Share News

రాత్రి.. లేటుగా నిద్రపోతున్నారా..? అయితే ఈ అవయవాలపై ఎఫెక్ట్ పడ్డట్లే..

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:06 PM

ఎర్లీ టు బెడ్.. ఎర్లీ టు రైజ్ అని పెద్దలు చెప్పారు. అలా అయితే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. అయితే అర్ధరాత్రి వరకూ మొబైల్ చూసి.. ఆ తర్వాత ఎప్పటికో నిద్రపోవడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రి.. లేటుగా నిద్రపోతున్నారా..? అయితే ఈ అవయవాలపై ఎఫెక్ట్ పడ్డట్లే..

ఇంటర్నెట్ డెస్క్: ఎర్లీ టు బెడ్.. ఎర్లీ టు రైజ్ అని పెద్దలు చెప్పారు. అలా అయితే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. అయితే అర్ధరాత్రి వరకూ మొబైల్ చూసి.. ఆ తర్వాత ఎప్పటికో నిద్రపోవడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల మరునాడు తీవ్ర అలసటగా ఉండడం లేదా బద్ధకానికి కారణం కావచ్చని వివరిస్తున్నారు. అంతేకాకుండా.. శరీరంలోని ముఖ్యమైన అవయవాలు.. గుండె, కాలేయం, మెదడుతోపాటు మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు.

అలాగే ప్రతి రోజూ నిద్ర పోయే సమయం మారడం వల్ల శరీరంలో జీవక్రియ, హార్మోన్లు, రక్తంలో చక్కెర నియంత్రణపై ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యమో.. క్రమమైన నిద్రవేళలు పాటించడం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు..

మన శరీరంలోని జీవ గడియారం రక్తంలో చక్కెర స్థాయిలు, జీవక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే తగినంత నిద్ర లేకపోవడం.. కరెక్ట్ సమయానికి నిద్ర పోకపోవడం వల్ల ఇన్సులిన్‌ను ఉపయోగించుకునే శరీర సామర్థ్యంపై ప్రభావం చూసే అవకాశం ఉంది. తద్వారా శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడవచ్చు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రించడం కష్టమవుతుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగితే.. టైప్-2 డయాబెటిస్‌తోపాటు అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంది.


నిరంతర ఆకలి.. తరచూ తీపి పదార్థాలు తినాలనే కోరిక..

రాత్రి ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లపై కూడా ప్రభావం పడుతుంది. గ్రెలిన్ (Ghrelin) అనేది ఆకలిని పెంచే హార్మోన్, లెప్టిన్ (Leptin) అనేది కడుపు నిండిన భావన కల్పించే హార్మోన్. తగినంత నిద్ర లేకుంటే.. ఈ రెండు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీంటుంది. దీనివల్ల తరచూ ఆకలి వేయడంతోపాటు తీపి పదార్థాలు తినాలనే కోరిక కూడా కలుగుతుంది. దీంతో అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినే ధోరణి పెరుగుతుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంది.


కాలేయం పనితీరుపై ప్రభావం..

శరీరంలో కాలేయం ముఖ్యమైన అవయవం. క్రమపద్ధతిలో నిద్రపోకుంటే.. కాలేయంలో గ్లూకోజ్, కొవ్వుల జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దీంతో కాలేయం పనితీరు సరిగ్గా ఉండాలంటే.. క్రమపద్ధతిలో నిద్ర పోవాలి.


రక్తపోటులో హెచ్చుతగ్గులతోపాటు గుండెపై ఒత్తిడి పెంచుతాయి..

నిద్ర లేమితోపాటు ఓ పద్ధతి లేకుండా నిద్ర పోవడం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే రక్తపోటులో హెచ్చుతగ్గులు, శరీరంలో వాపు పెరగడం, గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ప్రతి రోజు ఒక టైమ్‌కు నిద్రపోవాలి. అది అర్ధరాత్రి, అపరాత్రి అన్నట్లుగా కాకుండా.. నిద్ర పోవడానికి ఓ నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకోవాల్సి ఉంటుంది.


జ్ఞాపక శక్తితోపాటు ఏకాగ్రత తగ్గవచ్చు..

మెదడు చురుగ్గా పని చేయడానికి నిద్ర చాలా అవసరం. జ్ఞాపక శక్తికి, ఏకాగ్రతకు, భావోద్వేగాల నియంత్రణకు నిద్ర చాలా సహాయ పడుతుంది. తగినంత నిద్ర లేకుంటే.. అశ్రద్ధ, మతిమరుపు, చిరాకుతోపాటు మానసిక అలసట కలుగుతుంది. దీంతో రోజంతా చిరాగ్గా ఉంటుంది.


మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం..

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మూత్రపిండాలు ప్రమాదంలో పడతాయి. శరీరంలో మూత్రపిండాల పనితీరును నియంత్రించే సహజ జీవ ప్రక్రియలు ఉంటాయి. అవి రక్తపోటు, హార్మోన్ల ఉత్పత్తి, రక్తం వడపోతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో ఆలస్యంగా నిద్రపోవడం.. నిద్ర తగ్గడం వల్ల మూత్రపిండాలకు హాని జరిగే అవకాశం అధికంగా ఉంది.


రాత్రిపూట త్వరగా, గాఢంగా నిద్రపోవాలంటే.. ఏం చేయాలి?

శరీరంలోని జీవ గడియారాన్ని అదుపులో ఉంచడానికి ఓ నిర్దిష్ట సమయంలో నిద్ర పోవడం.. మేల్కొనడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు కొన్ని ముఖ్య అలవాట్లు పాటించాలని సలహా ఇస్తున్నారు.

ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి..

శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వడానికి తగినంత నిద్ర పోవాలి.

నిద్రవేళలు నిర్ణయించుకోవాలి..

వీలైతే.. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడంతోపాటు మేల్కొనడం చేయాలి.

రాత్రి వేళ.. అతిగా తినవద్దు..

నిద్రపోవడానికి ముందు కడుపు నిండా లేదా భారీగా భోజనం చేయవద్దు.


మొబైల్ వాడకాన్ని తగ్గించాలి..

నిద్రపోయే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. కొంత సమయం పాటు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌కు దూరంగా ఉండాలి.

రాత్రిపూట.. కెఫెన్ వినియోగాన్ని నివారించాలి..

సాయంత్రం తర్వాత.. టీ, కాఫీ, కెఫెన్ పానియాల వినియోగాన్ని నివారించడం చాలా మంచిది.

రాత్రి వేళ నిద్రపోయే ముందు..

ఏదైనా మంచి పుస్తకం చదవడం. లేదా గోరు వెచ్చని పాలు తాగడంతోపాటు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

Updated Date - Nov 26 , 2026 | 04:54 PM