Share News

సంగారెడ్డిలో పేలుళ్లు.. పలువురికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:08 PM

సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుళ్లతో రెండు వేర్వేరు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది.

సంగారెడ్డిలో పేలుళ్లు.. పలువురికి తీవ్ర గాయాలు
Sangareddy Cylinder Blast

సంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుళ్లతో రెండు వేర్వేరు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కల్వకుంట్లలో తీవ్ర పేలుడు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట్ల ప్రాంతంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోగా, గోడలు పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇంట్లో మరికొన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నప్పటికీ అవి పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఇంట్లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


పుల్కల్‌లో అగ్ని ప్రమాదం..

కాగా, పుల్కల్ మండల కేంద్రంలో మరో ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు పూరి గుడిసెలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రెండు కుటుంబాలు కట్టుబట్టలతో బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపు గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

అప్రమత్తత అవసరం..

ఈ వరుస ఘటనలు గ్యాస్ సిలిండర్ల వినియోగంలో జాగ్రత్తల అవసరాన్ని మళ్లీ గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ రీఫిల్లింగ్, భద్రతా నియమాలపై నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలు గ్యాస్ సిలిండర్ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.


గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో పేలుడు: రాజేశ్వర్

సంగారెడ్డిలో గ్యాస్ పేలుడు ఘటనపై సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి డీఎస్వో రాజేశ్వర్ మీడియాతో మాట్లాడారు. స్థానికంగా ఓ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీగా బాయ్‌గా పనిచేస్తున్న సంగమేశ్వర్ ఇంట్లో సిలిండర్ పేలిందని తెలిపారు. గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించిందని అన్నారు. గ్యాస్ పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న నలుగురుకి 10 శాతం నుంచి 15 శాతం గాయాలయ్యాయని చెప్పారు. గాయపడిన వారు కడియాల సంగమేశ్వర్, మలమ్మ, శ్రీజ, ఆమోస్‌గా గుర్తించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ఇంట్లో 7 కమర్షియల్, 8 డొమెస్టిక్ సిలిండర్లు నిల్వ ఉంచారని అన్నారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఎందుకు నిల్వ ఉంచారనే విషయంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచారని ఇన్‌చార్జి డీఎస్వో రాజేశ్వర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్

హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై పీకో టెక్నాలజీ ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు

పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 09:16 PM