మా టైం వేస్ట్ చేయొద్దు.. ఆ వీడియోలు చూడం
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:23 AM
కాక్రోచ్ జనతాపార్టీ నిర్వహించిన ‘చలో సంసద్’ మార్చ్‌లో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసుల క్రౌర్యంపై సుమోటోగా (స్వచ్ఛందంగా) అత్యవసర విచారణ చేపట్టాలంటూ నరేంద్ర మిశ్రా అనే న్యాయవాది...
ఢిల్లీ లాఠీచార్జ్ వీడియోలు చూడాలన్న న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీజేఐ
అంత సమయం తమకు లేదని స్పష్టీకరణ
ఇంత అహంకారం సరికాదని సీజేఐ గ్రహించాలి.. కేంద్రం నచ్చజెప్పాలి
అత్యున్నత పదవుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం ప్రజాస్వామ్యానికే మచ్చ: సీజేపీ
ఇదేదో చెదురుమదురు ఘటన కాదు
బాధితులు ప్రైవేటు కేసు పెట్టుకోవాలని ఎలా అంటారు?
అదనపు సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
4 వారాల్లో స్పందించాలంటూ పోలీసులు, కేంద్రానికి నోటీసులు
సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాక్ష్యాలను భద్రపరచాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 22: కాక్రోచ్ జనతాపార్టీ నిర్వహించిన ‘చలో సంసద్’ మార్చ్‌లో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసుల క్రౌర్యంపై సుమోటోగా (స్వచ్ఛందంగా) అత్యవసర విచారణ చేపట్టాలంటూ నరేంద్ర మిశ్రా అనే న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని దీనిపై సుమోటోగా విచారణ జరపాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనానికి మిశ్రా విజ్ఞప్తి చేశారు. అలాగే.. సుప్రీంకోర్టులోని సిట్టింగ్ బెంచ్‌తో స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలన్నారు. విద్యార్థులు అత్యంత ముఖ్యమైన సమస్యలను లేవనెత్తుతున్నారని.. నీట్ పరీక్షను సరిగ్గా నిర్వహించాలని, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు కోరుతున్నారని ఆయన చెబుతుండగా మధ్యలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ‘‘మా సమయాన్ని వృథా చేయొద్దు. అలాగే మీ సమయాన్ని కూడా వృథా చేసుకోవద్దు. మీ సమయం మా సమయం కంటే కూడా విలువైనది’’ అని వ్యాఖ్యానించారు. పోలీసుల క్రౌర్యానికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయని.. వీలైతే గురువారంనాటి విచారణ జాబితాలోఈ కేసును లిస్ట్ చేయాలని మిశ్రా ధర్మాసనాన్ని అభ్యర్థించగా.. జస్టిస్ సూర్యకాంత్ ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు. మెన్షనింగ్ (సమస్యను కోర్టు దృష్టికి తీసుకొచ్చే) దశలోనే వీడియో ఫుటీజీని పరిశీలించడానికి ధర్మాసనం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ‘‘మాకు వీడియోలపై ఆసక్తి లేదు. వీడియోలు చూసే సమయం లేదు. వాటిని చూడాలని కూడా అనుకోవట్లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. అసలు అభిజీత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ని ఏర్పాటు చేయడానికి.. దీప్కే వెనుక దేశ యువత ఇంతగా ర్యాలీ కావడానికి.. గతంలో సీజేఐ చేసిన ‘బొద్దింకలు’ అనే వ్యాఖ్యే కారణమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై సీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘ఇలాంటి వ్యక్తులు ఇంతటి అధికారం ఉన్న పదవుల్లో ఉండడం మన ప్రజాస్వామ్యానికే మచ్చ. మరీ ఇంత అహంకారం మంచిది కాదని సూర్యకాంత్‌జీ గ్రహించాలి. భారత ప్రభుత్వం ఆయనకు నచ్చజెప్పాలి’’ అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ‘ఎక్స్’ వేదికగా ఘాటైన పదజాలంతో విమర్శించారు.
ఢిల్లీ పోలీసులు, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టుకు భిన్నంగా వ్యవహరించింది. విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన రెండు పిల్స్‌పై ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వాటిపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. ఇవి ప్రచారం కోసం వేసిన పిల్స్ అంటూ.. ఢిల్లీ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు చేసిన వ్యాఖ్యలతో ధర్మాసనం విభేదించింది. ‘చలో సంసద్’ మార్చ్ సీసీటీవీ ఫుటేజీని, బాడీ కెమెరా రికార్డింగ్‌లను, పీసీఆర్ లాగ్స్‌ను, ఇతర సాక్ష్యాలను భద్రపరచాలని అధికారులను ఆదేశించింది.
సిట్ ఏర్పాటు చేయాలి..
విద్యార్థుల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరిహరన్.. ఈ ఘటనపై దర్యాప్తునకు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పోలీసులు కొందరు మహిళలను లైంగికంగా వేధించారని.. వారి ప్రైవేట్ భాగాలపై లాఠీలను ప్రయోగించారని ఆరోపించారు. మరో పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకర్‌నారాయణన్.. చాలా మంది పోలీసులు యూనిఫాం లేకుండా లాఠీచార్జ్ చేశారని, యూనిఫాంలో ఉన్నవారు కూడా నేమ్ బ్యాడ్జీలు ధరించలేదని.. కొందరు పోలీసులు చట్టసమ్మతం కాని ఆయుధాలు ధరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిరసనలో పాల్గొన్న ఒక మహిళను అనవసరంగా కొట్టారని అందుకు వీడియో ఆధారాలున్నాయని తెలిపారు. ఢిల్లీ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు.. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ వారిపై దాడులు చేసిన వీడియోలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అందరి వాదనలూ విన్న ధర్మాసనం.. పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో నిజానిజాలపైన, వారు చూపిన వీడియోల ప్రామాణికతపైన ఎలాంటి అభిప్రాయాలూ ఇప్పుడు వ్యక్తం చేయబోమని.. కేంద్రప్రభుత్వం, ఢిల్లీపోలీసులు తమ స్పందనలను దాఖలు చేశాకే దీన్ని పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది.
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి