Share News

ఐర్లాండ్ సిరీస్‌లోనే వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది: ఏబీ డివిలియర్స్

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:16 PM

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై తీవ్ర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్.. వైభవ్ అరంగేట్రంపై మాట్లాడాడు.

ఐర్లాండ్ సిరీస్‌లోనే వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది: ఏబీ డివిలియర్స్
AB de Villiers

ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై తీవ్ర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ సిరీస్‌లో 2-0 తేడాతో భారత్ చిత్తుగా ఓడింది. సీనియర్ ప్లేయర్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చి ఉండే బాగుండేదని పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరికొందరు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని సమర్థించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్.. వైభవ్ అరంగేట్రంపై మాట్లాడాడు.


‘వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి ఐర్లాండ్ సిరీస్ సరైన వేదిక. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం కావట్లేదు. ఐర్లాండ్‌పై వైభవ్‌కు అవకాశం రాకపోవడం కాస్త నిరాశ కలిగించింది. ఐపీఎల్‌లో అతడు చూపించిన విధ్వంసకర బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐర్లాండ్ వంటి జట్టుపై వైభవ్‌ను ఆడించి ఉంటే అతడికి కాస్త అనుభవం వచ్చేది’ అని ఏబీడీ వెల్లడించాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై కూడా అతడు స్పందించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో కోల్పోయిన భారత్.. ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇంకా విజయాన్ని అందుకోలేదని గుర్తు చేశాడు. ‘టీమిండియా తన ఆటతీరును పున:సమీక్షించుకోవాలి. ఇంగ్లండ్ వంటి పిచ్‌ల్లో ఐపీఎల్‌లో చేసినట్టు 250-260 పరుగులు చేస్తానంటే కుదరదు. అక్కడ 140-160 పరుగులకే మ్యాచ్‌ను గెలిపించే స్కోర్లు. అందుకు తగ్గ వ్యూహాత్మక ఆట అవసరం’ అని ఏబీడీ సూచించాడు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా వరల్డ్ కప్: స్పెయిన్ గోల్‌ కీపర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు

ఫిఫా ప్రపంచ కప్: రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రొనాల్డో?

Updated Date - Jul 03 , 2026 | 01:13 PM