Share News

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:43 AM

జూరాల ఆయకట్టు కింద పంటలు ఎండిపోకుండా చూడటం కోసం కర్ణాటకతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న నీటి విడుదల ఒప్పందం ఎల్‌నినో పరిస్థితుల కారణంగా అమల్లోకి రావడం లేదు.

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!
Jurala project water release

  • 3 టీఎంసీలు ఇస్తామని చెప్పి.. చుక్కనీరు ఇవ్వని వైనం

  • ఎగువ నుంచి నీరు రాకపోవడంతో జూరాల ఆయకట్టుకు నవంబరు 3 వరకే విడుదల చేస్తామంటున్న అధికారులు

  • వరి పంట చేతికొచ్చే దశలో నీరివ్వబోమని ప్రకటన

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జూరాల ఆయకట్టు కింద పంటలు ఎండిపోకుండా చూడటం కోసం కర్ణాటకతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న నీటి విడుదల ఒప్పందం ఎల్‌నినో పరిస్థితుల కారణంగా అమల్లోకి రావడం లేదు. ఫలితంగా నీరు విడుదల చేయబోమని అధికారులు చెప్పడం, పంట చివరి దశలో ఉండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానదికి వచ్చే వరదకు అనుగుణంగా వరిసాగు చేస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు జరుగుతున్నా.. ఈ ఏడాది వరద మరింత ఆలస్యం కావడంతో పాలమూరు జిల్లాలో సాగు కూడా ఆలస్యమైంది. ఇప్పుడు జూరాల ఆయకట్టు కింద వరి పొట్టదశలోనే ఉంది. పంట చేతికి రావడానికి మరో నెలరోజుల సమయం కచ్చితంగా పడుతుంది.


వానాకాలంలో వరిసాగు చేయొద్దని సాగునీటి అధికారులు ముందే హెచ్చరించారు. అయితే జూరాల నుంచి నీరు దిగువకు వెళుతున్నా.. ఇక్కడి రైతులకు మాత్రం ఇవ్వడంలేదంటూ బీఆర్‌ఎస్‌ విమర్శలు చేయడంతో వరికి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత మధ్యలో ఓసారి నీటి విడుదలను ఆపేసినా, ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసమే నిల్వ ఉంచాలని అధికారులు సూచించినా పెద్ద రభస జరిగింది. ఏకంగా రైతులే గేట్లు తెరిచేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖలు రాయడంతోపాటు ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆయనను కలిసి చర్చించారు. ఉమ్మడి జిల్లా కరువు పరిస్థితుల దృష్ట్యా నారాయణపూర్‌ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు.


3 టీఎంసీలు ఇచ్చేందుకు అంగీకరించి..

కర్ణాటక సర్కారుతో రెండు రోజుల చర్చల అనంతరం నవంబరు చివరి వరకు 3 టీఎంసీల నీటిని ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది. ఆ నీరు వస్తే తాగునీటి అవసరాల కోసం నిల్వ చేసి అప్పటికే నిల్వ ఉన్న 6 టీఎంసీల లైవ్‌ వాటర్‌ను వరికి విడుదల చేయాలని భావించారు. ఇరిగేషన్‌ అడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహించి కర్ణాటక నీటి విడుదలకు ఒప్పుకొన్న దృష్ట్యా నవంబరు 27 వరకు నీరిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కర్ణాటక నుంచి నీరు రావడం లేదనే విమర్శలు రావడంతో.. ప్రస్తుతం ఉన్న నిల్వలో రెండు టీఎంసీల కంటే ఎక్కువ ఖాళీ ఏర్పడిన తర్వాత విడుదల చేసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పుడు మాత్రం నవంబరు 27 వరకు నీటి విడుదల సాధ్యంకాదని, అక్టోబరు 31 నుంచి నవంబరు 3 సాయంత్రం వరకు మాత్రమే నీరిస్తామంటూ లేఖ విడుదల చేశారు. నవంబరు చివరి వరకు నీరిస్తామని ప్రకటించి వారబందీ పద్ధతిలోనూ నీటిని ఇవ్వలేమని చెప్పడం అన్యాయమని రైతులు వాపోతున్నారు.


వ్యతిరేకతతోనే విడుదల లేదా..?

నీరిస్తామని అంగీకరించిన కర్ణాటక.. ఆ తర్వాత నీటిని విడుదల చేయకపోవడానికి కారణం అక్కడి రైతులు, రైతు సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకతేనని తెలుస్తోంది. తమ వద్ద కూడా ఎల్‌నినో పరిస్థితులు ఉన్నాయని, 3 టీఎంసీలు దిగువకు విడుదల చేస్తే తాము నష్టపోతామని చెప్పడంతో కర్ణాటక ప్రభుత్వం వెనక్కితగ్గినట్లు సమాచారం. ఒప్పందం తర్వాత రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ నుంచి పర్యవేక్షణ లేకుండా పోయిందని సమాచారం. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.749 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఇందులో 3.042 టీఎంసీలు మాత్రమే విడుదల చేసుకోవడానికి వీలుంటుంది. మిగతా మొత్తం డెడ్‌స్టోరేజీకే సరిపోతుంది. జూరాల ఆధారంగా గద్వాలకు పూర్తిగా, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు పాక్షికంగా మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ద్వారా నీరందుతోంది.


తాగునీటికి కనీసం 2.50 టీఎంసీలు అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుతం వాడుకోదగిన నీటిలో నవంబరు 3 వరకు నీటి ని విడుదల చేస్తే 0.5టీఎంసీ వరకు అయిపోతాయి. ఇక మిగతా నీటిని కచ్చితంగా స్టోర్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ప్రాజెక్టు అధికారులు నవంబరు 3 వరకే సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, నవంబరు చివరి వరకు నీరివ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఎగువ నుంచి నీరు రాకపోతే కచ్చితంగా విడుదల చేయలేమంటున్నారు. ప్రస్తుతం 800 క్యూసెక్కుల వరద వస్తోంది. నారాయణపూర్‌ నుంచి రోజుకు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేయించుకున్నా పంటలు గట్టెక్కే అవకాశం ఉంటుంది.


నెలాఖరు వరకు విడుదల చేయాలి

నవంబరు చివరి వరకు సాగునీటిని విడుదల చేస్తేనే పంటలు గట్టెక్కే అవకాశాలున్నాయి. ఆగస్టు మొదటి వారంలో నాట్లు వేశాం. రెండు నెలలు మాత్రమే నీటిని విడుదల చేసి మధ్యలోనే నిలిపివేస్తే పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం పంటలు పొట్టదశలో ఉన్నాయి. అధికారులు గుర్తించి నెలాఖరు వరకు నీటిని విడుదల చేయాలి.

- మాసన్న, గుంటిపల్లి, వనపర్తి జిల్లా

వారబందీ మాదిరిగానైనా నీరివ్వాలి

అధికారుల ఆదేశాలతోనే ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగు చేశాం. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో మాత్రమే నీటిని విడుదల చేసి పంట చేతికి వచ్చే సమయంలో నీటిని నిలిపివేస్తే పొట్టదశలో ఉన్న కంకి ఎండిపోతుంది. ఇరిగేషన్‌ అధికారులు నవంబరు నెలాఖరు వరకు నీరివ్వాలి.

- ఎల్లన్న, రైతు, మూలమల్ల, ఆత్మకూరు


ఈ వార్తలు కూడా చదవండి:

కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు

డిజైన్లు ధూంధాంగా ఉండాలి

వ్యభిచారం చెయ్‌.. భార్యపై తాగుబోతు భర్త ఒత్తిడి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 04:43 AM