మేడారం మహాజాతరలో నేడు తొలి ఘట్టం..
ABN , Publish Date - Jan 21 , 2026 | 08:05 AM
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో నేడు తొలి ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మండమెలిగే పండుగతో మొదలవుతున్న.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం.. లక్షలాది మంది భక్తుల రాకతో మరింత వైభవంగా కొనసాగనుంది.
ములుగు, జనవరి21 (ఆంధ్రజ్యోతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క - సారలమ్మ మహాజాతరలో (Medaram Maha Jatara) బుధవారం అత్యంత కీలకమైన తొలి ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం 'మండమెలిగే' పండుగతో జాతర అధికారికంగా ప్రారంభం కానుంది.
'మండమెలిగే' పండుగ ప్రత్యేకతలివే..
ఈ జాతర ప్రారంభానికి ముందు మేడారంలోని గిరిజన పూజారులు నిర్వహించే అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఇది. మేడారం గ్రామంలోని సమ్మక్క ప్రధాన ఆలయాన్ని, అలాగే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని ఆదివాసీ పూజారులు పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. ఈ రోజు పూజారులు అత్యంత రహస్యంగా ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో సామాన్యులకు ప్రవేశం ఉండదు. డోలు వాయిద్యాల మధ్య పూజారులు మేడారం వీధుల్లో, ఆలయ పరిసరాల్లో పచ్చని తోరణాలు కట్టి పండుగ వాతావరణాన్ని తీసుకువస్తారు.
కోయ పూజారుల ఆచారం..
నేటి నుంచి జాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠినమైన నియమాలను, ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. మహాజాతర ఇంకా ఊపందుకోకముందే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. తమ మొక్కులు చెల్లించుకోవడానికి బంగారం (బెల్లం)తో భక్తులు సిద్ధమయ్యారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. జనవరి 25వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు 3,495 ప్రత్యేక బస్సులు నడపనుంది. సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా ఛార్జీలు ఉన్నాయి. ప్రధాన కేంద్రాలైన హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
జాతర షెడ్యూల్..
మండమెలిగే పండుగ తర్వాత జాతర ప్రధాన ఘట్టాలు ఇలా ఉండనున్నాయి.
మొదటి రోజు: కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు రాక.
రెండోరోజు: చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క రాక.
మూడోరోజు: అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడం.
నాల్గోరోజు: అమ్మవార్లు వనప్రవేశం చేయడం (జాతర ముగింపు).
భక్తులకు సూచనలు..
ములుగు - మేడారం దారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తమ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మేడారం పోలీసులు తెలిపారు. రద్దీ ప్రదేశాల్లో చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పవిత్రమైన జంపన్న వాగును, మేడారం పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో సహకరించాలని మేడారం పోలీసులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
హరీశ్‌రావును జైలుకు పంపాలని తహతహలాడుతున్నారు.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Read Latest Telangana News And Telugu News