Share News

ఇంకా అందని ‘చేయూత’...

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:56 AM

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు చేయూత పథకం ద్వారా అందిస్తామని ప్రకటించింది. అయితే.. అవి నేటికీ మంజూరు కాలేదు.

ఇంకా అందని ‘చేయూత’...
Cheyutha pensions, Telangana Govt

  • తెరుచుకోని వెబ్‌సైట్‌

  • నూతన పింఛన్ల కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు

  • కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు చేయూత పథకం ద్వారా అందిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న కొత్తగా లక్ష పింఛన్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా కొత్తగా అర్హులైన వందలాది మంది పింఛన్ల కోసం అర్జీలు పెట్టుకొని ఎప్పుడెప్పుడు చేయూత అందుతుందనే ఆశతో ఎదురుచూశారు. జూన్‌ 2న ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరాశ చెందారు. దరఖాస్తు చేసుకున్న వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమాల్లో కూడా అనేక మంది చేయూత పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు.


  • 38 వేల మంది దరఖాస్తు

జిల్లావ్యాప్తంగా దాదాపు 38 వేల మంది వరకు పింఛన్లకోసం దరఖాస్తు చేసుకోగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారితో కలిపి దాదాపు 15 వేల మంది అర్జీలు పెట్టుకున్నట్లు తెలిసింది. వీరిలో అర్హులైన వారిని గుర్తించి కొత్తగా పింఛన్లను మంజూరు చేయలేదు. కొత్తగా మంజూరు చేసే పింఛన్లలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. మరోవైపు కొంత మంది ఇప్పటికీ సంబంధిత అధికారులకు దరఖాస్తు ఫారాలను అందిస్తూనే ఉన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 57 ఏళ్ళు నిండిన వారందరికీ వృద్దాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. దీంతో 57 ఏళ్లు పైబడిన వారంతా పెన్షన్ల కోసం దరఖాస్తుచేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పెన్షన్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాక పోవడంతో అప్పుడు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి పెట్టారు. ఇక ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తూనే ఉన్నారు.


  • నాలుగున్నరేళ్లుగా..

బీఆర్‌ఎస్‌ పాలనలో రెండేళ్లు, కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్లు.. మొత్తంగా నాలుగున్న రేళ్లుగా వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదు. ఎప్పుడు వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే అప్పుడే పింఛన్లు మంజూరు చేసే అవకాశముంటుందని, ఇప్పటి వరకు కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా రాలేదని అధికారులు చెబుతున్నారు.


jgl2.2.jpg

  • అనర్హులను, చనిపోయిన వారిని గుర్తించేందుకు సర్వే

జిల్లాలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో 1,37,700 మందికి ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. వారిలో అనర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. జిల్లాలో 4,200 మంది లబ్ధిదారులు చనిపోయినట్లు గుర్తించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనర్హులు, చనిపోయిన వారి పేర్లను తొలగించి వారి స్థానంలో కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేసే అవకావముందని అధికారులు చెబుతున్నారు. కాని ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో అనర్హులకు, చనిపోయిన వారి ఖాతాల్లో పెన్షన్‌ డబ్బులు జమవుతోంది. అర్హులైన కొత్తవారికి పింఛన్లు అందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంపింఛన్‌ మొత్తాన్ని పెంచడంతోపాటుగా అర్హులైన వారందరికి పింఛన్లు అందించాలని ప్రజలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రైతులకు శుభవార్త.. రెండెకరాలకు ఒకేసారి యూరియా!

ములుగు కొండల్లో అపురూప రాతి చిత్రాలు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 11:56 AM