‘సర్’ నోటీసుల కలకలం..
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:30 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితాలో మ్యాపింగ్ చేయని, ఇతర వివరాలు సరిపోలని వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.
కళాభారతిలో 20 ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
కరీంనగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితాలో మ్యాపింగ్ చేయని, ఇతర వివరాలు సరిపోలని వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. మ్యాపింగ్ ప్రకారంగా ఓటరు పేరు, తండ్రి పేరు గత జాబితాకు సరిపోలక పోవడం, తల్లితండ్రులతో అనుసంధానం చేసిన మరో సంతానంతో పోలిస్తే వయసు మధ్య తొమ్మిది నెలల కంటే తక్కువగా ఉండడం, తల్లితండ్రి వయసు మధ్య తేడా 50 ఏళ్లకు మించి ఉండడం, ఒకే వ్యక్తిని పలువురు తండ్రిగా పేర్కొనడం,
ఇతర వివరాలకు తేడాలు ఉండడం, పొరపాట్లు, తప్పులు ఉన్న ఓటర్లకు నోటీసులు అందిస్తు న్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈనెల 10న ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ముసాయిదా జాబితా ప్రకారంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,68,214 మంది ఓటర్లు ఉన్నారు. 2002 ఓటరు జాబితాకు తాజా జాబితాకు తేడాలుండడంతో నియోజకవర్గంలో 94 వేల మందికి ఆధారాలను చూపించి తప్పులను సరి చేయించు కోవాలంటూ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేరుతో నోటీసులు జారీ చేస్తున్నారు.
నగర పరిధిలో 63,942 మందికి నోటీసులు
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 63,942 మందికి నోటీసులను సంబంధిత బీఎల్‌వోల ద్వారా జారీ చేశారు. నోటీసు వెనుక భాగంలో సూచించిన ఆధారాలను చూ పించిన వెంటనే వాటిని సరిచేస్తూ ఆన్‌లైన్ చేసేందుకు బీఎల్‌వోలకు ప్రత్యేక తేదీలు, సమయాలను కేటాయించారు. కళాభారతి ఆడిటోరియంలో 20 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సరి చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించారు.
బీఎల్‌వోలు జారీ చేస్తున్న నోటీసుల్లో పేర్కొన్న తేదీ, సమయంలో కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో నోటీసు జారీ అయిన వ్యక్తులు స్వయంగా ఆధారాలను చూపించాలి. సెప్టెంబరు 22 వరకు నోటీసులు జారీ చేసిన వారి ఆధా రాలను పరిశీలించి తుది ఓటరు జాబితాను రూపొందిస్తారు. గతంలో ఓటు హక్కు కలిగి ఉండి ముసాయిదా జాబితాలో పేర్లు రానివారు అభ్యంతరాలతో దరఖాస్తు చేసుకుంటే ఆధారాలను పరిశీ లించి ఓటు హక్కును కల్పిస్తారు.
కొత్తగా ఓటు హక్కు కోసం ఫారం- 6ను సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేసుకునే అవకాశాన్ని కలిస్తున్నారు. బీఎల్‌వోలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాల్లోని వివరాలను సరిగానే పూర్తిచేసి సరైన ఆధారాలను జత చేసి బీఎల్‌వోలుకు సమర్పించినా నోటీసులు జారీ చేయడమేమిటనీ పలువురు ప్రశ్నిస్తున్నారు. తిరిగి తప్పులు జరగకుండా తుదిజాబితాను రూపొందించాలని, అర్హులైన వారి ఓటు హక్కు పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోజుకు 3.70 లక్షల మంది ప్యాసింజర్లు!
అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి
Read Latest AP News And Telangana News And International News And Telugu News