వైద్యుల మందుల చీటీ తారుమారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:30 PM
వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డారు. అసలేం జరిగిందంటే...
కామారెడ్డి జిల్లా, జనవరి21 (ఆంధ్రజ్యోతి): వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ, ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన వైద్య రంగంలోని నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తుల విషయంలో వైద్యుడు చేసిన పొరపాటు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
మందుల చీటీ తారుమారు..
కామారెడ్డికి చెందిన నాగ బాలరాజు(73) అనే వృద్ధుడు గత కొంతకాలంగా నరాల సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ఆస్పత్రిని ఆశ్రయించారు. బాధితుడి పేరు బాలరాజు కాగా.. అదే సమయంలో ఆస్పత్రిలో అదే పేరుతో(బాలరాజు) ఉన్న మరో డయాబెటిక్(మధుమేహం) రోగి కూడా చికిత్స పొందుతున్నారు. వైద్యుడు నరాల సమస్యతో ఉన్న నాగ బాలరాజుకు.. డయాబెటిక్ రోగికి ఇవ్వాల్సిన మందులను ఈయన మందుల చీటీలో రాసిచ్చారు. నరాల వ్యాధికి బదులుగా హైడోస్ డయాబెటిక్ మందులు వాడటంతో బాలరాజు ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, ఇతర దుష్ప్రభావాల వల్ల ఆయన పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. అప్పటికే మందులు వికటించడంతో నాగ బాలరాజు మృతిచెందారు. సరైన రోగ నిర్ధారణ చేయకుండా.. కనీసం రోగి వివరాలు సరిచూసుకోకుండా మందులు రాసిచ్చిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసు నమోదు..
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రి వైద్యుడు, కాంపౌండర్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలోని మెడికల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే పేరున్న వ్యక్తులకు మందులు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన కనీస జాగ్రత్తలను ఎందుకు విస్మరించారనే కోణంలో విచారణ చేపట్టారు.
రోగులు, కుటుంబ సభ్యులకు సూచనలు..
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రోగులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
వైద్యుడు రాసిచ్చిన కాగితంపై మీ పేరు, వయస్సు వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోవడం.
కొత్తగా మందులు వాడేటప్పుడు అవి ఏ వ్యాధి కోసం ఇస్తున్నారో వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవడం.
ఏదైనా మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత వికటించినట్లు అనిపిస్తే(తల తిరగడం, వాంతులు, నీరసం) వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం.
వైద్యుడు దేవుడితో సమానమని నమ్మి వెళ్తే.. చిన్న నిర్లక్ష్యం వల్ల తమ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రపంచ ఆర్థిక సదస్సు.. ఒకే వేదికపై సీఎం రేవంత్‌రెడ్డితో చిరంజీవి
మేడారం మహాజాతరలో నేడు తొలి ఘట్టం..
Read Latest Telangana News And Telugu News