Share News

స్ఫూర్తి పాఠం...

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:42 AM

నేర్చుకోవాలనే కోరిక, శ్రమించే తత్వం, పట్టుదల... తనను నడిపించిన సూత్రాలు అవేనంటారు రాజకుమారీ దేవి. బాల్య వివాహం, అత్తింట్లో వేధింపులు, గొడ్రాలంటూ ఊరివారి ఈసడింపులు...

స్ఫూర్తి పాఠం...

నేర్చుకోవాలనే కోరిక, శ్రమించే తత్వం, పట్టుదల... తనను నడిపించిన సూత్రాలు అవేనంటారు రాజకుమారీ దేవి. బాల్య వివాహం, అత్తింట్లో వేధింపులు, గొడ్రాలంటూ ఊరివారి ఈసడింపులు... ఇలా ఎదురైన ప్రతి సమస్యనూ ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. స్వశక్తితో ఎదిగారు. వందల మంది మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఆసరాగా నిలిచారు. బిహార్‌లోని మారుమూల పల్లె నుంచి ‘పద్మశ్రీ’ని అందుకొనే వరకూ... ఒక స్ఫూర్తి పాఠంలా సాగిన ‘కిసాన్‌ చాచీ’ రాజకుమారి కథ ఆమె మాటల్లోనే...

‘‘దాదాపు నెలన్నర క్రితం... మా ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకాయన ‘‘నేను ‘పబ్లిక్‌ స్కూల్‌ దర్భంగా’ ప్రిన్సిపాల్‌ని. మా స్కూల్‌ ఏర్పాటు చేసి 65 ఏళ్ళయింది. వార్షికోత్సవానికి మీరు రావాలి. మీ అనుభవంతో మా పిల్లలకు మంచి మాటలు చెబితే సంతోషిస్తాం’’ అన్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియలేదు. నేను హైస్కూల్‌ చదువు మధ్యలో ఆపేసిన దాన్ని. ఎందరో విద్యావేత్తలకు నిలయమైన చోట... నేనేం మాట్లాడగలను? అదే వారిని అడిగాను. ‘‘ఒక తల్లిగా మాట్లాడండి’’ అన్నారు. తరువాత ఆ వార్షికోత్సవానికి వెళ్ళాను. ఈ తరం పిల్లలు మాతృభాషలో మాట్లాడుకోవడం బాగా తగ్గిపోతోంది. బడిలో టీచర్లు, ఇళ్ళలో తల్లిదండ్రులు కూడా ఆంగ్లంలోనే మాట్లాడాలని పిల్లల్ని ఒత్తిడి పెట్టడం చూశాను. ఆ సంగతి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గుర్తు చేస్తూ... తల్లి భాషను చంపెయ్యవద్దని కోరాను. కనీసం ఇళ్ళలోనైనా మాతృభాషలో మాట్లాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించాను.

కన్న తల్లి, తల్లి భాష, నేల తల్లి... ప్రతి ఒక్కరి అస్థిత్వం వీటితోనే ముడిపడి ఉంటుంది. నా జీవితం భూమాతతో ఇంకా బలంగా పెనవేసుకుంది.


సైకిల్‌ మీద ఊరూరా తిరిగి...

మాది బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లా ఆనందపూర్‌ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం. వ్యవసాయం మాకు జీవనాధారం. చదువంటే నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న నన్ను తొమ్మిదో తరగతి వరకూ చదివించారు. ఆ తరువాత... పదిహేనేళ్ళ వయసులో నాకు పెళ్ళయింది. మా అత్తింటివారిది కూడా వ్యవసాయ కుటుంబమే. అయితే వారిది పెద్ద ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంటి ఖర్చులకు ఇబ్బందిగా ఉండేది. దాంతో నేను పొలం పనులకు వెళ్ళేదాన్ని. నాకు పెళ్ళయిన పదేళ్ళవరకూ పిల్లలు పుట్టలేదు. అందరూ నన్ను గొడ్రాలు అనేవారు. ఇంట్లో వేధింపులను, పనుల కోసం ఎక్కడికి వెళ్ళినా ఈసడింపులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ తరువాత ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి జన్మనిచ్చాను. కొన్నాళ్ళలోనే మా అత్తవారింట్లో వేధింపులు ఎక్కువయ్యాయి. చివరకు అక్కడినుంచి పిల్లలతో పాటు బయటికి రావాల్సి వచ్చింది. కానీ నేను కుంగిపోలేదు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. నా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఎకరం భూమిని సాగు చేయడం ప్రారంభించాను. పండ్లు, కూరగాయలు పండించాను. దిగుబడి బాగున్నా... విక్రయాల తరువాత మిగిలిన పంట వృథా అయ్యేది. వాటితో పచ్చళ్ళు, జామ్‌లు తయారు చేశాను. చుట్టుపక్కల గ్రామాల్లో సైకిల్‌ మీద తిరిగి అమ్మడం మొదలుపెట్టాను.

8.jpg

ఎన్నో కుటుంబాలు స్థిరపడ్డాయి...

వ్యవసాయదారులకు కష్టపడి పని చేయడం మాత్రమే కాదు... సాగులో ఆధునిక పద్ధతులు తెలియడం కూడా అవసరమే. దాని కోసం పూశా పట్టణంలో ఉన్న ‘అగ్రికల్చర్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ కృషి విజ్ఞాన కేంద్ర’లో ఆధునిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. బొప్పాయి లాంటి పంటలు వేయడం ద్వారా ఆదాయం పెరిగింది. గ్రామస్తుల కోరిక మేరకు... స్వయం సహాయక సంఘాల మహిళలకు పచ్చళ్ళు, జామ్‌లు, మురబ్బాలు, అప్పడాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చాను. వాటిని ఎలా విక్రయించాలనే విషయంపై అవగాహన కల్పించాను. క్రమంగా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సంఘాల వాళ్ళు కూడా శిక్షణ తీసుకున్నారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అది దోహదం చేసింది. ఇప్పుడు అది ఒక గ్రామీణ పరిశ్రమ స్థాయికి ఎదిగింది. ఇక్కడి ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. 300 మందికి పైగా మహిళలు సొంత వ్యాపారాల్లో స్థిరపడ్డారు. కొన్ని వేలమంది వారి దగ్గర పని చేస్తూ ఆదాయం పొందుతున్నారు. మహిళలు తమలో ఉన్న ప్రతిభను, నైపుణ్యాన్ని గుర్తించాలి. దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఇబ్బందులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా... ఆత్మ విశ్వాసంతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు సాధించుకోవాలి. నేను కలిసే ప్రతి మహిళకూ ఇదే చెబుతాను. ఎందుకంటే... నా జీవితాన్ని అలాగే నిర్మించుకున్నాను.’’


ఆ పేరు స్థిరపడింది...

వ్యవసాయానికి, మహిళా సాధికారతకు నేను చేసిన సేవలకు గాను బిహార్‌ ప్రభుత్వం నుంచి ‘కిసాన్‌శ్రీ’ అవార్డును, 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నాను. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ నిర్వహించే ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ కార్యక్రమం ద్వారా నా కథ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులకు తెలిసింది. అందరూ ‘కిసాన్‌ చాచీ’ అని పిలవడంతో... ఆ పేరు నాకు స్థిరపడిపోయింది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 05:42 AM