ఖమ్మంలో ఘోరం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:04 PM
ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పచ్చని సంసారంలో వచ్చిన కుటుంబ కలహాలు ఇద్దరు అమాయక చిన్నారుల ప్రాణాలను బలితీసుకున్నాయి.
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పచ్చని సంసారంలో వచ్చిన కుటుంబ కలహాలు ఇద్దరు అమాయక చిన్నారుల ప్రాణాలను బలితీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం కారణంగా ఓ తల్లి, తన ఇద్దరు కన్నబిడ్డలకు ఎలుకల మందు తినిపించి, తాను కూడా తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతిచెందగా, తల్లి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ నేపథ్యం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బాల లింగరాజుకు, చింతకాని మండలం నరసింహపురం గ్రామానికి చెందిన స్వాతితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి వేదిక్ (7), తనుష్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లింగరాజు పాల వ్యాపారం చేయడంతో పాటు ఖమ్మంలోని ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా ఈ కుటుంబం ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతంలో ఒక ఇంట్లో అద్దెకు నివాసం ఉంటోంది.
క్షణికావేశం.. ఇద్దరు చిన్నారుల బలి
గత కొంతకాలంగా లింగరాజు, స్వాతి దంపతుల మధ్య తీవ్రమైన మనస్పర్థలు, కుటుంబ కలహాలు కొససాగుతుతున్నాయి. నిన్న (శనివారం) సాయంత్రం కూడా వీరి మధ్య పెద్దఎత్తున వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవతో తీవ్ర మనస్థాపానికి, క్షణికావేశానికి లోనైన స్వాతి తన ఇద్దరు కుమారులకు బలవంతంగా ఎలుకల మందు తినిపించింది. ఆ తర్వాత ఆమె కూడా అదే ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
చికిత్స పొందుతూ పిల్లలు మృతి.. తల్లి పరిస్థితి విషమం..
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే విషం శరీరం అంతటా పాకడంతో ఇద్దరు చిన్నారులు వేదిక్, తనుష్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తల్లి స్వాతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
పోలీసుల విచారణ..
ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, కుటుంబ కలహాలకు గల కారణాలపై భర్త లింగరాజును, బంధువులను విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News