కొత్త జైలుకు ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:10 AM
సిద్దిపేట జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన జిల్లా జైలు ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జైలును ప్రారంభించనున్నారు.
22న ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రూ.90 కోట్లతో 32 ఎకరాల్లో నిర్మాణం
415 మంది ఖైదీల సామర్థ్యం..
చంచల్‌గూడ తరహాలో హైసెక్యూరిటీ
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన జిల్లా జైలు ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జైలును ప్రారంభించనున్నారు. పట్టణ శివారులోని ఎన్సాన్‌పల్లి గ్రామ పరిధిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కారాగారం అన్ని హంగులతో సిద్ధమైంది. జిల్లా ఏర్పడిన తర్వాత నేరాలు, నేరస్థుల సంఖ్య పెరుగుతుండటంతో పాత సబ్‌జైలు సరిపోక ఖైదీలను సంగారెడ్డి, కరీంనగర్, చంచల్‌గూడ(Sangareddy, Karimnagar, Chanchalguda) జైళ్లకు తరలించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను అధిగమించేలా 415 మంది ఖైదీల సామర్థ్యంతో ఈ నూతన జైలును నిర్మించారు. ఇందులో 363 మంది పురుషులు, 52 మంది మహిళా ఖైదీల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. మొత్తం 8 బ్యారక్‌లు ఉండగా, మహిళల కోసం ప్రత్యేక బ్యారక్‌ను నిర్మించారు.
హైసెక్యూరిటీ ప్రత్యేకత
రాష్ట్రంలో ఒక్క చంచల్‌గూడ జైలులో మాత్రమే ఉన్న హై సెక్యూరిటీ బ్యారక్‌ను ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఖైదీలు తప్పించుకోకుండా 6.2 మీటర్ల ఎత్తైన ప్రహరీ గోడను నిర్మించి, దానిపై విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు. భద్రత కోసం 24 గంటల నిఘా ఉండేలా నాలుగు వాచ్ టవర్లను నిర్మించారు. ఖైదీల ఆరోగ్యం కోసం 32 బెడ్లతో కూడిన ఆసుపత్రి, చదువుకోవడానికి లైబ్రరీ, స్కూల్, రెండు అత్యాధునిక వంటశాలలను సిద్ధం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో 2018లో ఈ జైలు మంజూరు కాగా, అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు. 2023 జూన్ 20న అప్పటి హోంమంత్రి మహ్మద్ అలీతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా పూర్తి చేశారు. గతేడాది సెప్టెంబర్ నాటికే నిర్మాణం పూర్తయినప్పటికీ, ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 22న ప్రారంభం కానుండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News