దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా?
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:21 AM
ఒకే గదిలో అందరూ ఉన్నా దోమలు మాత్రం కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. మరి, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దోమలు 'నన్నే ఎందుకు ఎక్కువగా కుడుతున్నాయి?' అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే దీనికి యాదృచ్ఛికం మాత్రమే కారణం కాదు. మన శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, చెమటలోని రసాయనాలు, శరీర ఉష్ణోగ్రత, బ్లడ్ గ్రూప్, చర్మంపై ఉండే బ్యాక్టీరియా వంటి అనేక అంశాలు దోమలను ఆకర్షిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఒకే గదిలో ఉన్నప్పటికీ కొందరినే దోమలు ఎక్కువగా కుడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
కార్బన్ డయాక్సైడ్
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మనం శ్వాస తీసుకుని వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. దోమలు ఈ వాయువును దూరం నుంచే గుర్తించగలవు. వ్యాయామం చేసే వారు లేదా శారీరకంగా ఎక్కువ శ్రమించే వారు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తారు. అందుకే వారివైపు దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయి.
చెమట, శరీర వేడి కూడా కారణమే
మన చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా వంటి రసాయనాలు దోమలను ఆకర్షిస్తాయి. అలాగే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వారిని కూడా దోమలు త్వరగా గుర్తిస్తాయి.
బ్లడ్ గ్రూప్ ప్రభావం ఉందా?
కొన్ని అధ్యయనాల ప్రకారం.. 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని దోమలు ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉందని గుర్తించారు. 'A' బ్లడ్ గ్రూప్ ఉన్నవారితో పోలిస్తే, 'O' గ్రూప్ ఉన్నవారిని దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. 'B' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈ రెండింటి మధ్యస్థంగా ఉన్నట్లు చెబుతున్నారు.
జన్యువుల పాత్ర కూడా ఉంది
కొంతమంది శరీర లక్షణాలు దోమలను ఎక్కువగా ఆకర్షించేలా ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే కొందరిని దోమలు ఎక్కువగా కుడుతుంటే, మరికొందరిని తక్కువగా కుడుతాయి.
బ్యాక్టీరియా ప్రభావం
మన చర్మంపై సహజంగా ఉండే బ్యాక్టీరియా చెమటను విచ్ఛిన్నం చేసి ప్రత్యేకమైన వాసనను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాసన కొంతమందిలో దోమలను ఎక్కువగా ఆకర్షించవచ్చు. అందుకే ఒకే ఇంట్లో ఉన్న వారిలో కూడా కొందరినే దోమలు ఎక్కువగా కుడతాయి.
గర్భిణులకు దోమకాట్లు
గర్భధారణ సమయంలో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరగడంతో పాటు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఈ కారణంగా గర్భిణీలను దోమలు ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్