తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోంది: కేటీఆర్
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:55 PM
తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొలగించిన ఆక్రమణలను కేటీఆర్ పరిశీలించారు.
ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొలగించిన ఆక్రమణలను కేటీఆర్ ఇవాళ(గురువారం) పరిశీలించారు. బాధితులను కేటీఆర్ పరామర్శించి, మాట్లాడారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుందని.. ఖమ్మం ప్రజల సమస్యను శాసనసభలో ప్రస్తావిస్తామని అన్నారు. మీ అందరికీ న్యాయం జరిగే వరకూ మీ పక్షాన ప్రభుత్వంపై పోరాడతామని చెప్పుకొచ్చారు.
ఇళ్లు కట్టిస్తాం..
తాము అధికారంలోకి రాగానే మీ అందరికీ ఇదే స్థలంలో ఇళ్లస్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టిస్తామని మాజీమంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. అందరూ ధైర్యంగా ఉండాలంటూ బాధితులకు కేటీఆర్ మాటిచ్చారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎక్కడ చూసినా కూల్చివేతలేనని ఆరోపించారు. ఖమ్మంలో కూల్చివేసిన కాలనీ చూశానని.. ముగ్గురు మంత్రులకు 60 ఎకరాల మీద కన్నుబడిందని ఆక్షేపించారు. ముగ్గురు మంత్రులు కలిసికట్టుగా ఈ దుర్మార్గం చేశారని విమర్శించారు.
అన్యాయం చేయలేదు..
కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికీ తాము అన్యాయం చేయలేదని మాజీమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. మీ అందరికీ అదే ప్రాంతంలో, అక్కడే ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామని మాటిచ్చారు. ఇక్కడి వారందరికీ అండగా నిలబడాలని తాను ఇక్కడకు వచ్చానని చెప్పుకొచ్చారు. ఇళ్ల కూల్చివేతపై కోర్టుకి కూడా వెళ్దామని.. మీకెవరికీ ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ తరఫున తమ లీగల్ టీం పోరాడుతుందని మాజీమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్
ఖర్గేని కలిసిన జగ్గారెడ్డి.. అసలు విషయమిదే..
Read Latest Telangana News And AP News And Telugu News