Share News

ఖరీఫ్‌ పంటలపై తెగుళ్ల దాడి!

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:42 AM

ఎల్‌నినో కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటలపై తెగుళ్ల దాడికి దారి తీస్తున్నాయి. వ్యవసాయశాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల్లో..

ఖరీఫ్‌ పంటలపై తెగుళ్ల దాడి!

  • 50 వేల ఎకరాల్లో 6 రకాల పైర్లకు దెబ్బ

  • తీవ్ర వర్షాభావమే చీడపీడలకు కారణం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎల్‌నినో కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటలపై తెగుళ్ల దాడికి దారి తీస్తున్నాయి. వ్యవసాయశాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల్లో ఆరు రకాల పంటలు తెగుళ్ల ప్రభావానికి గురైనట్లు అంచనా. ఇందులో రెండు వేల ఎకరాలు ఆర్థిక పరిమితి స్థాయి(ఈటీఎల్‌) కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వాస్తవంగా తెగుళ్ల దాడి మరింత తీవ్రంగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వరి పైరుకు బాక్టీరియల్‌ ఆకుమచ్చ తెగులు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వరిపైరుకు ఉభయగోదావరి, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఆకు చుట్టు పురుగు, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో ఆకు కంకి నల్లి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో పసుపు రంగు కాండం తొలిచే పురుగు, నెల్లూరు జిల్లాలో ముడత తెగులు ఆశించాయి. మొక్కజొన్నకు విజయనగరం, మన్యం, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లో కత్తెర పురుగు, నంద్యాల జిల్లాలో చుక్కల కాండం తొలిచే పురుగు, అనంతపురం జిల్లాలో గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఆశించింది. మినుము పైరుకు నంద్యాల జిల్లాలో తెల్ల దోమ, ఆకు పచ్చని ఆకు మిడత, ఆకు ముడత, కడప, నంద్యాల జిల్లాలో చుక్కల కాయ తొలిచే పురుగు ఆశించాయి. పత్తి పైరుకు అనంతపురం, నంద్యాల జిల్లాల్లో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు, మన్యం, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో తెల్ల దోమలు, గుంటూరు, ఎన్టీఆర్‌, బాపట్ల, పల్నాడు, కర్నూలు, మార్కాపురం జిల్లాల్లో పచ్చదోమ, విజయనగరం, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో పేనుబంక, పల్నాడు జిల్లాలో ఆకుమిడత ఆశించాయి.


వేరుశనగ పైరుకు కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆకు తొలిచే పురుగు, బాపట్ల, అనంతపురం జిల్లాల్లో ఆకు ముడత, అనంతపురం జిల్లాలో ఆముదం పైరుకు సర్పరూప ఆకు తొలిచే పురుగు, ఆకు మిడత, గొంగలి పురుగు సోకాయి. సహజంగా వచ్చే పురుగుల తంటాలతో పాటు వర్షాభావం కారణంగా తెగుళ్ల తాకిడి పెరిగిందని రైతులు వాపోతున్నారు. చీడపీడలప్రభావం పంట దిగుబడిపై ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు సాగునీటి సమస్యతో సతమతమౌతుంటే.. మరోవైపు పురుగు మందులకు అదనపు ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు. దీంతో తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలని స్థానిక వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఏపీ ఎయిమ్స్‌, ప్లాంట్‌ ఐడెంటిఫైడ్‌, ఆగ్రో ఏఐ ప్లాంట్‌ డయోగ్నోస్టిక్స్‌ వంటి యాప్‌ల ద్వారా రైతులు పంట ఫోటోలు స్కాన్‌ చేసి, తెగుళ్ల నివారణకు సూచనలు పొందవచ్చని క్షేత్రస్థాయి సిబ్బంది సలహా ఇస్తున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 05:43 AM