సింగూరులో డేంజర్ బెల్స్
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:15 AM
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టును ప్రతిపాదించారు.
అడుగంటిన జలాశయం
ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు
పూర్తి సామర్థ్యం 29.989 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ 4.010 టీఎంసీలు
మరో నాలుగు నెలలకు తాగునీరు
వేసవి గడవడం కష్టమే!
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
కొనగొట్టు వానలపైనే ఆశలు
లక్ష ఎకరాల మాగాణికి తాగునీటిని... లక్షలాది ఇళ్లకు తాగునీటిని అందజేసే సింగూరు ప్రాజెక్టు నీళ్లు లేక వెలవెలబోతున్నది. ప్రాజెక్టు చరిత్రలోనే అట్టడుగుకు చేరుకున్నది. మరమ్మతుల కోసం ఉన్న నీటిని ఖాళీ చేస్తే.. వరుణుడు ముఖం చాటేయడంతో జలాశయం పూర్తిగా అడుగంటింది. ఇప్పటికే రెండు సీజన్లకు సాగు నీరు లేక ఆయకట్టు బీడువారింది. ఇప్పుడు తాగు నీటికీ కటకట ఏర్పడే ప్రమాదం నెలకొంది.
జోగిపేట(సంగారెడ్డి): ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టును ప్రతిపాదించారు. నిర్మాణ పనులను 1979లో ప్రారంభించి 1989 నాటికి పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రతి రోజూ జంట నగరాల దాహార్తి తీర్చడంతో పాటు అందోలు నియోజకవర్గంలో పంటల సాగు కోసం ప్రత్యేకంగా 2 టీఎంసీల నీటిని కేటాయించారు. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా అందోలు నియోజకవర్గంతోపాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం 1,666 గ్రామపంచాయతీలు, 21 మున్సిపాలిటీలతో పాటు హైదరాబాద్ మహానగర ప్రజలకు తాగు నీటి అవసరాల కోసం ప్రతి రోజూ 292 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి తరలిస్తారు.
మరమ్మతుల కోసం నీరు ఖాళీ
దశాబ్దాల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రాజెక్టు కట్ట, గేట్ల వద్ద పగుళ్లు వచ్చాయని డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వారి సూచన మేరకు ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతులకు పూనుకుంది. ఇందుకోసం జలాశయంలో నీటి నిల్వను కనీస స్థాయికి తగ్గించారు. 4.010 టీఎంసీలు నిల్వ ఉంచి మిగిలిన నీటిని విడతలవారీగా మంజీరా నదిలోకి వదిలేశారు. నిల్వ ఉంచిన 4 టీఎంసీల్లో ప్రతిరోజూ 292 క్యూసెక్కులు తాగునీటి కోసం తోడేయటంతో ప్రాజెక్టు వేగంగా ఎండిపోతున్నది.
ఎల్‌నినోతో షాక్
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తెలెత్తడంతో ప్రాజెక్టుకు వరద రాలేదు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి చుక్క నీరు కూడా చేరలేదు. దీంతో ప్రాజెక్టులో నేడు మిగిలింది కేవలం 4.010 టీఎంసీలు మాత్రమే. ప్రస్తుతమున్న నీటి నిల్వల ప్రకారం ప్రతి రోజూ తాగునీటి అవసరాల కోసం 292 క్యూసెక్కులు పంపింగ్ చేస్తుండటంతోపాటు నీటి ఆవిరి కలుపుకుని ప్రతి రోజూ 350 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు తరలిస్తున్నరు.
ప్రస్తుతం ఉన్న నాలుగు టీఎంసీల నీటి న్విలు మరో నాలుగు నెలలపాటు సరిపోతాయని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులోకి కొత్త నీరు వచ్చే అవకాశాలు లేవు. దీంతో ప్రాజెక్టు సంక్షోభ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు.
ఈ క్రమంలో అందోలు-జోగిపేట మునన్సిపాలిటీలలో చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు కలిసి గతంలో ఉపయోగించిన ప్రత్యామ్నాయాలను పునరుద్ధరించేందుకు సమీక్ష జరిపారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడే అవకాశం లేకపోవడంతో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. నియోజకవర్గ పరిధిలోని 2 టీఎంసీల సాగునీటితో పాటు మిషన్ భగీరథ ద్వారా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు తాగునీటిని అందించే ఈ బహుళార్థసాధక ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
నాలుగు నెలలు నెట్టుకురావచ్చు
కట్ట, డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచన మేరకు సింగూరు ప్రాజెక్టులోని నీటి నిల్వను 4.700 టీఎంసీలకు తగ్గించాము. ప్రస్తుతమున్న 4.010 టీఎంసీల నీటి నిల్వలు మరో నాలుగు నెలలు సరిపోతాయి. ఈ లోపు ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చినా, ఈప్రాంతంలో అతి భారీ వర్షాలు పడ్డా.. డ్యామ్‌లో కొత్త నీరు చేరుతుంది. లేకపోతే మాత్రం సాగు నీరు అటుంచి తాగునీటికి ఇబ్బందే..
భీం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సింగూరు ప్రాజెక్ట్
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News