డిజైన్లు ధూంధాంగా ఉండాలి
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:21 AM
‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’తో తెలంగాణ ప్రతిష్ఠ ప్రపంచస్థాయిలో మరింత పెరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో ఏర్పాటు చేసే డిజైన్లు ధూంధాంగా ఉండాలని చెప్పారు.
కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ డిజైన్లకు ప్రాధాన్యమివ్వండి
రేపు ఢిల్లీలో కర్టెన్ రైజర్‌ను విజయవంతం చేయాలి
నవంబరు మొదటి వారంలోగా ప్రణాళికలు ఖరారు కావాలి
టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ విజయాలపై ప్రచారం చేయాలి
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం: సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’తో తెలంగాణ ప్రతిష్ఠ ప్రపంచస్థాయిలో మరింత పెరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో ఏర్పాటు చేసే డిజైన్లు ధూంధాంగా ఉండాలని చెప్పారు. డిజైన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ గురించి అతిథులు తెలుసుకునేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న డిజైన్ల గురించి సీఎంకు అధికారులు వివరించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7 నుంచి నిర్వహించే సమ్మిట్ కార్యక్రమం, ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్ పో, ఇండియా జాయ్ ఈవెంట్లపై అధికారులకు సీఎం దిశా నిర్ధేశం చేశారు. నవంబరు మొదటి వారంలోగా ప్రణాళికలను ఖరారు చేసుకుని పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈవోలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో గొప్ప విజయాలను సాధించిన ప్రముఖుల గురించి అతిథులకు చాటిచెప్పే విధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రచార ఏర్పాట్లు చేయాలన్నారు.
నగరంలో పలు చోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం చేపట్టాలన్నారు. క్లైమేట్ చేంజ్, ఏఐ రంగాలకు సంబంధించిన ప్రపంచ స్థాయి ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించాలన్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్(ఏవీజీసీ) రంగాలకి సంబంధించి ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో సీఎస్ సంజయ్‌జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి.అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ అనుదీప్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ-2026’ ప్రపంచ సదస్సుకు 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం వివిధ కమిటీలు చేపడుతోన్న ఏర్పాట్లను మంగళవారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. సదస్సులో ప్రధాన వేదికను 25 సెక్టార్లుగా విభజించి, ప్లీనరీ సమావేశాలు, సెమినార్లు, ఒప్పందాల భేటీలు, ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నామని తెలిపారు.
వాతావరణ మార్పులపై ప్రత్యేక సెమినార్
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ‘ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్-2026’లో వాతావరణ మార్పులపైనా(క్లైమేట్ చేంజ్) ప్రత్యేకంగా సెమినార్ నిర్వహించనున్నారు. సదస్సులో ఈసారి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ అనేది ప్రధాన థీమ్‌గా ఉండగా, దానికి సబ్ థీమ్‌గా ఈ క్లైమేట్ చేంజ్‌ను చేర్చాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వాతావరణ నిపుణులతో పాటు వివిధ యూనివర్శిటీలు, సంబంధిత రంగాల్లో పనిచేసే నిపుణులను ఈ సదస్సుకు ఆహ్వానించాలని సూచించారు. సెమినార్‌లో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తుతున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు చేపడుతున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలపై ప్రత్యేక చర్చలు జరపనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News