Share News

సీజేపీ ఉద్యమంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పోస్టు..

ABN , Publish Date - Jul 23 , 2026 | 07:17 AM

దేశంలో పేపర్ లీక్‌ల వ్యవహారంపై సీజేపీ చేస్తున్న ఉద్యమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సీజేపీ ఉద్యమంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పోస్టు..
Salman Khan

ముంబై: దేశంలో పేపర్ లీక్‌ల వ్యవహారంపై సీజేపీ చేస్తున్న ఉద్యమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులు, వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు తాను విద్యార్థిగా ఉన్నప్పటి ఫొటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరిత పోస్టు చేశారు.


పేపర్ లీక్ అనేది అత్యంత తీవ్రమైన సమస్యని, మెరుగైన విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులంతా ఒక్కటై పోరాడటం అభినందనీయమని సల్మాన్ అన్నారు. ఈ ఉద్యమానికి వారి తల్లిదండ్రులూ అండగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటం వారి అంకితభావం, నిజాయితీ, కష్టపడి చదివి తమ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును నిర్మించాలనే తపనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ శాంతియుత నిరసనలో విద్యార్థులు ప్రదర్శించిన ధైర్యం, నిబద్ధత ప్రశంసనీయమన్నారు. విద్య పట్ల ఇంతటి ఆసక్తి, లక్ష్యసాధనతో ముందుకు సాగుతున్న ఈ తరం భారతదేశానికి గర్వకారణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వివాదం విద్యార్థులు, విద్యా వ్యవస్థ మధ్య ఉన్న అంశమని, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఉద్యమానికి సంబంధించిన పూర్తి గుర్తింపు, క్రెడిట్ విద్యార్థులకే దక్కాలని ఆయన అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరించి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. విద్యను కోరుకునే ప్రతి విద్యార్థిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్న సల్మాన్.. భవిష్యత్తులో విద్యే కొత్త ట్రెండ్‌గా, ఫ్యాషన్‌గా మారాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది విద్యకు మరింత ప్రాధాన్యం పెరిగి, ప్రపంచంలోని ఇతర దేశాల విద్యార్థులు చదువు కోసం భారత్‌కి వచ్చేలా దేశం అంతర్జాతీయ విద్యా కేంద్రంగా ఎదగాలన్నారు.


కాగా, సల్మాన్ ఖాన్ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఓమీ వైద్య, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు ఇప్పటికే సీజేపీ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

మా టైం వేస్ట్‌ చేయొద్దు.. ఆ వీడియోలు చూడం

చర్చలకు సిద్ధమే కానీ..

Updated Date - Jul 23 , 2026 | 07:27 AM