Share News

ఇందరిమ్మ ఇళ్ల దరఖాస్తుకు ఆధార్‌ ఉంటే చాలు

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:42 AM

క్యూర్‌ పరిధిలో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్నవారు ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకానికి అర్హులని హౌసింగ్‌ శాఖ కమిషనర్‌ వి.పి.గౌతమ్‌ తెలిపారు.

ఇందరిమ్మ ఇళ్ల దరఖాస్తుకు ఆధార్‌ ఉంటే చాలు

  • గూగుల్‌/ఫోన్‌ పే నుంచే ఫీజు చెల్లించొచ్చు

  • ఇల్లు రాకపోతే అదే ఖాతాకు డబ్బులు జమ చేస్తాం

  • ‘ఆంధ్రజ్యోతి’తో హౌసింగ్‌ శాఖ కమిషనర్‌ వి.పి.గౌతమ్‌

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): క్యూర్‌ పరిధిలో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్నవారు ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకానికి అర్హులని హౌసింగ్‌ శాఖ కమిషనర్‌ వి.పి.గౌతమ్‌ తెలిపారు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌, ఫోన్‌ నంబర్‌తోపాటు కుటుంబంలోని ఇతర సభ్యుల ఆధార్‌ నంబర్లు ఉంటే చాలని.. పెళ్లి కానివారు ‘అన్‌మ్యారీడ్‌’ ఆప్షన్‌ ఎంచుకుని, వారి తల్లిదండ్రుల ఆధార్‌లు ఇస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు. కులధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల్లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఇళ్లకు సంబంధించిన సందేహాలు, ఇతర అంశాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అందులో ముఖ్యాంశాలు..

  • ఎల్‌ఐజీ ఇళ్ల పథకం గురించి తెలుసుకునేందుకు మేము ఏర్పాటుచేసిన కాల్‌సెంటర్‌కు చాలామంది ఫోన్‌లు చేస్తున్నారు. తొలివిడతలో ప్రకటించిన 16 నియోజకవర్గాల వారే కాకుండా మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో వారు తమకెప్పుడు ఇస్తారని అడిగారు. ‘‘మేము ఒకచోట.. మా ఆధార్‌లు, అడ్ర్‌సలు వేరే నియోజకవర్గంలో ఉన్నాయి.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాల’’ని మరికొంతమంది అడిగారు. ప్రస్తుతం తొలివిడతలో ప్రకటించిన 16 నియోజకవర్గాల పరిధిలో ఉంటున్నవారు.. అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసమే అప్లికేషన్‌ ఫారమ్‌లో వార్డు, నియోజకవర్గం, సర్కిల్‌ ఆప్షన్లను ఇచ్చాం. వాటి ప్రకారం వివరాలు ఇస్తే సరిపోతుంది.


  • వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌లో పరిశీలిస్తాం. ఇచ్చిన వివరాలు తప్పుగా ఉన్నా, గతంలో ప్రభుత్వ ప్రయోజనం పొంది ఉన్నా.. అనర్హులుగా పరిగణిస్తాం. ఈ విషయాన్ని పథకం ప్రారంభం రోజు కూడా చెప్పాం.

  • కుటుంబంలో ఒకరు ఇప్పటికకే ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే వారి అప్లికేషన్‌ను తరువాతి ఫేజ్‌లో ఆమోదిస్తాం. ఎందుకంటే పదేళ్లగా ఇంట్లోని ఏ ఒక్కరూ ప్రభుత్వ సహాయం పొందకుండా, అద్దె ఇంట్లో ఉంటున్నవారికే అవకాశం కల్పించాలన్నది ఉద్దేశం.

  • దరఖాస్తుదారులు గూగుల్‌పే/ఫోన్‌పేతో వంటివాటితో యూపీఐ విధానంలో ఫీజు చెల్లించుకునేలా అవకాశం కల్పించాం. ఇల్లు రాకపోతే.. దరఖాస్తుదారుల గూగుల్‌పే/ఫోన్‌పే లేదా ఇతర యూపీఐలు అనుసంధానమై ఉన్న ఖాతాలకే రిటర్న్‌ ఎమౌంట్‌ను జమ చేస్తాం. అది కూడా ఇల్లు కేటాయింపులు పూర్తయిన మరుసటి రోజే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - Jul 23 , 2026 | 06:43 AM