తొందరపాటు నిర్ణయాలు తీసుకోను.. రిటైర్‌మెంట్‌పై రొనాల్డో క్లారిటీ
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:41 PM
తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న వార్తలపై రొనాల్డో స్పందించాడు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పడినట్లు అయింది.
ఇంటర్నెట్ డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్‌పై కొంతకాలంగా ఊహాగానాలు వస్తోన్న సంగతి తెలిసిందే. క్రొయేషియాతో మ్యాచ్ అనంతరం.. రొనాల్డో సోదరి కాటియా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ ప్రపంచ కప్ టోర్నీనే అతడికి చివరిదంటూ ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న వార్తలపై రొనాల్డో స్పందించాడు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పడినట్లు అయింది.
రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాపై పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించి.. ప్రీక్వార్టర్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రొనాల్డో మాట్లాడాడు. ‘నేను ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. ప్రస్తుతం నా దృష్టి ప్రపంచ కప్ గెలవడంపైనే ఉంది. నా భవిష్యత్తు గురించి టోర్నీ ముగిసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటా’ అని స్పష్టం చేశాడు.
ఇదే మ్యాచ్‌లో రొనాల్డో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన అత్యంత వయసున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 41 సంవత్సరాల 147 రోజుల వయసులో ఈ ఘనత సాధించి గత రికార్డును అధిగమించాడు. అంతేకాదు, తన కెరీర్‌లో ప్రపంచకప్ నాకౌట్ దశలో నమోదు చేసిన తొలి గోల్ కూడా ఇదే కావడం విశేషం. క్రొయేషియాపై అద్భుత ఆటతీరుకు రొనాల్డోకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మరోవైపు, క్రొయేషియా చేసిన రెండు గోల్స్ ఆఫ్‌సైడ్ కారణంగా రద్దు కావడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. ఈ విజయంతో పోర్చుగల్ ప్రీక్వార్టర్‌లో స్పెయిన్‌తో ఆసక్తికర సమరానికి సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా వరల్డ్ కప్: స్పెయిన్ గోల్ కీపర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు
ఫిఫా ప్రపంచ కప్: రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రొనాల్డో?