Share News

నాడు పోరాటం.. నేడు బతుకు ఆరాటం

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:05 PM

రాష్ట్ర ఏర్పాటు తర్వాత కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించినా ఇందులో కొందరు అర్హులకు మాత్రం చోటు దక్కలేదు. కుటుంబాలను పట్టించుకోకుండా ధూంధాం ప్రదర్శన పేరిట ఊరూరా తిరిగిన కళాకారులకు నిరాశే ఎదురైంది.

నాడు పోరాటం.. నేడు బతుకు ఆరాటం
Telangana Movement Artists

  • ధూంధాం ప్రదర్శనలతో ఉద్యమ గొంతెత్తిన కళాకారులకు అవస్థలు

  • అర్హతలున్నా అందని సాంస్కృతిక సారథి ఉద్యోగాలు

  • తోచిన పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న వైనం

  • ఈ ప్రభుత్వమైన ఆదుకోవాలని వేడుకోలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు గోసి, గొంగడి వేసుకొని చిర్ర, చిటుక డప్పు దరువులు, ఆట, పాటలతో తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర సాధనలో కీలక శక్తిగా నిలిచారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా ఆ కళాకారులు నేడు జీవనోపాధి కోసం అల్లాడుతున్నారు.

హుస్నాబాద్‌(సిద్దిపేట): రాష్ట్ర ఏర్పాటు తర్వాత కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించినా ఇందులో కొందరు అర్హులకు మాత్రం చోటు దక్కలేదు. కుటుంబాలను పట్టించుకోకుండా ధూంధాం ప్రదర్శన పేరిట ఊరూరా తిరిగిన కళాకారులకు నిరాశే ఎదురైంది. ‘మేం అసలు సిసలైన ఉద్యమ కళాకారులమూ.. మమ్మల్ని ఆదుకోండి’ అంటూ కాళ్లు అరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక కులవృత్తులు, కూలీనాలి, ఏదో పని చేసుకుంటూ బతుకు వెల్లదీస్తున్నారు. హుస్నాబాద్‌ ప్రాంతంలో ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు సాంస్కృతిక సారథిలో చోటుదక్కలేదు. ఈ ప్రభుత్వమైనా తమను గుర్తించి సారథిలో ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంత మంది ఉద్యమ కళాకారుల దీనస్థితిపై ‘ఆంధ్రజ్యోతి కథనం..


వందల ప్రదర్శనలు ఇచ్చి.. కూలీగా మారి

sdp1.3.jpgహుస్నాబాద్‌ మండలం గాంధీనగర్‌ గ్రామానికి చెందిన గద్ద సంపత్‌ చిన్న నాటి నుంచే కళాకారుడు. 2005 నుంచి ఈ ప్రాంతంలో తెలంగాణ ఆట, పాటలతో ఊర్రుతలూగించాడు. 2009 తర్వాత ధూంధాంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ ప్రదర్శనలు ఇచ్చారు. గద్దర్‌, దేశపతి శ్రీనివాస్‌, తేలు విజయ, నేర్పాల కిశోర్‌ వంటి కళాకారులతో కలసి పాడారు. సకల జనుల సమ్మెలో జరిగే ర్యాలీలు, ధర్నాలు, శిబిరాల్లో తన పాటలతో చైతన్యం కల్పించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాంస్కృతిక సారథికి దరఖాస్తు చేసుకున్నా, ఎంపిక కాలేదు. మళ్లీ రెండోసారి దరఖాస్తు చేయగా, మళ్లీ నిరాశే ఎదురైంది. రెండేళ్ల వయస్సున్న వారికి కూడా సారథిగా ఉద్యోగం కల్పించి, తనకు నిరాకరించడంతో ఆవేదన చెంది ప్రస్తుతం కూలి పనులు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అయినా సభలు పెడితే ఈ సంపత్‌తో తెలంగాణ ఉద్యమ పాటలు పాడించుకుంటున్నారు.


sdp1.jpgపాటలు పాడి.. ప్రస్తుతం పాఠాలు చెబుతూ

హుస్నాబాద్‌ మండలం గాంధీనగర్‌కు కొడముంజ రవీందర్‌ ఎంఏ తెలుగు చదివారు. కళారంగం మీద ఉన్న మక్కువతో 1990 నుంచి జానపద కళాకారునిగా, రంగస్థల నటుడిగా, అభ్యుదయ పాటల రచయితగా వందలాది రాష్ట్రస్థాయి ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి తన కళను ఇటువైపు మళ్లించాడు. గద్దర్‌, తేలు విజయ, నేర్నాల కిషోర్‌, రసమయి వంటి బృందాల్లో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ఉద్యమకాలంలో ఇంటివైపు వెళ్లకుండా సభలు, సమావేశాల్లో గొల్లసుద్దులు వేస్తూ వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ సారథి కళాకారునికి దరఖాస్తు చేసుకుంటే అన్ని అర్హతలున్నాయని చెప్పారు కానీ, ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి బతుకు భారమై ఓ కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నారు.


ఉద్యమ గీతాలు ఆలపించి.. గీత పనే దిక్కై..

sdp1.2.jpgఉద్యమంలో టీఆర్‌ఎస్‌ సాంస్కృతిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా మంద రవీందర్‌ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ధూంధాం కళాకారునిగా రాష్ట్రంలో అనేక చోట్ల జరిగిన కళా వేదికల్లో పాటలు పాడారు. సమైక్య పాలనలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పాటలు పాడుతుంటే పోలీసులు లాఠీలతో కొట్టినా ఉద్యమ గీతాలు ఆలపించారు. గీత వృత్తిని విడిచిపెట్టి రోజు సభలు, సమావేశాలకు వెళ్లే వారు. తెలంగాణ వచ్చాక, ఉపాధి దొరుకుతుందని భావించిన మంద రవీందర్‌కు నిరాశే ఎదురైంది. సాంస్కృతిక సారథిలో దరఖాస్తు చేసుకోగా, తన కళ్లముందే చిన్న పిల్లలకు ఇచ్చి ఆయనకు మొండి చేయి చూపారు. చేసేది లేక మళ్లీ గీత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.


ఉద్యమానికి ఇంధనమై.. నేడు పెట్రోల్‌ బంక్‌లో పనికి

హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌) గ్రామానికి చెందిన ధూంధాం కళాకారుడు మామిడి రాజశేఖర్‌ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం రాక పట్టణంలోని పెట్రోల్‌ బంకులో పని చేస్తున్నారు. గోసి గొంగడి వేసి ఆటపాటలతో ఉమ్మడి 10 జిల్లాలో ప్రదర్శనలు ఇచ్చారు. గద్దర్‌, విమలక్క, గర్జన, మిట్టపల్లి సురేందర్‌, నేర్నాల కిషోర్‌, అనిల్‌కుమార్‌తో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. కేసీఆర్‌ బహిరంగ సభల్లోనూ పాడారు. అయితే, సాంస్కృతిక సారథిలో ఉద్యోగ నియామకపత్రం వచ్చినా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని రాజశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వమైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటున్నాడు.


అలాగే ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ కళాకారులైన బత్తుల చంద్రమౌళి, అలువోజు వెంకటేశం, తాడూరి సురేష్‌, పున్న రమేశ్‌, కల్లెం లక్ష్మణ్‌, గొల్లపల్లి వినోద్‌, బోనగిరి శ్రీకాంత్‌, గజ్లెల వినోద, గోపగోని వసంత ఇలా ఎంతో మంది అప్పటి ప్రభుత్వం గుర్తించకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఉచిత తాగునీటికి రూ.75కోట్లు

సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 12:49 PM