Share News

మూడు రోజుల్లో కేరళకు నైరుతి

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:16 AM

ఎల్‌నినో ప్రభావంతో భూమధ్యరేఖను దాటి హిందూ మహాసముద్రం వైపు వీస్తున్న రుతుపవన గాలులు క్రమేపీ బలపడుతున్నాయి. ..

మూడు రోజుల్లో కేరళకు నైరుతి

  • 9 లోగా రాయలసీమకు రుతుపవనాలు

  • రాష్ట్రంలో పలుచోట్ల ముందస్తు వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో భూమధ్యరేఖను దాటి హిందూ మహాసముద్రం వైపు వీస్తున్న రుతుపవన గాలులు క్రమేపీ బలపడుతున్నాయి. ఇంకా కేరళకు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, తమిళనాడుకు ఆనుకుని వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో గత రెండు రోజులుగా కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రానున్న రెండు, మూడు రోజుల్లో కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అలాగే, మూడు లేదా నాలుగో తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. రాయలసీమను ఈనెల ఏడు లేదా తొమ్మిదో తేదీన రుతుపవనాలు తాకనున్నాయన్నారు. కాగా, రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన తర్వాత దక్షిణాదిలో మిగిలిన ప్రాంతాలకు విస్తరణ నెమ్మదిగా సాగుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ తెలిపింది. దీంతో ఎండ తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. కాగా.. నెల్లూరు జిల్లా గూడూరులో 43.6, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.3, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 42.2, పల్నాడు జిల్లా మాచర్లలో 41.5, నంద్యాల జిల్లా సంజామల, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, గాలులతో వర్షాలు, చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 42-44, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 40-42, మిగతా జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - Jun 02 , 2026 | 06:16 AM