Share News

ఆయుష్‌కు రూ.185.75 కోట్లు

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:53 AM

రాష్ట్ర ఆయుష్‌ విభాగ వార్షిక కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర ఆయుష్‌ మిషన్‌ డైరెక్టరేట్‌ నుంచి రూ.185.75 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు.

ఆయుష్‌కు రూ.185.75 కోట్లు

  • కేంద్ర ఆయుష్‌ మిషన్‌ నుంచి విడుదల

  • 9 ఐటీడీఏల పరిధిలో 19 మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం

అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఆయుష్‌ విభాగ వార్షిక కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర ఆయుష్‌ మిషన్‌ డైరెక్టరేట్‌ నుంచి రూ.185.75 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. 2014లో జాతీయ ఆయుష్‌ మిషన్‌ ప్రారంభమైన తర్వాత రాష్ట్రానికి వచ్చిన అత్యధిక వార్షిక కేటాయింపులు ఇవేనని తెలిపారు. గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆయుష్‌ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు 9 ఐటీడీఏల పరిధిలో 19 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను సేవల్లోకి తీసుకురావడం ఈ ప్రణాళికలో కీలక అంశంగా చెప్పారు. నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల ఉందని, 2014 నుంచి 2024 వరకు పదేళ్ల కాలంలో రూ.120.17 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలానికే రూ.434.64 కోట్లు నిధులు కేటాయింపులకు కేంద్రం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆయుష్‌ సేవలను డిజిటల్‌ విధానంలోకి తీసుకెళ్లేందుకూ ఈ నిధులు వెచ్చించనున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Aug 24 , 2026 | 05:55 AM