‘గౌరవం’ ఇస్తారా..?
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:24 PM
గతేడాది డిసెంబరు నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అదే నెల 22వ తేదీన కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు.
సర్పంచ్‌లకు అందని గౌరవ వేతనం
ఐదు నెలల వేతనం పెండింగ్‌లోనే..
తప్పని ఎదురు చూపులు
జిల్లాలో 594 మంది సర్పంచ్‌లు
బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రూ.2.05 కోట్లు బాకీ
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇంత వరకూ గౌరవ వేతనం అందలేదు. వారు బాధ్యతలు స్వీకరించి ఐదు నెలలు గడిచిపోయినా వేతనం మాత్రం చేతికందలేదు. దీంతో గత ప్రభుత్వంలో మాదిరిగా గౌరవ వేతనం చెల్లిస్తారా? లేదా ? అనే అనుమానం సర్పంచ్‌ల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని 594 మంది సర్పంచ్‌లకు ఒక్కొక్కరికి నెలకు రూ.6,500 చెల్లించాల్సి ఉండగా, బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి రూ.2.05 కోట్ల వేతనం అందాల్సి ఉంది.
వికారాబాద్: గతేడాది డిసెంబరు నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అదే నెల 22వ తేదీన కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి వేతనం రాలేదు. అయిదు నెలలుగా తమ గౌరవ వేతనం గురించి ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. గత హయాంలో సర్పంచులకు నెలకు రూ.6,500 చెల్లించిన విషయం తెలిసిందే.
అయితే తాము సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు తీసుకున్నారు. కానీ వేతనాలు మాత్రం ఇవ్వలేదు. జిల్లాలో 20 మండలాల పరిధిలో 594 పంచాయతీలకు 594 మంది సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఒక్కో సర్పంచ్‌కు గౌరవ వేతనంగా నెలకు రూ.6,500 చెల్లించాల్సి ఉండగా, బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మే నెల వరకు జిల్లాలోని సర్పంచ్‌లకు రూ.2,05,50,440 గౌరవ వేతనం రూపంలో అందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్పంచులకు చెల్లించాల్సిన బకాయి వేతనాలను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, వార్డు సభ్యులకు అందాల్సిన సిట్టింగ్ ఫీజులు కూడా చెల్లించడం లేదని తెలుస్తోంది, పంచాయతీ సమావేశాలు నిర్వహించే సమయంలో సిట్టింగ్ ఫీజులు చెల్లించే విషయం తెలిసిందే.
పాత సర్పంచ్‌లకూ బకాయిలు
ఇదిలా ఉంటే, తమకు గౌరవ వేతన బకాయీలు రావాల్సి ఉందని పాత సర్పంచులు చెబుతున్నారు. గత పంచాయతీ పాలక వర్గాల్లో సర్పంచులుగా కొనసాగిన వారికి 18 నెలల వేతనం రావాల్సి ఉండగా, ఇంత వరకు చెల్లించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. పదవీ కాలం పూర్తయి రెండేళ్లు గడిచిపోయినా ఇంకా తమకు రావాల్సిన గౌరవ వేతనం చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమకు బకాయి పడ్డ గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుంది?
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తప్పిన పెను ప్రమాదం..
Read Latest AP News And Telangana News And International News And Telugu News