Share News

బియ్యం.. పిరం.. వారంలోనే పెరిగిన ధరలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 01:13 PM

ఆహార ధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.

బియ్యం.. పిరం.. వారంలోనే పెరిగిన ధరలు
Rice price hike

  • ఎల్‌నినోతో తగ్గిన వరి సాగు

  • జొన్నలు, పప్పుల రేట్లకు రెక్కలు

  • సామాన్యులకు చుక్కలు

ఆహార ధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వానలు కురవకపోవడం, వరి సాగు గణనీయంగా తగ్గడం వంటి కారణాలతో మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల్లో ధరలు ఊహించని రీతిలో పెరుగుతుండటంతో మధ్యతరగతి, పేదలు ఎలా బతకాలో అర్థం కాక సతమతమవుతున్నారు.

నారాయణఖేడ్‌(మెదక్): సాధారణ ప్రజలు ఎక్కువగా వినియోగించే హంస రకం బియ్యం ధర క్వింటాల్‌కు రూ.3,000 నుంచి రూ.4,000లకు చేరింది. జైశ్రీరాం సన్నరకం బియ్యం రూ.7 వేల నుంచి రూ.8 వేలకు, హెచ్‌ఎంటీ బియ్యం రూ.6,500 నుంచి రూ.7,000లకు, సోనామసురి బియ్యం రూ.5200 నుంచి రూ.5,800లకు పెరిగాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి సరఫరా అయ్యే ఈ సన్నరకం బియ్యం దిగుబడి గత ఏడాదితో పోలిస్తే 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉండటంతో, వ్యాపారులు ముందుగానే ధరలను పెంచినట్లు తెలుస్తోంది. రేషన్‌ దుకాణాల ద్వారా పొందిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి, సన్నబియ్యం వైపు ప్రజలు మొగ్గు చూపడం కూడా డిమాండ్‌ పెరగడానికి ఒక కారణమని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.


rice1.2.jpgజొన్నలు, పప్పుల ధరలు పైపైకి

బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాల ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. నాణ్యమైన తెల్ల జొన్నలు క్వింటాల్‌కు రూ.7500కు చేరగా, డయాబెటిక్‌ బాధితులు ఎక్కువగా వాడే పచ్చ జొన్నలు రూ.6 వేల నుంచి రూ.8వేలకు ఎగబాకాయి. అపరాలు అన్ని దాదాపు కిలోకు రూ.10 వరకు పెరిగాయి. కందిపప్పు కిలో రూ.120, పెసరపప్పు రూ.110, మినపప్పు రూ.115, ఎర్రపప్పు రూ.90గా ఉంది. గోధుమల ధర సైతం క్వింటాల్‌కు రూ.300 వరకు పెరిగింది. పంటలు సరిగా పండకపోవడం వల్ల నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.


rice.jpgనీటి కరువు.. సాగు కష్టాలు

నారాయణఖేడ్‌ డివిజన్‌లో సాధారణంగా 2.08 లక్షల ఎకరాల్లో సాగు జరగాలి. అయితే, ఈ ఏడాది వర్షాలు సక్రమంగా లేక చెరువులు, కుంటలు నిండలేదు. దీంతో వర్షాధార పంటలు కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే సాగయ్యాయి. సాగు విస్తీర్ణం పడిపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. హోల్‌సేల్‌ సరఫరాదారులు ధరలు పెంచి, సరుకును సక్రమంగా పంపడంలేదని, దీనివల్ల వ్యాపారం చేయడం కష్టంగా మారిందని చిల్లర వర్తకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చర్లపల్లి-షాలిమార్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

కోడిగుడ్డు అ‘ధర’హో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 03 , 2026 | 01:13 PM