ఫార్మా ల్యాబ్‌లో పేలిన రియాక్టర్.. 9 మందికి గాయాలు
ABN , Publish Date - May 01 , 2026 | 01:51 PM
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామశివారులోని నోష్ ఫార్మా ల్యాబ్‌లో శుక్రవారం రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
నల్లగొండ, మే1 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామశివారులోని నోష్ ఫార్మా ల్యాబ్‌లో (Nosh Pharma Lab) ఈరోజు (శుక్రవారం) రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేడే రోజే ఈ దుర్ఘటన జరగడం కార్మికులలో ఆందోళనను మరింత పెంచింది. పేరేపల్లి గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలోని బ్లాక్-3లో ఈరోజు ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్‌లో పని చేస్తున్న 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని తక్షణమే స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా తెలుస్తోంది.
ఆందోళన కలిగిస్తున్న వరుస ప్రమాదాలు
ఈ కంపెనీలో భద్రతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారని కార్మిక సంఘాలు, స్థానికులు యజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. 20 రోజుల క్రితమే ఇదే కంపెనీలోని రెండో బ్లాక్‌లో రియాక్టర్ పేలిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 20 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఇలాంటి భారీ ప్రమాదాలు జరగడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని, భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. కార్మికుల కోసం కేటాయించిన మేడే రోజే విధి నిర్వహణలో ఉండి ప్రమాదానికి గురికావడంపై కార్మిక సంఘాలు యజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఫార్మా కంపెనీలలో రియాక్టర్ పేలుళ్లకు కారణాలు
సాధారణంగా ఫార్మా కంపెనీల్లో ఇలాంటి ప్రమాదాలు ఈ కారణాల వల్ల జరుగుతుంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. రియాక్షన్ సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగితే ఒత్తిడి తట్టుకోలేక రియాక్టర్ పేలే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పాతబడిన యంత్రాలు లేదా తుప్పు పట్టిన పైపుల వల్ల గ్యాస్ లీకేజీ జరుగుతుంటాయని చెప్పారు. రసాయనాలను కలిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
వరుస ప్రమాదాలకు కారణమైన నోష్ ఫార్మాపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ జరిపించాలని కార్మిక సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, భారీగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లా అధికారులు అన్ని ఫార్మా కంపెనీల్లో 'సేఫ్టీ ఆడిట్' నిర్వహించి, నిబంధనలు పాటించని కంపెనీలను వెంటనే సీజ్ చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు ఈ ఘటనపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం
పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And International News And Telugu News