మద్దిమడుగులో సేవాలాల్ ఆలయం
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:50 AM
నాగర్‌కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్న మద్దిమడుగులో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో నిర్మాణం
20 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
26న శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రూ.200 కోట్ల వ్యయం..ఇప్పటికే రూ.38 కోట్ల విడుదల
దేశంలో అతిపెద్ద ఆలయంగా నిర్మించేందుకు ప్రణాళిక
మహబూబ్‌నగర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాగర్‌కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్న మద్దిమడుగులో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్దిమడుగులో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో సేవాలాల్ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ నెల 26న అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా సేవాలాల్ ఆలయం, భారీ విగ్రహ ఏర్పాటుకుశంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆలయం కోసం ప్రభుత్వం ఇప్పటికే మద్దిమడుగులో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు నిర్మాణానికి రూ.200 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది.
ఇందులో రూ.38 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. మిగతా నిధులను దశలవారీగా విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సేవాలాల్‌కు ప్రత్యేకంగా ఆలయం లేకపోగా.. 2023 ఎన్నికల సందర్భంగా సేవాలాల్ ఆలయాన్ని నిర్మిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో అచ్చంపేటలో పర్యటించిన సందర్భంగా మద్దిమడుగులో ఈ ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. తద్వారా నల్లమల ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉండే గిరిజనులతోపాటు నల్లగొండ జిల్లా దేవరకొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఏపీలోని పల్నాడు, రాయలసీమ జిల్లాల నుంచి గిరిజనులు మద్దిమడుగుకు తరలివస్తారని, ఆ ప్రాంతానికి మరింత పర్యాటక శోభ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు కృష్ణానదిపై పదర - మాచర్ల మధ్య ఒక అంతర్రాష్ట్ర వంతెన ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, దేశంలో ప్రస్తుతం గిరిజనుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఒక ఆలయం, మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఒక ఆలయం మాత్రమే ఉన్నాయి. మద్దిమడుగులో ఆలయంతోపాటు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యంత భారీ సేవాలాల్ విగ్రహాన్ని కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న ఆలయానికి శంకుస్థాపనతోపాటు మద్దిమడుగులో 5 వేల మంది గిరిజనులతో ప్రత్యేక సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. అనంతరం అచ్చంపేటలో భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల మంజూరైన కొత్త పింఛన్‌దారుల ఖాతాల్లో నగదు జమను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను, ఆలయ ఏర్పాటు స్థలాన్ని సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News