విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Nov 26 , 2026 | 09:28 PM
ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే.. అప్పులపాలు చేశారంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ మండిపడ్డారు.
నాగర్ కర్నూలు, నవంబర్ 26: ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే.. అప్పులపాలు చేశారంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ మండిపడ్డారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని అన్నారు. రైతుబంధు కోసం రూ.36 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వడ్లు కొనుగోలుకు రూ.90 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పాలమూరు నేలను కృష్ణా జలాలతో తడుపుతానని ప్రకటించారు. తెలంగాణకు కృష్ణా నీళ్లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజమ్మ రొయ్యల పులుసు తిని..
గుండెలో పెట్టుకుని గెలిపిస్తే.. కేసీఆర్ గుండెలపై తన్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయలేక పోయారంటూ బీఆర్ఎస్ నేతల తీరును ఈ సందర్భంగా తప్పుపట్టారు. తమ నీళ్లను వైఎస్ జగన్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రోజమ్మ రొయ్యల పులుసు తిని.. రాయలసీమ రతనాల సీమ చేస్తామని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదు? అంటూ బీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు పాపాల భైరవుడు కేసీఆర్ కాదా?..
కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రోజుకు 11 టీఎంసీలను ఏపీ తరలిస్తోందని ఆరోపించారు. పాలమూరు పాపాల భైరవుడు కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఏపీ నీళ్లు తరలించుకుపోవడానికి కారణం కేసీఆరే అని కుండబద్దలు కొట్టారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లే.. నీళ్లు ఎత్తిపోయలేక పోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పెదవి విరిచారు. ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే.. మీరు జగన్‌కు గులాంగిరీ చేయలేదా? అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. 33 శాతం నీళ్లు చాలు అని నాడు.. మామ, అల్లుళ్లు కలిసి మరణశాసనం రాశారని విమర్శించారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌కు మామ అల్లుళ్లు కేసీఆర్, హరీష్ రావు దోచిపెట్టారని మండిపడ్డారు.
అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని లేకుంటే..
కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని దోచుకుంటారని.. అధికారాన్ని కోల్పోతే మాత్రం ప్రజల్లోకి రారంటూ కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. ఈ 34 నెలల్లో కేసీఆర్ రూ.2 కోట్ల వేతనం తీసుకున్నారని తెలిపారు. కొందరు పోలీసులు విధులకు హాజరుకాలేదని.. దీంతో వారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. మరి కోట్ల రూపాయల జీతం తీసుకుని.. అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను ఏం చేయాలి? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రెండుసార్లు అధికారం అనుభవించిన కేసీఆర్.. నేడు ఫాంహౌస్ నుంచి బయటకు రావట్లేదని అన్నారు. పదేళ్లు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన రక్తంలో తెలంగాణ పౌరషం ఉంది..
రోజమ్మ రొయ్యల పులుసు తాను తినలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. తన రక్తంలో తెలంగాణ పౌరుషం ఉందని ప్రకటించారు. తన పుట్టిన గడ్డకు తానేప్పటికీ ద్రోహం చేయనని అన్నారు. కోటి మంది ఆడబిడ్డలకు సారె పెడుతున్నానని చెప్పారు. సొంత చెల్లినే ఇంటి నుంచి గెంటేశారంటూ కేటీఆర్ వైఖరిని ఈ సందర్భంగా ఎండగట్టారు. కోటి మందిని తాను ఆడబిడ్డలుగా భావించానని.. వారికి ఇందిరమ్మ చీరలు పెడుతున్నానని తెలిపారు.
ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని గుర్తు చేశారు. బతుకమ్మ చీరల్లోనూ మీరు దోపిడీ చేశారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. సూరత్‌కు వెళ్లి కేజీల లెక్కన చీరలు తెచ్చి ఇస్తే ఎవరూ కట్టుకోలేదని విమర్శించారు. వైఎస్ఆర్ మోచేతి నీళ్లు హరీష్‌రావు తాగలేదా? అని నిలదీశారు. అందుకే వైఎస్ జగన్‌ను హరీష్ రావు ఒక్క మాట కూడా అనరన్నారు.
కేసీఆర్‌కు సంక్షేమం అంటే.. ఆయన కుటుంబం, బంధువులే..
అగ్గిపెట్టె దొరకనోళ్లు మంత్రి అయ్యారని హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అగ్గిపెట్టె దొరికిన శ్రీకాంతాచారి అమరుడయ్యాడని తెలిపారు. కేసీఆర్‌కు సంక్షేమం అంటే.. ఆయన కుటుంబం, బంధువులేనని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం 75 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఏడాదిలో మరో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని ఆయన ప్రకటించారు.
బీజేపీ అధికారంలోకి రావడం కల్లే..
తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉంది? అని సీఎం రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచిన సీట్లు ఎన్ని? వచ్చిన ఓట్లు ఎన్ని? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. బీజేపీ వాళ్లతో ఊదు కాలదు.. పీరు లేవదని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి రావడం కల్లేనని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయారని.. ఆయన ఇక్కడకు వచ్చి తనకు నీతులు చెబుతున్నారంటూ రాంచందర్ రావుపై విమర్శలు గుప్పించారు.
కేటీఆర్‌కు బుద్ధి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో..?
కేటీఆర్‌కు గడ్డం రావడానికే 50 ఏళ్లు పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అదే కేటీఆర్‌కు బుద్ధి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో? అంటూ సందేహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సన్న బియ్యం, రేషన్‌కార్డులు ఇచ్చిందా?అని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తాము 8 లక్షల ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు పథకం ఇచ్చామని గుర్తు చేశారు. 365 రోజులూ ప్రజల కోసం ఆలోచిస్తున్నామని తెలిపారు.
పదేళ్లలో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం ఒరిగింది?
ప్రజల మధ్య ఉండే సీఎం తాను కాకుండా ఎవరైనా ఉన్నారా? అని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు విడివిడిగా రావొద్దు.. కలిసిరండి.. తేల్చుకుంటామని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్, సంతోష్‌రావుకు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయని విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం ఒరిగింది? అని ప్రశ్నించారు. నిజాం కంటే ధనవంతుడిగా కేసీఆర్ మారారని అన్నారు. పదేళ్లలో ఆగర్భ శ్రీమంతులయ్యారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.
పాలమూరు అభివృద్ధికి రక్తం ధారపోస్తా..
పాలమూరు అభివృద్ధికి తన రక్తం ధారపోస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరును తెలంగాణకే ఆదర్శంగా తీర్చిదిద్దుతాని తెలిపారు. అచ్చంపేట బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఇందిర గాంధీ స్ఫూర్తితో ఆమె పేరుతోనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు చేపట్టామని వివరించారు. నియంత పాలన ఉండొద్దని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉద్దేశమని గుర్తు చేశారని అన్నారు. అందుకే ఐదేళ్లకోసారి ప్రజాతీర్పు ఇచ్చేలా రాజ్యాంగం రూపొందించారని చెప్పారు.
18 ఏళ్లు పైబడిన వారికి.. ఓటు అనే బలమైన ఆయుధాన్ని అంబేద్కర్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓటు హక్కే మన వజ్రాయుధం అని అభివర్ణించారు. గ్రామాల్లో వెలుగులకు కారణం కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ప్రతి గ్రామానికి బడి, గుడి, రోడ్డు వసతి ఆ పార్టీనే కల్పించిందని తెలిపారు. విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి వర్సిటీలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 62.5 శాతం పోలింగ్.. కందుకూరులో అత్యధికం, శ్రీకాకుళంలో అత్యల్పం
రాత్రి.. లేటుగా నిద్రపోతున్నారా..? అయితే ఈ అవయవాలపై ఎఫెక్ట్ పడ్డట్లే..
Read Latest TG News And Telugu News