మంచితనం విజయం సాధించాలి.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 09:19 AM
తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, మార్చి19: తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ కేవలం కాలచక్రం మారడమే కాదు, వ్యవసాయ పనులను నూతనంగా పునః ప్రారంభం చేసుకునే ‘రైతు నామ సంవత్సరం’గా సంతరించుకున్నదని అన్నారు. మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ప్రకృతి మాత శిశిరాన్ని వీడి, కొత్త చిగురులతో వసంతాన్ని ఆహ్వానిస్తూ, నూతన ఆశలకు, సంకల్పాలకు నాంది పలుకుతుందని, ఉగాది నుండి కాలచక్రం పునరావృతమౌతుందని కేసీఆర్ తెలిపారు. ద్వేష భావనలు, అహంకారం, చెడు లక్షణాలు పరాభవం చెంది వాటి స్థానంలో ఉన్నతమైన ఆశయాలు వృద్ధి చెంది, మనిషి సమున్నతమైన మార్గాన్ని అనుసరించాలనే తాత్వికతను ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు సమస్యలు పరాభవం చెంది అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండి రాష్ట్రం పునర్వైభవం సాధించి విజయం వైపు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News