కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:35 AM
కౌమార దశ(అడోల్సెంట్)లో ఉన్న బాలబాలికల ఆరోగ్యం, మానసిక వికాసం, వ్యక్తిత్వ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
వ్యక్తిగత పరిశుభ్రత నుంచి డ్రగ్స్ దుష్ప్రభావాల దాకా
బాలిబాలికలకు ప్రతి నెలా ఒక్కో అంశంపై అవగాహన
బాలికల్లో రక్తహీనత, రుతుస్రావ సమస్యలపైన కూడా
మొదట ప్రతీ ఆశా కార్యకర్త పరిధిలో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురకు శిక్షణ..
వీరి ద్వారా పిల్లలకు అవగాహన
శిక్షణలో ఏఎన్ఎంలు, ఆశాలు, ఉపాధ్యాయుల సహకారం
రాష్ట్రంలోని అన్ని బడుల్లో క్లబ్‌ల నిర్వహణకు ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కౌమార దశ(అడోల్సెంట్)లో ఉన్న బాలబాలికల ఆరోగ్యం, మానసిక వికాసం, వ్యక్తిత్వ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంతో పాటు రక్తహీనత, పోషకాహార లోపం, రుతుస్రావం సమయంలో ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల స్థాయిలో ‘అడోల్సెంట్ క్లబ్’లను నిర్వహించనుంది. ‘రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం(ఆర్కేఎస్కే)’లో భాగంగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా కౌమార బాలబాలికలకు నెలకో అంశంపై అవగాహన కల్పించనున్నారు.
ఇందుకోసం ప్రతి ఆశా కార్యకర్త పరిధిలో మొదట ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలను ఎంపిక చేస్తారు. అవగాహన కల్పించాల్సిన అంశాలపై వీరికి శిక్షణ ఇస్తారు. ఈ నలుగురిని పీర్ ఎడ్యుకేటర్లుగా పిలుస్తారు. తర్వాత వీరు 15-20 మంది కిశోర బాలబాలికలతో బృందాలను ఏర్పాటు చేసి నెలకోసారి సమావేశాలు నిర్వహిస్తారు. తోటి విద్యార్థులకు సరైన ఆరోగ్య సమాచారాన్ని చేరవేయడం, సందేహాలను నివృత్తి చేయడం, చర్చలను ముందుకు తీసుకెళ్లడం వీరి బాధ్యత. ఈ కార్యక్రమాలకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, ఇతర నియమిత సిబ్బంది సాంకేతిక సహకారాన్ని అందిస్తారు.
ప్రతి సమావేశంలో ఒక ప్రధాన అంశాన్ని ఎంపిక చేసుకుని ఆశా, ఏఎన్ఎం లేదా ఆరోగ్య సిబ్బంది సమక్షంలో చర్చిస్తారు. అవసరమైన సందర్భాల్లో బాలబాలికలను అడోలెసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్(ఏఎ్ఫహెచ్సీ)లు, ఇతర ఆరోగ్య సేవలకు పంపిస్తారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన శిక్షణ, సమాచార సామగ్రిని రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం (ఎస్హెచ్ఆర్సీ) సహకారంతో రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ క్లబ్‌లను నిర్వహించాని నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఎండీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. క్లబ్‌ల నిర్వహణకు జనవరి నుంచి డిసెంబరు వరకు ఇప్పటికే ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందించారు.
ఏ నెలలో ఏ అంశంపై అవగాహన కల్పిస్తారు
జనవరి: వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు.
ఫిబ్రవరి: పోషకాహార లోపం, రక్తహీనత నివారణ. ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్(ఐఎఫ్ఏ) మాత్రల వినియోగంపై అవగాహన.
మార్చి: రుతుస్రావ సమయంలో పరిశుభ్రత. అపోహలు-వాస్తవాలపై చర్చలు, శానిటరీ న్యాప్కిన్ల వినియోగంపై అవగాహన.
ఏప్రిల్: మానసిక ఆరోగ్యం, భావోద్వేగాల సమతుల్యత. భావాలను గుర్తించడం, ఒత్తిడిని అధిగమించే పద్ధతులపై కార్యక్రమాలు.
మే: శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి. బహిరంగ ఆటలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, నిద్ర, స్ర్కీన్ టైమ్‌పై చర్చలు.
జూన్: డ్రగ్స్ నివారణ. పొగాకు, మద్యం, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన. వాటికి దూరంగా ఉండే నైపుణ్యాలపై రోల్‌ప్లేలు.
జూలై: లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం. యుక్త వయసులో శారీరక మార్పులు, వ్యక్తిగత హద్దులు, అవసరమైనప్పుడు సహాయం కోరడంపై అవగాహన.
ఆగస్టు: లింగ సమానత్వం, హింస నివారణ. లింగ వివక్షపై అవగాహన, నమ్మకమైన పెద్దలను గుర్తించడం, సహాయ సేవల వివరాలు.
సెప్టెంబరు: జీవిత నైపుణ్యాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. సమస్యల పరిష్కారం, సమాచార మార్పిడి, నిర్ణయాత్మక నైపుణ్యాలపై అభ్యాసాలు.
అక్టోబరు: బాల్యవివాహాల నివారణ, బాలల రక్షణ. చట్టపరమైన రక్షణలు, కౌమార వయసు పిల్లల హక్కులు, చైల్డ్ హెల్ప్‌లైన్, ఫిర్యాదులపై అవగాహన.
నవంబరు: ఇంటర్నెట్ భద్రత. సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు.
డిసెంబరు: బాధ్యతాయుత డిజిటల్ ప్రవర్తన. ఆన్లైన్ వ్యక్తిగత సమాచార గోప్యత, సైబర్ వేధింపుల నివారణపై చర్చలు.
ఈ వార్తలు కూడా చదవండి:
వ్యభిచారం చెయ్.. భార్యపై తాగుబోతు భర్త ఒత్తిడి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News