నిబద్ధత, పట్టుదలతోనే విజయం
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:57 AM
నిబద్ధత, పట్టుదల, నైపుణ్యం విజయతీరాలకు చేరుస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
గీతం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రామస్వామి బాలసుబ్రహ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
3,052 మంది విద్యార్థులకు పట్టాల అందజేత
ఎండాడ (విశాఖపట్నం), ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నిబద్ధత, పట్టుదల, నైపుణ్యం విజయతీరాలకు చేరుస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 2025-26 స్నాతకోత్సవాన్ని ఆదివారం నిర్వహించగా, కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని నైపుణ్యాలు రేపటికి పాతబడిపోతాయని, సంప్రదాయంగా వస్తున్న కొన్ని ఉద్యోగాలు భవిష్యత్తులో కనుమరుగవుతాయని పేర్కొంటూ...2000 సంవత్సరంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం అనేక మార్పులకు లోనైందని, చాలా ఏళ్లుగా ఉద్యోగాల్లో ఉన్నవారు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. పార్లమెంట్ కమిటీల్లో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలతో పాటు విశ్వవిద్యాలయాల్లో ఎదురయ్యే అనేక సమస్యలపై స్పష్టమైన విజన్‌తో విశాఖ ఎంపీ శ్రీభరత్ (గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు) తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని అభినందించారు. విశాఖ ప్రాంగణం నుంచి 2025-26 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, న్యాయవిద్య, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంబీఏ, బీబీఎం, బీకాం తదితర కోర్సులు పూర్తి చేసిన 2,896 మంది పట్టభద్రులకు డిగ్రీలు, 156 మంది పరిశోధక విద్యార్థులకు (పీహెచ్‌డీ), అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది విద్యార్థులకు బంగారు పతకాలను స్నాతకోత్సవంలో అందజేశారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రామస్వామి బాలసుబ్రహ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ (డి.లిట్) ప్రదానం చేశారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్, గీతం వర్సిటీ చాన్సలర్ డాక్టర్ వీరేంద్రసింగ్ చౌహాన్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రోల్ డిసౌజా, ఉపాధ్యక్షుడు ఎం.గంగాధరరావు, ప్రో-వీసీ ప్రొఫెసర్ వై.గౌతంరావు, కార్యదర్శి ఎం.భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.