ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ పగబట్టారు: హరీశ్ రావు
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:14 PM
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి, మంతూరు గ్రామ శివారులో ఆగిపోయిన కాళేశ్వరం కాలువ పనులను మాజీ మంత్రి పరిశీలించారు. అక్కడే సెల్ఫీ దిగి సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు.
మెదక్, సెప్టెంబర్ 3: జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి, మంతూరు గ్రామ శివారులో ఆగిపోయిన కాళేశ్వరం కాలువ పనులను మాజీ మంత్రి పరిశీలించారు. అక్కడే సెల్ఫీ దిగి సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ పగబట్టారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పనులు చేయడం చేతకాదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోగానే మూడేళ్ల నుంచి కాళేశ్వరం కాలువ పనులు నిలిచిపోయాయని అన్నారు.
మల్లన్నసాగర్ నుంచి 17 కిలో మీటర్ల టన్నెల్ పనులు BRS హయాంలోనే 85 శాతం పూర్తి అయ్యాయని హరీశ్ చెప్పారు. కాళేశ్వరం 18, 19 ప్యాకేజీలతో సింగూరు ప్రాజెక్టు నింపుకోవడానికి ఆనాడు కేసీఆర్ ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఈ నీటిని నిజాం సాగర్‌కు కూడా తీసుకెళ్లేలా ప్లాన్ చేశారని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం కాలువను గజం కూడా తవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్‌లను కట్టలేదని విమర్శించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి అన్నారు. 5 లక్షల ఎకరాలకు నీరు అందించే సంగమేశ్వర బసవేశ్వర పనులను నిలిపివేశారని అన్నారు. హల్దీ ప్రాజెక్టు, ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను ఆపేశారని తెలిపారు. దుబ్బాకలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను 80 శాతం BRS హయాంలో చేయగా కేవలం 20 శాతం పనులు కూడా ఇంకా పూర్తికాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ డెడ్ స్టోరేజీలకు చేరాయని అన్నారు. 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తే 50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని.. కానీ ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగిపోయిన కాళేశ్వరం పనుల దగ్గర నుంచి సెల్ఫీ తీసి సీఎం రేవంత్ రెడ్డికి పంపించానని.. వెయ్యి రోజుల పాలనలో ఏమేం పనులు ఆగిపోయాయో అవన్నీ సీఎంకి పంపిస్తామని హరీశ్ తెలిపారు. తక్షణమే కాళేశ్వరం కాలువల పనులకు నిధులు విడుదల చేయాలని.. రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి సంగమేశ్వర బసవేశ్వర, ఘనపురం ఆనకట్ట ఎత్తు పనులు ప్రారంభించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేల్చేస్తారా..
కొండా సురేఖ ఎపిసోడ్.. నేటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో: రాజాసింగ్
Read Latest Telangana News And Telugu News