంతో జీతంతో ఎలా నెట్టుకురావాలో.. పెరిగిన ఖర్చులను ఎలా సర్దుకోవాలో తెలియక గుబులు చెందుతున్నారు. పొదుపు మాట దేవు డెరుగు.. అప్పులు లేకుంటే చాలు అన్నంత వేదనాభరితంగా వారి జీవితం మారిందని చెప్పవచ్చు. వారి సంగతే అలా ఉంటే.. రోజువారీ కూలీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటివారంతా హైదరాబాద్‌ మహానగరంలో సంసార సాగరాన్ని ఈదలేక.. స్వస్థలాలకు క్యూ కడుతున్నారు. నగరంలో ఇరవై ఏళ్లుగా ఉంటున్న వారు సైతం ఇక్కడ బతకలేం బాబోయ్‌ అంటూ పుట్టిన ఊర్లకు వెళ్లాల ని ఆలోచిస్తున్నారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరికీ నిత్యావసరాలైన బియ్యం, పంచదార రేట్లు గడిచిన 3 నెలల్లో పైపైకి ఎగబాగాయి. మూణ్నెల్ల కిత్రం రిటైల్‌ మార్కెట్‌లో క్వింటాల్‌ సోనామసూరి బియ్యం రూ.5,400 ఉండగా..


ఇప్పుడది అమాంతంగా రూ.6,800కు చేరింది. హోల్‌సేల్‌లోనే ధర రూ.6,500 పలుకుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో కొందరు రేషన్‌ బియ్యంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక పంచదార రేటు అయితే 15 రోజుల నుంచి శరవేగంగా పరుగులు పెడుతోంది. మూడు నెలల క్రితం కిలో రూ.48గా ఉన్న రేటు.. ఇప్పుడు రూ.60-65 దాకా పెరిగింది. గతంలో రేషన్‌ దుకాణాల్లో కిలో చక్కెరను రూ.13కు అందించేవారు. కానీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి లేదంటూ ఈ ఏడాది మార్చి నుంచి పౌరసరఫరాలశాఖ దాని పంపిణీని నిలిపివేసింది. దీంతో చాలామంది అనివార్యంగా దుకాణాల్లో తీసుకోవాల్సి వస్తోంది. ఇథనాల్‌ ఉత్పత్తి కోసం చక్కెరను అధికంగా వినియోగిస్తున్నారని.. అందుకే ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు చెబుతూ రేట్లను ఇష్టారాజ్యంగా పెంచుతూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇక బెల్లం ధర కూడా కిలో రూ.70 ఉండడం గమనార్హం. ఇక.. దాదాపు అన్ని వంటల్లోనూ తప్పనిసరిగా వినియోగించే ఉల్లిగడ్డ నంబర్‌ వన్‌ క్వాలిటీ ధర రూ.25-30 నుంచి మూణ్నెల్లలో రూ.40-45కి చేరింది. సాధారణ రకాన్ని రూ.35కి విక్రయిస్తున్నారు. ధరలు పెరిగిపోవడంతో చాలా మంది ఉల్లి వాడకాన్ని తగ్గిస్తున్నారు. రైతుబజార్‌లో బీరకాయ, బెండకాయ కిలో రూ.35-50కి విక్రయిస్తుండగా.. రిటైల్‌ దుకాణాల్లో రూ.60-80కి అమ్ముతున్నారు. ఇక బాత్‌రూముల్లో వాడే ప్లాస్టిక్‌ వస్తువుల రేట్లు కూడా భారీగా పెరిగాయి.


15-25 శాతం పెరిగిన ఎలకా్ట్రనిక్‌ వస్తువులు..!

మూడు నెలల కాలంలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పల ధరలు కనీసం 15-25 శాతానికి పైగా పెరిగాయి. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని డీలర్లు చెబుతున్నారు. వాటి తయారీకి అవసరమైన చిప్‌లు, ఇతర ముడి పదార్థాల ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని.. దీనికి తోడు రవాణాఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయని వారు పేర్కొన్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఒక ఎలకా్ట్రనిక్‌ దిగ్గజ సంస్థ ల్యాప్‌టాప్‌ ధర ఏడాది క్రితం రూ.54 వేల దాకా ఉండగా.. దాని ధర ఇప్పుడు ఏకంగా రూ.70 వేలు అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫోన్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. నిరుడు దసరా, దీపావళి సమయంలో రూ.14వేలకు అమ్మిన స్మార్ట్‌ఫోన్లను ఇప్పుడు రూ.23 వేలకు విక్రయిస్తున్నారు. 5జీ ఫోన్లు వచ్చాక 4జీ ఫోన్లు కొనేవారి సంఖ్య బాగా తగ్గిందిగానీ.. ధరలు పెరిగిపోవడంతో మళ్లీ ఇప్పుడు చాలా మంది 4జీ ఫోన్లవైపే మళ్లుతున్నారు. నిత్యావసర వస్తువులు, ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల సంగతి పక్కన పెడితే.. హైదరాబాద్‌ నగరంలో పలు అపార్ట్‌మెంట్లలో మెయింటెనెన్స్‌ చార్జీలు కూడా పెరిగాయి. నీటి కొరత కారణంగా ట్యాంకర్లను ఎక్కువగా బుక్‌ చేయాల్సి వస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో రూ.1000గా ఉన్న చార్జీలు.. ఇప్పుడు రూ.1500-1800కి చేరాయి. నిర్వహణ చార్జీల పెంపు కార ణంగా కొన్ని అపార్ట్‌మెంట్‌ మీటింగుల్లో చిన్న సైజు యుద్ధాలు కూడా జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక.. ప్రీ పెయిడ్‌ మొబైల్‌ రీచార్జ్‌ ధరలు మూడు, నాలుగు నెలల్లోనే దాదాపు 16 శాతం వరకూ పెరిగాయి. అలాగే.. భవన నిర్మాణ ఖర్చులు కూడా గడిచిన ఆరునెలల్లో భారీగా పెరిగాయి. ఏడాది మొదట్లో నిర్మాణ ఖర్చు చదరపుటడుగుకు రూ.1800-1900 ఉండగా.. ఇప్పుడది రూ.2200కు చేరింది. తేడా రూ.300అనిపించొచ్చుగానీ.. 1000 చదరపుటడుగుల ఫ్లాట్‌కు నిర్మాణ ఖర్చు రూ.3 లక్షల దాకా పెరిగినట్టు. ఇలా చెప్పుకొంటూ పోతే.. ధర పెరగని వస్తువులే కనిపించవు! పెరిగిన ఈ ధరాభారాన్ని తట్టుకోలేక ప్రజలు కుంగిపోతున్నారు!!


నెల తిరిగే సరికి అప్పులే!

నేను హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో 8 ఏళ్లుగా మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను. పెట్రోల్‌ అలవెన్స్‌తో కలిపి జీతం నెలకు రూ.30,800 వస్తుంది. యుద్ధం దెబ్బకు పెరిగిన ధరలతో నెలవారీ బడ్జెట్‌ పూర్తిగా మారిపోయింది. నెల తిరిగేసరికి అప్పులే తప్ప.. చిల్లిగవ్వ మిగలడంలేదు.

- రాంచందర్‌, ప్రైవేట్‌ ఉద్యోగి, కరీంనగర్‌


ఈ వార్తలను కూడా చదవండి:

ఫిట్‌ శ్రీకాకుళం లక్ష్యం

గడులపై గెలుపు వ్యూహం!

Updated Date - Aug 24 , 2026 | 07:38 AM