బీఆర్‌ఎస్ బరితెగింపు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:54 AM
బీఆర్‌ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా.. అహంకారం మాత్రం తగ్గలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టినా నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని.....
అధికారం పోయినా.. అహంకారం తగ్గలేదు
కొత్త గవర్నర్‌కు ప్రతిపక్ష నేత శుభాకాంక్షలు చెబుతారనుకున్నా
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకూ వస్తారని అనుకున్నాం..
ఆయన సభకే రాలేదు.. రూ.1.06 కోట్ల వేతనం తీసుకున్నారు
కుర్చీలో కూర్చోవాలనే యావ ఉంటే ఏదో ఒక పేపర్ తీసుకుని నా దగ్గరకు వచ్చి పక్కన కూర్చోండి.. నేను చాలా లిబరల్
సభ జరగనప్పుడొచ్చి సీఎం కుర్చీలో కూర్చుని ఆనందించండి
వార్డ్ సభ్యుడైనా కాలేని హరీశ్.. వైఎస్ అండతో మంత్రయ్యారు
బాబు కాళ్లు పట్టుకుంటేనే కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యారు
ప్రజల ఆశీర్వాదంతో వచ్చాను.. వారు నా కాలిగోటికి చాలరు
మా విజన్ బీఆర్‌ఎస్‌కు పాయిజన్.. మాపై విషం కక్కుతున్నారు
హార్డ్‌వర్కర్‌ను.. కష్టపడతా.. నేర్చుకుంటా.. పదిమందికి చెబుతా
కేసీఆర్ ఇచ్చింది చిప్ప.. రూ.8.11 లక్షల కోట్ల అప్పులు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
20న రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. అదే రోజు సభలో బడ్జెట్
నేను హార్డ్‌వర్కర్‌ని. కష్టపడతా.. నేర్చుకుంటా.. నేర్చుకున్న దానిని పది మందికి చెబుతా. గతంలో ఒకరిలా విజనరీ అనో, ఉద్యమకారుడిననో చెప్పుకోను. 2029లో కూడా ఈ ప్రభుత్వమే వస్తుంది. ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే కొనసాగుతుంది. మాతోనే తెలంగాణ సుభిక్షమని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని, పరిశ్రమలు వస్తాయని, వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ప్రజలు నమ్ముతున్నారు.
- సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా.. అహంకారం మాత్రం తగ్గలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టినా నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైజింగ్‌ను వెకిలి చేస్తున్నవారికి.. రావణాసురుడికి పట్టిన గతే పడుతుందన్నారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని తెలిపారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళిక అని పేర్కొన్నారు. గొప్ప సంకల్పాన్ని ప్రజల ముందుంచిన గవర్నర్‌కు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత అనుభవాలను, రాష్ట్ర పరిస్థితులను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పాలసీ డాక్యుమెంట్‌ను ప్రజల ముందు పెట్టామని రేవంత్ తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో 2034 వరకూ ఇదే మంత్రి వర్గం అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని రేవంత్ భరోసా ఇచ్చారు.
గొప్ప భవిష్యత్తు కోసం పాలసీ డాక్యుమెంట్..
ప్రపంచవ్యాప్తంగా ఏఐ సునామీ వస్తోందని.. కృత్రిమ మేధ వల్ల కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని, తీవ్రమైన నిరుద్యోగ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని సీఎం గుర్తుచేశారు. ‘‘ఈ పరిస్థితిలో తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందా? లేదా? మనం బలమైన శక్తిగా ఎదగాలనే ఆలోచననే.. గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ పాలసీని ప్రవేశ పెట్టాం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రానికి గొప్ప భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతోనే 2047 తెలంగాణ గ్లోబల్ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ తెచ్చామన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా 2023 డిసెంబరు 1 నుంచి కేసీఆర్ తీసుకున్న వేతనం ఒక కోటి ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలని రేవంత్ సభ సాక్షిగా తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత వస్తారనుకున్నామని, కొత్త గవర్నర్‌కు శుభాకాంక్షలు చెబుతారని భావించామని, అయినా ఆయన సభకు రాలేదని విమర్శించారు. విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు పొందేవారిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి తెలంగాణ అభివృద్ధికి సలహాలు, సూచనలు చేయాలని కోరారు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు పోలేదని వ్యంగ్యంగా అన్నారు.
కావాలంటే అప్పుడు కూర్చోండి..
ప్రతిపక్ష సభ్యులకు సీఎం కుర్చీలో కూర్చోవాలనే యావ బాగా ఉందన్న రేవంత్.. కావాలంటే, సభ లేని సమయంలో వచ్చి కూర్చోవచ్చంటూ ఎద్దేవా చేశారు. లేదా, సభ జరిగే సమయంలోనైనా ఏదో ఒక పేపర్ తీసుకుని వచ్చి తన పక్కన కాసేపు కూర్చుని పోవచ్చునని, తాను చాలా లిబరల్‌గా ఉంటానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్నిచూసి బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఓఆర్‌ఆర్ లీజును రద్దు చేస్తామని, అవసరమైతే అవినీతికి పాల్పడిన వారిని లోపల కూడా వేస్తామని ప్రకటించారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవని హరీశ్‌రావు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతోనే మంత్రి అయ్యారని, చంద్రబాబు కాళ్లు పట్టుకుంటే.. కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. హరీశ్, కేటీఆర్ ద్రోహులని, తాను ప్రజల ఆశీర్వాదంతో, స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగానని.. తట్ట, మట్టి పని చేసి ప్రజల నుంచి వచ్చిన నాయకుడినని గుర్తు చేశారు. వారు తన కాలి గోటికి కూడా సరిపోరన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని దెబ్బలు పడతాయన్నారు. ‘‘బరాబర్ అన్నందుకే.. నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చా.. అల్లాటప్పాగా రాలేదు. బరాబర్ 2029లో కూడా తొక్కకపోతే చూడండి.. బీఆర్‌ఎస్ నాయకులు అంతా కట్టకట్టుకుని రాండి.. తొక్కకపోతే చూడండి.. ఇదే నా సవాలు.. రాసి పెట్టుకోండి.. ఎలా గెలుస్తారో నేను చూస్తా’’ అని ఘాటుగా హెచ్చరించారు.
ఓపికఉంటేనే అవకాశాలు..
వయసుతోపాటు ఓపిక ఉండాలని.. ఓపికఉంటేనే అవకాశాలు వస్తాయని రేవంత్ అన్నారు. కుర్చీ వారసత్వంగా రాదని, ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. ఎవరు అడ్డుపడినా.. ముందుకు వెళ్లాలనే ప్రభుత్వం నిర్ణయించుకుందని సీఎం తేల్చిచెప్పారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం.. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లా కాకూడదనే ఉద్దేశంతోనే క్యూర్ ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాజధాని నగరంలో ఆక్రమణకు గురైన చెరువులన్నింటినీ కాపాడుతున్నామని, ఇందుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చెరువుల ఆక్రమణకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌వోసీలు జారీ చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమణల్ని తొలగిస్తుంటే కూడా ప్రభుత్వంపై ఆగ్రహిస్తే తాము ఏం చేయాలని ప్రశ్నించారు. మూసీలో బఫర్ జోన్, రివర్ బెడ్‌లో 10 వేల ఆక్రమణలు ఉన్నాయని నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాలను ప్రస్తావించారు. మూసీ ప్రక్షాళన ద్వారా ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుందామని చెబితే విపక్ష నేతలు వినట్లేదన్నారు. గతంలో ఉప్పల్ భగాయత్‌లో వారు చేసిన అభివృద్ధిపై నిజనిర్ధారణ కమిటీని వేయమంటే ఇప్పుడే వేస్తానన్నారు.
విజన్ వారికి విషపూరితం..
ప్రజల భవిష్యత్తు కోసం తాము ప్రకటించిన విజన్.. కొద్ది మందికి పాయిజన్‌గా మారి బాధపెడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. అధికార పార్టీని విమర్శించడం సహజమే అయినా.. బీఆర్‌ఎస్ నేతలు పరిధి దాటి విషం కక్కుతున్నారన్నారు. ఆ విషాన్ని శివుడి లెక్క కంఠంలో దాచుకునే శక్తి తనకు ఉందన్నారు. కుళ్లుతో కుంగి, నశించే వారిని ఎవరు కాపాడలేరని.. వారి రోగాలకు ఆరోగ్యశ్రీలో కూడా చికిత్స లేదని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యేకి మాటలు, మూటలు, మాయమాటలు.. ఈ మూడు విషయాలనే తారక మంత్రంగా ఆయన తండ్రి నేర్పారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో బీఆర్‌ఎస్ నేతలు పీహెచ్‌డీ చేశారన్నారు. వారి సలహాలు మాంసం తిని, మద్యం మత్తులో మంత్రాలు చదివినట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల కోసం.. ప్రణాళికలు తయారు చేసి.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చి.. తొలి విడతలో 1 ట్రిలియన్, రెండో విడతలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు.
లైవ్ పోతే 10.. లైక్ కొడితే 20...
బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా నెలకు రూ.5 కోట్లు ఖర్చుచేసి అబద్ధాలు ప్రచారం చేస్తోందని రేవంత్ ఆరోపించారు. అబద్ధాల లైవ్ పోతే రూ.10, దానికి లైక్ కొడితే 50, కామెంట్ చేస్తే రూ.100 పంచుతోందన్నారు. నగదుకు నజారానా పెట్టి.. నూతన భట్రాజుల్లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. ‘మీ నాన్న మీకు గొప్ప ఫాంహౌస్, పత్రిక, టీవీ అన్నీ ఇచ్చాడు. కానీ, తెలంగాణ ప్రజలకు ఏమిచారు? చిప్ప, రూ.8 లక్షల కోట్ల అప్పు తప్ప!’ అని కేటీఆర్‌నుద్దేశించి రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ దయతో వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారని, ఆయన మాటలకు కూడా వీళ్లు వ్యతిరేకమా? అని ప్రశ్నించారు.
పంటల మార్పిడిపై ప్రణాళిక..
విజన్ 2047లో భాగంగా రేర్ (గ్రామీణ వ్యవసాయ ప్రాంతం)లో ఉన్న లక్ష చదరపు కిలోమీటర్లను వ్యవసాయపరంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. పంట మార్పిడి ఎలా? పంటల మార్పిడి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇప్పుడు కేటీఆర్ వెనక కూర్చున్న ఎమ్మెల్యే (కౌశిక్‌రెడ్డి) తన దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నారని, ఇప్పుడిలా చంపండి.. నరకండి.. కుప్పలేయండి అనే భాష నేర్చుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ వాళ్లు డ్రగ్స్, పబ్స్‌కి యువతను అంకితం చేశారని, తాము క్రీడా విధానాలు తెచ్చామని తెలిపారు. ‘‘ఫుట్‌బాల్‌లో దిగ్గజమైన మెస్సీతీసుకొస్తే విమర్శలా? వాళ్ల డ్రగ్స్ లోకల్‌ప్లేయర్స్ నిన్న ఇక్కడ ఫాంహౌస్‌లో దొరికారు కదా?’’ ప్రశ్నించారు. హిల్ట్ విధానం, టీడీఆర్‌లపై ఏవేవో విమర్శలు చేస్తున్నారని, వాటిపై కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ అడిగినా వేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్(ఏటీసీ)లో చేరిన ప్రతి విద్యార్థికి నెలకు రూ.2వేలు ఉపకార వేతనం ఇస్తామని, 100 ఏటీసీలు ఏర్పాటు చేసేందుకు ప్రసిద్ధ టాటా గ్రూప్ ముందుకొచ్చిందని అన్నారు.
బలిదానాలు 4 కోట్ల మంది కోసం..
‘‘తెలంగాణ ఉద్యమం సందర్బంగా భావోద్వేగాలతో 1200 మంది ఆత్మార్పణలు చేశారు. ఇవి ఆ నలుగురి కోసమే, తమ కుటుంబం కోసమే అన్నట్లుగా బీఆర్‌ఎస్ పనిచేసింది. నాలుగుకోట్ల నా తెలంగాణ కుటుంబసభ్యుల కోసం మేం ప్రణాళికలు వేసి సభలో పెట్టాం. వారు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే మేం ఇప్పటివరకు 67,763 మందికి నియామక పత్రాలిచ్చాం. ఇంకో 13,197ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇవి కూడా పూర్తయితే 80వేలమందికి ఉద్యోగాలు ఇచ్చినట్లవుతుంది’’ అని రేవంత్ అన్నారు. సిగ్గులేకుండా అప్పుల గురించి మాట్లాడుతున్నారని, 2014 వారికి అధికారం అప్పగించినప్పుడు రూ.67 వేల కోట్ల అప్పులు ఉంటే బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో చేసిన మొత్తం అప్పులు రూ.8.11 లక్షల కోట్లు అని అన్నారు. ఏకంగా 11.5శాతం వడ్డీకి రుణాలు తెచ్చారని, కమీషన్లకు కక్కుర్తిపడ్డారని ఆరోపించారు. నేను ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ల దగ్గరకు తిరిగి తిరిగి 27వేల కోట్ల పైచిలుకు రుణాల రీకన్‌స్ట్రక్షన్ చేశామని, దీంతో ఏటా రూ.4వేల కోట్లు మిగులుతోందని చెప్పారు. మొత్తంగా 2లక్షల కోట్ల అప్పు రీ కన్‌స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
సొంతింటి ఆడబిడ్డ కన్నీటితో వీధిలోకి...
తాము మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించామని, బీఆర్‌ఎ్‌సలో మాత్రం సొంతింటి ఆడబిడ్డ కన్నీరు పెట్టి వీధిలోకి వచ్చిందని రేవంత్ అన్నారు. ‘‘నీ సొంతింటి ఆడబిడ్డను లిక్కర్ రాణి అని నీ పక్కన కూర్చున్నోళ్లే అన్నారు. సోదరుడిగా చీమ కుట్టినట్లు ఉండదా? ఈ ఒక్క ఉదాహరణ చాలు మీ శైలి ఏంటో చెప్పడానికి’’ అని ఎద్దేవా చేశారు. సీఎం సహాయనిధిని బీఆర్‌ఎస్ వాళ్ల చుట్టాలు, కావాల్సిన వాళ్లకు ఇచ్చి చెక్కులు కూడా వాళ్ల ఖాతాల్లోనే వేసుకుని దొంగిలించిన దొంగలని ఆరోపించారు. ‘‘మీకు వచ్చే ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట ఎక్కడా వివక్ష చూపకుండా ఇళ్లు మంజూరు చేశాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 5100 కోట్లు ఎవరు పనిచేసుకుంటే వారి ఇళ్ల నిర్మాణం కోసం టకా టకా పడేటట్లు చేశాం. రూ.18 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చాం. రేపు 22న మళ్లీ మొదలుపెడుతున్నాం. సన్నవడ్లకు బోన్‌సగా రూ.1940 కోట్లు ఇచ్చాం. ఇవి మా గ్యారంటీలు. అమలుచేశాం’’ అని సీఎం వివరించారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని సీఎం ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని సీఎం అభిలషించారు. గత సంవత్సరం ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించామని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఈ ఏడాది రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా అందరు ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం అన్నారు.