ఎరువు.. బరువు... ఒక్కసారిగా ధరలకు రెక్కలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:41 AM
వికారాబాద్ జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు సగం మాత్రమే సాగు చేశారు.
కృత్రిమ కొరత సృష్టించి అమ్మకాలు
యూరియా బస్తా రూ.400, ఇతర ఎరువులు రూ.3వేల వరకు విక్రయాలు
బస్తాపై అదనంగా రూ.150 నుంచి రూ.400 వసూలు
యూప్ బుకింగ్‌లోనూ రైతులకు తప్పని సమస్యలు
వర్షాలు లేక ఒకవైపు, ఎరువులు దొరక్క మరోవైపు
వానాకాలం సాగు అంచనా 5,90,375 ఎకరాలు
ఇప్పటివరకు కేవలం 2,70,199 ఎకరాల్లోనే సాగు
ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు ఎరువుల ధరలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ధరలు పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలకు యూరియా, సాగు చేయాల్సిన పంటలకు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు ఎమ్మార్పీ కంటే ఎడా,పెడా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 5,90,375 ఎకరాలు ఉండగా, ఇప్పటి వరకు 2,70,199 ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
పరిగి(వికారాబాద్): వికారాబాద్ జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు సగం మాత్రమే సాగు చేశారు. వర్షాలు కురిస్తే మిగతా పంటలు సాగు చేయాలని రైతులు ఎదురుచూస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల దిగుమతి ఖర్చులు పెరగడం, సరఫరా నిలిపిపోయిందని సాకులు చెప్పి మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పలుచోట్ల డీఏపీ, యూరియా నిల్వలు లేక రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
డీఏపీ ఒక్కో బస్తాకు రూ.1,350 ఎమార్పీ ఉంటే రూ. 1,700 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. యూరియా బస్తా రూ.266కు అమ్మాల్సి ఉండగా రూ.400కు విక్రయిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు రకాలను బట్టి రూ. 1,200 నుంచి రూ.2,000ల వరకు ధర ఉంది. రెండు రోజుల క్రితమే ప్రభుత్వ ధరలను పెంచింది. ఒక్కో బస్తాను రూ.125ల నుంచి రూ.650ల వరకు పెంచింది. కాంప్లెక్స్ ఎరువులు పెంచకముందు బస్తాకు రూ.400 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నారు. అయితే ధరలు పెంచిన తర్వాత 20:20:0:13 రూ.3వేలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 5.9లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తారని అంచనా. అందుకు అన్ని రకాల ఎరువులు 1,13,851 టన్నుల ఎరువుల అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటి వరకు మార్కెట్‌లో 40 శాతం ఎరువులు నిల్వలు కూడా లేవని కొందరు వ్యాపారులు చెబుతున్నారు.
యూప్ బుకింగ్‌తోనూ తిప్పలే..
రైతులకు ఎరువులు కావాలంటే ముందు యాప్‌లో నమోదు చేసుకోవాలి. అలా అయితేనే ఎరువులు దొరుకుతున్న పరిస్థితి. ఇందులోనూ రాజకీయ నేతల ప్రభావం ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు పలుకుబడి ఉన్న నేతలు చెప్పిన విధంగా నడుచుకోవడంతో అసలు రైతులు అవస్థలు పడుతున్నారు. రాజకీయ నాయకులు చెప్పిన సమయానికి యాప్‌లో నిల్వలు ఉంచి వారు బుకింగ్ చేసుకున్న తర్వాత మూసేస్తున్నారు. అప్పటికే ఆయా దుకాణాలకు కేటాయించిన ఎరువులు ఖాళీ అయిపోతున్నాయి. రైతులు బుక్ చేసుకుందానే లోపే నిమిషాల వ్యవధిలో ఖాళీ కావడంతో ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారు.
ఏటేటా పెరుగుతున్న వినియోగం
సాగులో ఎరువుల వినియోగం ఏటేటా పెరుగుతోంది. ఎరువు బస్తా లేనిదే పంటలు పండవన్న భావనలో రైతులు ఉంటున్నా రు. ఎకరాకు గతేడాది మూడు బస్తాలు వేస్తే, ఈ సారి నాలుగు బస్తాలకు పెంచుతున్నారు. వానాకాలం ప్రారంభంలో కురిసిన వానలకు రైతులు పత్తి, కంది, మొక్కజొన్నఇతర పంటలు సాగు చేశారు. తడిలేక మొలకలు ఎండిపోతున్నాయి. పంటలపై యూరియాను నీటిలో కలిపి పిచికారీ చేయాలని అధికారులే సూచిస్తున్నారు. అయితే మార్కెట్‌లో యూరియా దొరకని పరిస్థితి. కాంప్లెక్స్ ధరలు అధికంగా ఉండడంతో యూరియాపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఒక్క బస్తా అవసరం ఉన్నచోట రెండు బస్తాలను వినియోగిస్తున్నారు. దీంతో యూరియా కొరత ఏర్పడుతోంది. రవాణా జాప్యం వల్ల కూడా కొంత సమస్యకు దారి తీస్తోందని చెబుతున్నారు.
దోచుకుంటున్న వ్యాపారులు
పరిగిలో డీఏపీ బస్తా ఎమ్మార్పీ రూ.1,350 ఉంటే రూ.1,850 తీసుకున్నారు. కాంప్లెక్స్, యూరియా బస్తాలకు కూడా ఎమ్మార్పీ కంటే వందల్లో ఎక్కువ తీసుకుంటున్నారు. అయినా అవసరం ఉన్న మేర కొందామన్నా వ్యాపారులు కొరత సృష్టించి దోచుకుంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
ఆంజనేయులు, రైతు, సుల్తాన్‌పూర్
అధిక ధరలకు విక్రయాలు
ఎరువులను మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆగ్రోస్ కేంద్రంలో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల బస్తా ఒక్కోదానిపై రూ.500 పెంచి విక్రయిస్తున్నారు. ఎందుకింత ధర అని అగిడితే కొతర ఉంది అంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఎరువుల అమ్మకాలపై ఉన్నతాధికారులు స్పందించాలి.
మురళీధర్‌రెడ్డి, రైతు, మోత్కూర్, దోమ మండలం
ఈ వార్తలు కూడా చదవండి:
ఇందరిమ్మ ఇళ్ల దరఖాస్తుకు ఆధార్ ఉంటే చాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News