దసరాకు ‘చేయూత’
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:16 PM
రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా ప్రస్తుతం చేయూత పింఛన్ల కింద 1,90,950 మంది లబ్ధిదారులకు నెలవారీగా రూ.43.72 కోట్లు పంపిణీ చేస్తున్నారు.
కొత్త పింఛన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు
పండుగలోగా అర్హుల ఎంపికకు చర్యలు
క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు
జాబితాను సిద్ధం చేస్తున్న యంత్రాంగం
జిల్లాలో మొత్తం 37,831 దరఖాస్తులు
ప్రభుత్వం చేయూత పింఛన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. దసరా పండుగలోగా అర్హులకు ఆర్థిక భరోసా అందించాలని నిర్ణయించింది. సామాజిక భద్రతా పింఛన్లను కొత్తవారికి అక్టోబరు నుంచి పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, తదితరులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలో మొత్తం 27 మండలాలు, ఆరు మునిసిపాలిటీలు, 526 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్త పింఛన్ల కోసం మొత్తం 37,831 దరఖాస్తులు వచ్చాయి.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా ప్రస్తుతం చేయూత పింఛన్ల కింద 1,90,950 మంది లబ్ధిదారులకు నెలవారీగా రూ.43.72 కోట్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఎంత మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తారన్నది ఉన్నతాధికారులు వెల్లడించనున్నారు. అయితే జిల్లాయంత్రాంగం మాత్రం కొత్త పింఛన్లపై వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. దరఖాస్తుల పరిశీలనను ఈ నెలాఖరు వరకు కొనసాగించనున్నారు. ఈ నెలలోనే పరిశీలన పూర్తి చేసి కొత్త పింఛన్లు అందించాలని భావించినప్పటికీ, సర్టిఫికెట్ల జారీ, క్షేత్రస్థాయి ధ్రువీకరణలో ఏర్పడిన సమస్యలతో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. వచ్చేనెల మొదటి వారంలో లబ్ధిదారులను ఖరారు చేసి, దసరా నుంచి కొత్త పింఛన్లు పంపణీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఆగస్టు 9 నుంచి సెర్ప్ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత సెప్టెంబరు 15వరకు గడువు పొడగించారు.
క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2.5లక్షల వరకు కొత్త పింఛన్లకు అనుమతించింది. అర్హతలు, ఆదాయ పరిమితులు, కుటుంబ పరిస్థితులు, కేటగిరీకి చెందిన ఆధారాలను అధికారులు పరిశీలించిన తర్వాతనే తుది జాబితా సిద్ధం చే యనున్నారు. కొత్త పింఛన్లలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో ఒంటరి మహిళల అర్హతను నిర్ధారించేందుకు అవసరమైన పత్రాలు ప్రధాన సమస్యగా మారాయి. వివాహం జరిగి విడిపోయిన మహిళలకు విడాకుల పత్రం లేనిపక్షంలో కోర్టు ఉత్తర్వులతోపాటు కనీసం ఏడాదిగా ఒంటరిగా ఉన్నట్టుగా ధ్రువీకరణ అవసరం.
వివాహం కాని మహిళలకు కూడా నిర్దేశిత వయసు, స్థానిక నివాస పరిస్థితులకు అనుగుణంగా ధ్రువీకరిస్తున్నారు. ఒంటరి మహిళల కు గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లతోపాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్, నగర పాలక సం స్థల కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల ద్వారా ధ్రువీకరణకు అవకాశం కల్పించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక గీత, చేనేత, డయాలసిస్, పైలేరియా, తదితర పింఛన్ల మంజూరుకు సంబంధిత శాఖల నుంచి జారీచేసిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పింఛన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో వచ్చిన దరఖాస్తులు
వితంతువులు 24,315
ఒంటరి మహిళలు 3,134
దివ్యాంగులు 7,818
చేనేత కార్మికులు 418
గీత కార్మికులు 2,146
మొత్తం 37,831
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం..
ప్రభుత్వం చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అవకాశం కల్పించింది. జిల్లాలో ఈ పథకం కింద మొత్తం 37,831 దరఖాస్తులు అందాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల వారీగా సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తుది జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం.
శ్రీలత, డీఆర్డీవో
ఈ వార్తలు కూడా చదవండి:
గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్ షాప్‌ల బంద్
Read Latest AP News And Telangana News And International News And Telugu News