శ్రీశైలంలోకి కొనసాగుతున్న ప్రవాహం
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:36 AM
శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం 54,865 క్యూసెక్కులు విడుదల కాగా..
ప్రస్తుత నిల్వ 168.267 టీఎంసీలు
కాలువలు, ఎత్తిపోతలు, విద్యుదుత్పాదనకు 48,765 క్యూసెక్కుల వినియోగం
శ్రీశైలం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం 54,865 క్యూసెక్కులు విడుదల కాగా.. సాయంత్రానికి శ్రీశైలం డ్యాంకు 25,260 క్యూసెక్కులు చేరినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 215.810 టీఎంసీలకు గాను ప్రస్తుతం 168.267 టీఎంసీలున్నాయి. కాలువలు, ఎత్తిపోతలకు, విద్యుదుత్పాదనకు 48,765 క్యూసెక్కులు వినియోగించారు. కుడిగట్టు కేంద్రంలో ఏపీ విద్యుదుత్పత్తి నిలిపివేయగా.. ఎడమగట్టున తెలంగాణ విద్యుదుత్పత్తికి ద్వారా 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. నాగార్జునసాగర్ డ్యాంకు ఎగువ నుంచి 29,250 క్యూసెక్కులు వస్తుండగా.. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1500 క్యూసెక్కులను వదులుతున్నారు. డ్యాంలో 312.050 టీఎంసీలకు గాను 176.059 టీఎంసీలున్నాయి. దిగువన పులిచింతల ప్రాజెక్టుకు ఎలాంటి ప్రవాహం లేదు. లీకుల ద్వారా 400 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం 97 శాతం నిండింది. 123.081 టీఎంసీలకు గాను ప్రస్తుతం 120.640 టీఎంసీలున్నాయి. డ్యాంలోకి 30,026 క్యూసెక్కులు వస్తుండగా.. దిగువకు 24,158 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యాం గరిష్ఠ సామర్థ్యం 33.313 టీఎంసీలకు గాను 33.173 టీఎంసీలున్నాయి. ప్రాజెక్టులోకి 26,184 క్యూసెక్కులు వస్తుండగా.. 22,363 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యాం గరిష్ఠ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. 94.819 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రాజెక్టులోకి స్వల్పంగా 8,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 8478 క్యూసెక్కులు వదులుతున్నారు.