గడులపై గెలుపు వ్యూహం!
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:47 AM
సరదాగా మొదలైన చెస్ క్రీడలో అడుగుడుగునా ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, పట్టుదలతో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను సాధించి స్ఫూర్తిగా నిలిచింది...
సరదాగా మొదలైన చెస్ క్రీడలో అడుగుడుగునా ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, పట్టుదలతో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను సాధించి స్ఫూర్తిగా నిలిచింది గుంటూరుకు చెందిన కోనేరు చల్ల నిహారిక. ఐదేళ్ల పాటు రేటింగ్ ఒకేచోట స్తంభించిపోయినా నిరాశ చెందకుండా ముందుకు సాగిన నిహారిక తాజాగా ‘నవ్య’తో తన విజయ ప్రస్థానాన్ని పంచుకుంది.
‘‘2011లో నేను సరదాగా చెస్‌బోర్డు పట్టుకున్నాను. కానీ నేను ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే మొదటి స్థానం సాధించడంతో నాకు చెస్‌పై ఆసక్తి బాగా పెరిగింది. 2011 నుంచి 2014 వరకు గుంటూరులోని జీనియస్ చెస్ అకాడమీలో రవీంద్ర రాజు వద్ద శిక్షణ తీసుకున్నాను. చెస్‌లో నాకు బలమైన పునాది వేసింది ఆయనే. ఆటలోని మెళకువలే కాకుండా క్రమశిక్షణ, ఓర్పు, ఓటమి నుంచి నేర్చుకోవడం వంటి విషయాలను కూడా ఆయన నాకు నేర్పించారు. పదేళ్లకు పైగా ఆయన అందించిన మార్గదర్శకత్వం నా ఈ ప్రయాణంలో ఎంతో కీలకం.
కఠిన సాధన... ఎన్నో త్యాగాలు
ఆ తర్వాత నేను హైదరాబాద్‌లోని స్కై చెస్ అకాడమీలో చేరాను. అక్కడ చేరిన తర్వాత ఆటను చాలా సీరియ్‌సగా తీసుకున్నాను. రోజుకు 12 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అజయ్ ముషిణి, సాయి కిరణ్ యార్లగడ్డ మార్గదర్శకత్వంలో నా ఆటను మరింత మెరుగుపరుచుకున్నాను. ఆ స్థాయి ప్రాక్టీస్ వెనుక చాలా కష్టం, ఎన్నో త్యాగాలు ఉన్నాయి.
ఐదేళ్ల ఆటంకం... చెదరని విశ్వాసం
ఇంత కష్టపడినా నా రేటింగ్ ఐదేళ్ల పాటు పెద్దగా పెరగలేదు. రేటింగ్ ఒకచోటే ఆగిపోవడం తో చాలా నిరాశ చెందాను. కానీ నేను ఎక్కడా ఆగిపోలేదు. రేటింగ్ గురించి ఆలోచిస్తూ ఉండటం కంటే నా ఆటలో ఏం తప్పు జరుగుతుందో తెలుసుకోవడంపైనే దృష్టిని పెట్టాను. గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా ఒకేలా తీసుకున్నాను. ముఖ్యంగా ‘ఓడిపోతేనే ఎక్కువ నేర్చుకుంటాం’ అనే ఆలోచన నాకు చాలా స్ఫూర్తినిచ్చింది.
ఓటమి అంటే అంతం కాదు!
నా దృష్టిలో ఓటమి అంటే అంతం కాదు. అది మనలోని లోపాలను చూపించే ఒక అద్భుతమైన అవకాశం. గెలిచినప్పుడు మనం ఏం బాగా చేశామో తెలుస్తుంది, కానీ ఓడినప్పుడు మనం ఏం మార్చుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే నేను గెలుపు, ఓటమి రెండింటినీ సమానంగా తీసుకున్నాను. అదే నన్ను ఈరోజు విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ స్థాయికి తీసుకొచ్చిందని భావిస్తున్నాను.
300 ఎలో పాయింట్ల వెనుక రహస్యం
గత ఏడాదిలోనే 300కు పైగా ఎలో రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాను. దీని వెనుక ప్రత్యేకమైన రహస్యం ఏమీ లేదు. నిరంతర ప్రాక్టీస్, మంచి కోచింగ్, ప్రతి గేమ్‌నూ విశ్లేషించడం, చేసిన తప్పులను మళ్లీ చేయకుండా చూసుకోవడం.. ఇవే నా ముఖ్యమైన మంత్రాలు. ముఖ్యంగా రేటింగ్ పెరగడం కోసం కాకుండా నా ఆటను మరింత మెరుగుపరుచుకోవడం కోసం ఆడాను. రేటింగ్ అనేది నా ఆట ఫలితంగా వచ్చింది.
స్ఫూర్తి ప్రదాతలు
రష్యాకు చెందిన దిగ్గజ చెస్ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ నాకు స్ఫూర్తి. ఆయన ఆలోచనా విధానం, పోరాట పటిమ, ఆటపై ఆయనకున్న అంకితభావం నాకు చాలా ఇష్టం. అలాగే మన కోనేరు హంపి కూడా నాకు గొప్ప స్ఫూర్తి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తీసుకురావడం ఎంతో ప్రేరణ కలిగిస్తోంది.
చదువు.. క్రీడల సమన్వయం
నేను ఇటీవల ఎంబీఏ కూడా పూర్తి చేశాను. చదువు, చెస్ రెండింటికీ సమానంగా సమయం కేటాయించడం సవాలుగానే ఉండేది. కానీ టైమ్ మేనేజ్‌మెంట్ అలవాటు చేసుకున్నాను. చెస్ నాకు ఏకాగ్రత, క్రమశిక్షణ నేర్పితే... చదువు మరో రకమైన ఆలోచనా విధానాన్ని ఇచ్చింది. అలా రెండూ ఒకదానికొకటి సహాయపడ్డాయి.
ముందున్న బిగ్ గోల్!
విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాతోనే ఆగిపోవాలని నాకు లేదు. నా తదుపరి ప్రధాన లక్ష్యం గ్రాండ్‌మాస్టర్ బిరుదు సాధించడం. దాని కోసం ఇంకా చాలా కష్టపడాలి. ఇంకా ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడాలి. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.
ఓటమిని స్వీకరిస్తేనే..
కేవలం గెలుపు కోసం మాత్రమే ఆడకండి. ఓటమిని కూడా స్వీకరించడం నేర్చుకోండి. ఓడిపోయిన ప్రతి గేమ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. రేటింగ్ పెరగడం లేదని, వరుసగా ఓడిపోతున్నామని నిరాశ చెందకుండా ప్రాక్టీస్ కొనసాగించాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రయత్నం ఆపకుండా ముందుకు సాగితే ఎలాంటి లక్ష్యాన్నయినా సాధించవచ్చు’’.
గీంజుపల్లి భాస్కరరావు
ఫొటోలు: దాసరి రమణ
సాధించిన విజయాలు
ఒక్కో నార్మ్ సాధించినప్పుడు ఒక్కో అడుగు ముందుకు వేసినట్టుగా అనిపించింది. బెల్‌గ్రేడ్ జీఎం మిక్స్, హంగేరీలో వెలెర్కెప్టో ఐఎం రౌండ్ రాబిన్, స్పెయిన్‌లో పొంటేవేద్రా మాస్టర్స్ ఓపెన్.. వేదికలపై మూడు విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్‌లు సాధించాను. ఆ తర్వాత దానికి అవసరమైన ‘ఫిడే’ రేటింగ్‌ను కూడా సాధించడంతో విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ బిరుదు పూర్తయింది. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ఒక గొప్ప అనుభూతి.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..
అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..