వెయ్యి రోజులుగా రాష్ట్రంలో రాబందు, రాక్షస పాలన సాగుతోంది: హరీశ్ రావు
ABN , Publish Date - Sep 05 , 2026 | 02:04 PM
తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి రోజులుగా రాబందు, రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 05: తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి రోజులుగా రాబందు, రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. శనివారం దుబ్బాక నియోజకవర్గంలోని హబ్సీపూర్ క్రాసింగ్ వద్ద ‘రైతు పొలికేక’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు భారీగా రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం నాడు ఈ తరహాలో ఉద్యమించామన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమా అని నేడు మళ్లీ రోడ్లపైకి వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ కాస్తా ఐదారు గంటలకు పడిపోయిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం ఎదురు చూసే రోజులు ఉన్నాయా? అని ఈ సందర్భంగా రైతులను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన పాత రోజులు మళ్లీ వచ్చాయని చెప్పారు. ఉచిత కరెంట్ కాస్తా ఉత్త కరెంట్ అయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నాడు కరోనా సమయంలోనూ రైతుబంధు ఆగలేదని హరీశ్ రావు గుర్తు చేశారు. రైతుల మీద కేసీఆర్‌కు ప్రేమ ఉండేదని.. మరి సీఎం రేవంత్ రెడ్డికి ఏమైందని హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉన్న రైతుబంధుకు ఎసరు పెట్టారంటూ సీఎం రేవంత్‌పై ఆయన నిప్పులు చెరిగారు. ఈ మూడేళ్లలో రేవంత్ రెడ్డి రూ.29 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు బీమాను బంద్ చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. యాప్‌లో బుక్ చేస్తే 15 రోజుల దాకా డీఏపీ ఇవ్వడం లేదన్నారు. షాపులో లేని యూరియా యాప్‌లోకి ఎలా వస్తుందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. యూరియా ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్, బీజేపీ వాళ్లు రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం ఏ పంట ఎంత కొనుగోలు చేయమంటే.. అంతే కొనుగోలు చేస్తామని సీఎం అంటున్నారన్నారు.
ఈ మూడేళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఒక్క ఎకరా భూ సేకరణ చేయలేదని, జానెడు కాలువ కూడా తవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం రేవంత్ నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ వద్ద చిన్న మరమ్మతు చేయమంటే.. కూలింది కూలింది అంటూ ఆ ప్రాజెక్టును నిరూపయోగం చేశారని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరవు అని అభివర్ణించారు.
మేడిగడ్డ వద్ద 44 వేల క్యూసెక్కుల నీళ్లు పారుతున్నాయని మాజీ మంత్రి వివరించారు. మోటార్ ఆన్ చేస్తే మల్లన్న సాగర్‌కు నీళ్లు వస్తాయని చెప్పారు. వెయ్యి రోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు, వెయ్యి ఓట్లు, భూ కబ్జాలు తప్ప మరేమీ లేవన్నారు. యాప్‌లు పోవాలంటే సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించాలని రైతులకు ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు ఎప్పటిలాగా రావాలంటే అధికారంలోకి కేసీఆర్ రావాలని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్
నల్లజర్ల పీఎస్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
For More TG News And Telugu News