ఆషాఢంలో గోరింట సందడి
ABN , Publish Date - Jul 23 , 2026 | 08:42 AM
ఆషాఢమాసం వచ్చిందంటే చాలు... ప్రతి ఒక్కరికీ గోరింటాకు గుర్తుకువస్తుంది. ఇంటింటా గోరింట సందడి నెలకొంటుంది.
మురిపించే ముంజేతుల అందం!
పచ్చని ప్రకృతి ప్రసాదం...
అదృష్టం, ఆరోగ్యాల సంగమం
కులమతాలకతీతంగా జరుపుకునే వేడుక
చేర్యాల(సిద్దిపేట): ఆషాఢమాసం వచ్చిందంటే చాలు... ప్రతి ఒక్కరికీ గోరింటాకు గుర్తుకువస్తుంది. ఇంటింటా గోరింట సందడి నెలకొంటుంది. మహిళల జీవితాలతో ముడిపడి ఉన్న గోరింటాకుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అన్నదమ్ముల, చెల్లెళ్ల బంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని ఇది తెలియజేస్తుందని ప్రజల నమ్మకం. అతివల చేతుల అందాన్ని మరింత పెంచడంతో పాటు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో గోరింటాకు ముందుంటుంది. అందుకే మహిళలందరూ ఆషాఢ మాసంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
కులమతాలకతీతంగా అన్ని వేడుకల్లో మగువల ముంజేతులను ముద్దాడే గోరింటాకును ప్రకృతి ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో గోరింట చెట్లు కొత్త చిగుళ్లు తొడుక్కుని కళకళలాడుతుంటాయి. ఇటీవల ఆషాఢమాసం ప్రారంభమైన నేపథ్యంలో, ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతీ ఇంటా గోరింట సందడి నెలకొంది. నలుగురు ఒక్కచోట చేరినా, శుభకార్యాలైనా, ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకొని తీరాలని పెద్దలు చెబుతుంటారు.
ఆరోగ్య ప్రయోజనాలు
జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షంలో తడవాల్సి రావడం, పొలం పనులు చేసుకోవడం, ఏర్లు దాటాల్సి రావడంతో కాళ్లు, చేతులు నీటిలో నానుతుంటాయి. ఈ సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ సమస్యలను అడ్డుకుంటుంది. అలాగే, ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ మార్పు వల్ల శరీరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అన్ని రకాలుగా గోరింటాకు ఎంతో మేలు చేస్తుంది.
ఔషధమయం గోరింటాకు
ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తమే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో భాగమే. కేవలం ఆషాఢంలోనే కాకుండా అట్లతద్ది నాడూ, ఇతర శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఏడాదికి కొన్నిసారైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నదే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
పండిన కొద్దీ సంబరం
గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని అంటుంటారు. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చినప్పుడు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. గోరింటాకు ఎంత ఎక్కువగా ఎర్రగా పండితే ఆమె జీవితం అంత సుఖమయంగా సాగుతుందని పెద్దలు నమ్ముతారు. మందారం, గన్నేరు రంగులలో పండినా ఒక్కో రకంగా భావిస్తుంటారు. ఆకులను రుబ్బే క్రమంలో కాసు, పటిక, సున్నం వేసి మరింత ఎర్రగా వచ్చేలా చేస్తారు. అరచేతులు, పాదాలనిండా గోరింట పెట్టుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు గోళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. గోరింటాకును నమలడం వల్ల పేగులు శుభ్రపడి అల్సర్ తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. గాయాలైన చోట గోరింటాకు పూస్తే త్వరగా మానిపోతాయని కూడా నమ్మకం ఉంది.
యేటా సంబురంగా జరుపుకుంటాం
ఆషాఢ మాసం రావడంతోనే మా స్నేహితులందరం కలిసి ఒకచోట చేరతాం. గోరింటాకు రుబ్బుకుని మా చేతులకు పెట్టుకుంటాం. సుమారు పది సంవత్సరాలుగా ఈ సంబరాలు జరుపుకుంటూ, మన సాంప్రదాయాన్ని మా పిల్లలకు కూడా తెలియజేస్తున్నాం.
బచ్చు అండాలు, చేర్యాల
ఈ వార్తలు కూడా చదవండి:
ఇందరిమ్మ ఇళ్ల దరఖాస్తుకు ఆధార్ ఉంటే చాలు
పసిడి ధరలు మరికొంత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News