Share News

చర్చలకు సిద్ధమే కానీ..

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:28 AM

ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని, అయితే, మంత్రుల నివాసం వద్ద కాకుండా.. ఏదైనా తటస్థ వేదిక వద్దగానీ, నిరసన జరుగుతున్న జంతర్‌మంతర్‌ వద్దగానీ జరపాలని..

చర్చలకు సిద్ధమే కానీ..

మంత్రుల నివాసాలకు మాత్రం రాబోము!

తటస్థ వేదిక లేదా జంతర్‌మంతర్‌ వద్దనైతే మాకు అభ్యంతరం లేదు

మా డిమాండ్లపై కేంద్రం నిజాయతీగా స్పందించాలి

ఉద్యమం కొనసాగుతోంది, విస్తరిస్తోంది: సీజేపీ

యువత మీద దమనకాండ వద్దు..

నిరసనలో పాల్గొన్న వారి మీద కేసులు పెట్టొద్దు

హామీ ఇస్తే ఆమరణ దీక్ష విరమిస్తా: వాంగ్‌చుక్‌

జంతర్‌మంతర్‌ మళ్లీ రణరంగం

ఇద్దరు ఏసీపీలు సహా పలువురికి గాయాలు

తమపై కత్తులతో దాడి చేశార న్న పోలీసులు

న్యూఢిల్లీ, జూలై 22: ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని, అయితే, మంత్రుల నివాసం వద్ద కాకుండా.. ఏదైనా తటస్థ వేదిక వద్దగానీ, నిరసన జరుగుతున్న జంతర్‌మంతర్‌ వద్దగానీ జరపాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్‌ చేసింది. చర్చలకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహ్వానించినట్లుగా బుధవారం ఉదయం పోలీసులు తమకు తెలిపారని, అయితే, చర్చల వేదికపై తమ వైఖరిని వారికి స్పష్టం చేశామని పేర్కొంది. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్‌ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చలో పార్లమెంటు ర్యాలీ జరిగిన సోమవారం నాడు కూడా తమను చర్చల పేరుతో ఆహ్వానించి.. మంత్రి నివాసంలోకి వెళ్లిన తర్వాత తమ ఫోన్లు తీసేసుకున్నారని, 2 గంటలపాటు వేచి ఉండేలా చేశారని గుర్తు చేశారు. తాము బయటకు వెళ్లకుండా దాదాపుగా గృహ నిర్బంధం చేశారని, ఆ తర్వాత కూడా ఏమీ తేలని చర్చలను కొనసాగించారని పేర్కొన్నారు. బయట తమ సహచరుల ర్యాలీపై పోలీసుల దమనకాండను ప్రయోగిస్తూ, మరోవైపు చర్చల పేరుతో తమ సమయం వృథా చేశారని తెలిపారు. ‘ఈ నేపథ్యంలోనే ఈసారి చర్చలకు రమ్మంటే మేం ఎవరి ఇంటికిగానీ, ఆఫీసుకుగానీ రామని చెప్పాం. మంత్రులు ప్రజల్లోకి రావాలి. జంతర్‌మంతర్‌ వద్దకు వచ్చి చర్చలు జరపాలి. భద్రతాకారణాల రీత్యా ఇక్కడ వద్దనుకుంటే.. దగ్గరలోని ఏదైనా తటస్థ వేదిక వద్ద చర్చలకైనా వస్తాం. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మేం సిద్ధం’ అని సౌరవ్‌దాస్‌ స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద వేలాదిమంది ఉన్నారని, ఉద్యమం కొనసాగుతుందని.. బిహార్‌, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర ప్రాంతాలకు విస్తరించిందని అన్నారు. డిమాండ్లను పునరుద్ఘాటించారు. వాటితోపాటు నిరసనకారుల మీద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


25వ రోజుకు చేరుకున్న వాంగ్‌చుక్‌ దీక్ష

చలో పార్లమెంటు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువత మీద ఎటువంటి కఠినమైన చర్యలు చేపట్టవద్దని కేంద్రప్రభుత్వానికి సోనమ్‌ వాంగ్‌చుక్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తనకు సంపూర్ణమైన హామీ ఇస్తే తాను.. గత 25రోజులుగా కొనసాగిస్తున్న ఆమరణ నిరాహారదీక్షను విరమించుకుంటానని తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్‌లకు వాంగ్‌చుక్‌ బుధవారం ఒక లేఖ రాశారు. మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్‌ను మంగళవారం రాత్రి నడ్డా, జితేంద్రసింగ్‌ పరామర్శించారు. నీట్‌ తదితర పరీక్షల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, పేపర్‌ లీకేజీలపై పార్లమెంటులో చర్చ జరపాలన్న ప్రధాన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రులు తనకు హామీ ఇచ్చిన విషయాన్ని ఆ లేఖలో వాంగ్‌చుక్‌ ప్రస్తావించారు. వీటితోపాటు, విద్యార్థుల మీద ఎటువంటి కఠిన చర్యలు చేపట్టవద్దని పేర్కొన్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే, తాను నిరాహారదీక్షను విరమించటమేగాక.. ఉద్యమాన్ని నిలిపివేసి ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా విద్యార్థులకు పిలుపు ఇస్తానన్నారు. ‘దేశానికి మరెంతో సేవ చేయాల్సి ఉందని, దీక్ష విరమించాలని ప్రతిపక్షపార్టీలకు చెందిన 65మంది ఎంపీలు నన్ను కోరారు. నిజమే! నాకు కూడా బతకాలనే ఉంది. నా విద్యార్థుల వద్దకు, నా విద్యాసంస్థల వద్దకు తిరిగి వెళ్లాలనే ఉంది. కానీ ఏ యువత కోసం ఈ ఉద్యమం మొదలైందో వారిని వదిలిపెట్టి నేను వెళ్లలేను’ అని పేర్కొన్నారు. ఈ లేఖను వాంగ్‌చుక్‌ ఎక్స్‌లో కూడా పోస్ట్‌ చేశారు. వాంగ్‌చుక్‌ను దీక్ష విరమించాల్సిందిగా సీజేపీ కూడా విజ్ఞప్తి చేసింది. ‘ఇప్పటికే మీ త్యాగం వేలాదిమంది విద్యార్థులను కదిలించింది. మీరు దీక్ష విరమించినా.. పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొంది.


జంతర్‌మంతర్‌ మళ్లీ రణరంగం

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ మరోసారి రణరంగంగా మారింది. బుధవారం రాత్రి పోలీసులతో కొందరు విద్యార్థులు హింసాత్మక ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కొందరు విద్యార్థులు కూడా గాయపడ్డారు. విద్యార్థులపైకి పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘటనపై పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాత్రి 8.30 గంటల సమయంలో ప్రధాన ధర్నా ప్రదేశం నుంచి కొంతమంది విద్యార్థులు గుంపుగా కన్నాట్‌ప్లే్‌సలోని టాల్స్‌టాయ్‌ మార్గ్‌ వైపు దూసుకుపోయారు. వెంటనే ఽసీజేపీ నేతలకు ఫోన్‌ చేసి, ఆ విద్యార్థులను అదుపు చేయాలని కోరాం. గొడవ ఆపాలని వారు కోరినా ఆ గుంపు పట్టించుకోలేదు. పోలీసులపై రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసిరారు. కర్రలు, కత్తులు, కుక్రీల తో పోలీసులను చంపటానికి ప్రయత్నించారు. ఆ గుంపు దాడిలో ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మరికొందరు పోలీస్‌ సిబ్బంది గాయపడ్డారు’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read:

కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 23 , 2026 | 06:32 AM